పెద్దల సభలో బీసీలకు పెద్దపీట

రాజ్య‌స‌భ‌కు ఇద్దరు బీసీలను ఎంపిక చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అభ్యర్థులను ప్రకటించిన వైయ‌స్ఆర్ సీపీ 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, మరో అభ్యర్థిగా బీదా మస్తాన్ రావు

స్థానిక ఎన్నికల నుంచి రాజ్యసభ వరకు అన్నింటా బీసీలకు అగ్రతాంబూలం

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: బీసీలు అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అని నమ్మిన సీఎం వైయస్‌ జగన్, ఆచరణలో చేసి చూపుతున్నారని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. రాజ్య‌స‌భ‌కు వైయ‌స్ఆర్ సీపీ త‌ర‌ఫు నుంచి ఇద్ద‌రు బీసీల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌న్నారు. స్థానిక సంస్థ‌ల నుంచి రాజ్య‌స‌భ వ‌ర‌కు అన్నింటా బీసీల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద‌పీట వేశార‌ని చెప్పారు. రాజ్యసభకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా  విజయసాయిరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావులను ఎంపిక చేసినట్లు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు ప్రకటించారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారంటే..  
బీసీలకు సముచిత స్థానం ఇస్తూ, వారిలో ఉన్న రాజకీయ పటిమకు అవకాశం ఇవ్వాలని సీఎం వైయ‌స్‌ జగన్ నిర్ణయించారు. అందులో భాగంగానే బలహీనవర్గాలకు చెందిన ఇద్దరు ఆర్‌.కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావును రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేశారు. గతంలో కూడా ఇద్దరు బీసీలు.. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు అవకాశం ఇచ్చారు. ఇది రాష్ట్ర చరిత్రలో గతంలో ఏనాడూ జరగలేదు. బలహీన వర్గాలకు సీఎం వైయ‌స్ జగన్ సముచిత స్థానం కల్పించినట్టుగా గతంలో ఎవరూ చేయలేదు. ఇందుకు సీఎం వైయస్‌ జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
    
ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అనే ప్రస్తావన రాదు. బలహీన వర్గాలకు ఏ విధంగా అవకాశం ఇస్తున్నాం అనేదే ముఖ్యం. బీసీలకు సంబంధించి ఆర్‌.కృష్ణయ్య జాతీయ నాయకుడిగా ఉన్నారు. ఆయనకు ఈ అవకాశం ఇచ్చి, బీసీలకు మా పార్టీ ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తుందన్న విషయాన్ని సీఎం చేతల్లో చూపారు. ఇక నిరంజన్‌రెడ్డి సీనియర్‌ లాయర్‌. ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది.

సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే..  
బీసీలు అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు. బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అని నమ్మిన సీఎం వైయస్‌ జగన్, ఆచరణలో చేసి చూపుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన దీన్నే అమలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు మొదలు రాజ్యసభ ఎన్నికల వరకు అన్నింటా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక పార్టీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్.  ఏ ఎన్నికలో అయినా సీఎం వైయ‌స్ జగన్ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవాళ కూడా రాజ్యసభ అభ్యర్థులుగా  నలుగురిలో ఇద్దరు బీసీలకు ఇచ్చారు. నిజం చెప్పాలంటే సాక్షాత్తూ ఒక బీసీ సీఎంగా ఉన్నప్పటికీ, ఈ విధంగా నిర్ణయం తీసుకునే వారు కాదేమో. కానీ సీఎం వైయస్‌ జగన్‌ బీసీలకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయంగా తగిన గుర్తింపు, పదవులు ఇస్తున్నారు.
    
సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఎంపిక చేసిన ఆర్‌.కృష్ణయ్య తన జీవితమంతా బీసీల కోసం నిలబడ్డారు. వారి సమస్యలపై పోరాడారు. బీసీలందరికీ ఒక గుర్తుగా నిల్చారు. కాబట్టి అలాంటి వారిని అత్యున్నత సభలో కూర్చోబెడితే, బీసీల పక్షాన ఆయన గళం చక్కగా వినిపిస్తారని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

బీసీల పార్టీ అని చెప్పుకుంటూ, కేవలం ప్రచారానికే పరిమితం అయిన తెలుగుదేశం పార్టీ, వారికి ఇస్త్రీ పెట్టెలు, ఏవో పనికిరాని పనిముట్లు ఇచ్చి ఊర్కుంది. అంతేతప్ప బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. గతంలో కూడా వైయస్ఆర్ సీపీ ఇద్దరు బీసీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చారు. ఆయన ఆ విధంగా బీసీల పట్ల తన చిత్తశుద్ధి చూపారు. అలాగే మహిళలకు కూడా అవకాశం ఉన్న చోట, భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం కల్పిస్తారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా సీఎం వైయస్‌ జగన్‌ అవకాశం ఉన్న చోట పదవులు ఇస్తారు. ఆ విధంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీలకు రాజకీయంగా తగిన ప్రాతినిథ్యం కల్పిస్తారు. ఈ మూడేళ్లలో చేసిన అన్ని నామినేటెడ్‌ పోస్టుల్లో.. చివరకు దేవాలయాల బోర్డుల్లో కూడా ఆయా వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top