గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయి

వైయస్‌ఆర్‌ కల్యాణ మస్తు, షాదీ తోఫా ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సాయం 

4,536 కుటుంబాలకు రూ.38.18 కోట్లు పంపిణీ

పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రాధాన్యత

డ్రాపౌట్‌ రేట్‌ తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకం అమలు

ఖర్చుకు వెనుకాడకుండా నిధులు ఖర్చు చేస్తున్నాం

ఈ పథకం పొందాలంటే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి

లంచాలు, వివక్షతకు తావులేండా పథకం అమలు

లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి:  గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, విభిన్న ప్రతిభావంతులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైయ‌స్ఆర్‌ కల్యాణమస్తు, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైయ‌స్ఆర్‌ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంద‌న్నారు. 2022 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి వీటి ద్వారా లబ్ధి చేకూర్చేలా,  పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడం, విద్యా సంస్థల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్‌ రేట్‌ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ పథకాల కింద రాష్ట్రంలోని అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.  ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడారు. 

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

మూడు నెలలకొకమారు మంచి చేస్తూ...
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వైఎస్‌ఆర్‌ కళ్యామస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా అనే ఈ పథకాలను తీసుకొస్తూ... అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో పెళ్లి చేసుకున్నవారికి ఒక నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చాం. అర్హులెవరూ మిస్‌ కాకూడదనే ఉద్దేశ్యంతో డిసెంబరులో పెళ్లి చేసుకున్నవారికి కూడా జనవరి చివరి వరకూ అవకాశం ఇచ్చి ఫిబ్రవరిలో వెరిఫికేషన్‌ పూర్తి చేసి ఇవాళ నేరుగా బటన్‌ నొక్కి వారికి సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. 
ప్రతి సంవత్సరం ప్రతి మూడు నెలలకొకమారు ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతుంది. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు పెళ్లి అయిన వారికి జనవరి చివరి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరిలో వారికి ఇవ్వాల్సిన ప్రోత్సహకం అందుతుంది. అదే విధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో పెళ్లి చేసుకున్నవారికి ఏఫ్రిల్‌ చివర వరకు దరఖాస్తు చేసుకునే అవకాశంఉంటుంది. వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాన్ని మే నెలలో అందిస్తాం. ఇలా ప్రతి మూడు నెలలకొకమారు మంచి చేసే కార్యక్రమమిది.

చదువు - పేదవాడి తలరాత మార్చే అస్త్రం.
ఈరోజు మనం చేస్తున్న ఈ పథకం సమూలంగా ఒక మార్పు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. పేదవాడి తలరాత మారాలంటే చదువు అనే అస్త్రం వారికి మనం ఇవ్వగలిగితేనే వాళ్ల తలరాతలు మారుతాయి. దీన్ని మన ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. అందుకనే పేదవాళ్ల చదువులు మీద పెట్టే ప్రతి రూపాయిని, పిల్లలను చదివించడానికి పెట్టే ప్రతి రూపాయిని కూడా ఖర్చు కింద భావించడం లేదు. దాన్ని పిల్లకిచ్చే ఆస్తి కింద భావిస్తుంది. వాళ్ల జీవితాలు బాగుపడటానికి ఇది ఉపయోగపడాలనే తపన, తాపత్రయంతో ఆ పిల్లల కోసం ఆ కుటుంబసభ్యుడిగా, ఆ కుటుంబంలోని ప్రతి వారికి అండగా నిలబడే కార్యక్రమం చేస్తున్నాం.

వయసుతో పాటు చదువు కూడా అర్హతగా..
ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమంలో వయస్సు ఒక్కటే అర్హత అన్నది కాకుండా చదువును కూడా అర్హతగా నిబంధన విధించాం. పెళ్లిళ్లు అయిన వాళ్లు చదువుకున్న వాళ్లు కాబట్టి వాళ్ల తరమే కాకుండా తర్వాత తరం కూడా ఆటోమేటిక్‌గా చదువులు బాట పట్టించే గొప్ప సాంప్రదాయానికి నాంది పలికాం. వ్యవస్ధలో మార్పు జరుగుతుంది. దీని ద్వారా పిల్లల చదువులను ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం, డ్రాపౌట్స్‌ లేకుండా బడులలో చేరేవారి శాతాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తున్నాం.

ఉన్నత చదువుల దిశగానూ...
వివాహానికి చెల్లెమ్మలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, తమ్ముళ్లకు 21 సంవత్సరాలుగా నిర్ణయించడంతో పాటు  పదోతరగతి పాస్‌ సర్టిఫికేట్‌ కచ్చితంగా ఉండాలని కూడా చెప్పాం. దీంతో ఈ ప్రోత్సాహకం ఒకటి ఉందన్న భావనతో దీనికోసమైనా  పదోతరగతి కచ్చితంగా చదవించాలన్న నిర్ణయానికి వస్తారు. పదోతరగతి చదివిన తర్వాత... పెళ్లికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి కాబట్టి.. పదోతరగతితోనే చదువు ఆగిపోకుండా తర్వాత ఇంటర్‌ మీడియట్‌ చదవుతారు. దీనికోసం ఎలాగూ అమ్మఒడి పథకం ఉంది. పిల్లలను బడికి పంపిస్తే జగనన్న తోడుగా ఉంటాడనే భరోసా ఎలాగూ ఉంది కాబట్టి... ఇంటర్‌ మీడియట్‌ వరకు అడుగులు వేయిస్తారు. ఆ తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన పథకాలున్నాయి కాబట్టి ఇంటర్‌మీడియట్‌తో చదువులు ఆగిపోకుండా డిగ్రీ వరకు చదివించడానికి అడుగులు ముందుకు వేయడానికి మనం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రోత్సహంగా నిలుస్తుంది.

దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు భవన నిర్మాణ కార్మికుల్లో ఆడపిల్లలున్న కుటుంబాలకు మంచి జరుగుతుంది. 

4,536 మందికి రూ.38.18 కోట్ల లబ్ధి. 
ఈ కార్యక్రమానికి సంబంధించి గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు పెళ్లి చేసుకున్న వారిలో అర్హులైన 4,536 జంటలకు వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా కింద రూ.38.18 కోట్లు ఆర్ధిక సాయాన్ని బటన్‌ నొక్కి వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తున్నాం. 

ఈ కార్యక్రమానికి సంబంధించి చాలా మంది నుంచి సలహాలు, సూచనలు తీసున్నతర్వాత వచ్చే త్రైమాసికం నుంచి ఈ డబ్బులు పెళ్లి కూతుళ్ల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కారణం తల్లులను ప్రోత్సహిస్తేనే పిల్లలు పదోతరగతి వరకు చదువుతారు. అందుకే వచ్చే త్రైమాసికం నుంచి ఈ మార్పు జరుగుతుంది. 

చదువులు ఆగకూడదనే లక్ష్యంతో..
పిల్లలకు చదువు అనే ఆస్తిని మనం ఇవ్వలేకపోతే పిల్లల జీవితాలను మనం ఏ రకంగానూ బాగుపర్చలేం. అందుకనే మ్యారెజెస్‌ కెన్‌ వెయిట్‌ బట్‌ ఎడ్యుకేషన్‌ కెనాట్‌ అంటే పెళ్లిళ్లు ఆగవచ్చు కానీ.. చదువు ఆగిపోకూడదు అనే నానుడిని కూడా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం మహిళలు చదువులు బాట పడితేనే సమాజం బాగుపడుతుంది. 
పిల్లల చదువులు కోసం మనం ఇవాళ వేసే అడుగుతో పది సంవత్సరాల తర్వాత వారి భవిష్యత్‌ ఎలా ఉంటుందన్న ధృక్ఫధం, ఆలోచనతో అడుగులు ముందుకు వేయాల్సి ఉంది. 

ప్రపంచంతో పోటీ పడి గెలవాలని..
కారణం ఇవాళ పిల్లలు వాళ్ల ఊరి పిల్లలతోనే, పక్క ఊరి పిల్లలలతోనే పోటీపడ్డం లేదు. ఇవాళ ప్రపంచమంతా పోటీలో ఉంది. మన చదువులు ప్రపంచంలో మన పిల్లలను ఎక్కడైనా నిలబెట్టించి,  ప్రపంచంతో పోటీ పడి గెలిచే పరిస్థితులు ఉన్న చదువులు మనం ఇవ్వగలిగితేనే వారి భవిష్యత్తు బాగుపడుతుంది.

అమ్మ ఒడి మొదలు...
అందుకనే పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రతి అడుగు ఆ దిశాగానే వేస్తున్నాం. తల్లులను ప్రోత్సహించి పిల్లలను బడికి ప్రోత్సహించేలా అమ్మఒడి పథకం నుంచి మొదలు పెడితే.... అంగన్‌వాడీలలో పిల్లలకు పౌష్టిహాకారం ఇచ్చేందుకు దాన్ని నాణ్యతను పెంచుతూ సంపూర్ణ పోషణం అందిస్తున్నాం. మరోవైపు రోజుకొక మెనూతో గోరుముద్ద అనే పథకాన్ని తీసుకొచ్చి పిల్లలను ప్రోత్సహిస్తూ వాళ్లు మెరుగ్గా నేర్చుకునేందుకు అడుగులు వేయిస్తున్నాం. 

పిల్లలకు స్కూళ్లు తెరవడంతోనే అదే రోజు పుస్తకాలు, నోట్‌బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్‌లు, బ్యాగుతో సహా విద్యాకానుక కిట్‌ కూడా ఇస్తున్నాం. ఇంగ్లిషు మీడియం, ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లిషుతో కూడిన బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు, 6 వతరగతి మొదలు ఆ పై ప్రతి తరగతిని డిజిటలైజ్‌ చేస్తున్నాం. నాడు నేడు కార్యక్రమం చేపట్టిన స్కూళ్లలో నాడు–నేడు చివరి కార్యక్రమంగా ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌(ఐఎఫ్‌పి)ను ఏర్పాటు చేస్తున్నాం. ఇంగ్లిషు మీడియంతో సీబీఎస్‌ఈ సిలబస్‌ను తీసుకొస్తున్నాం. 8వ తరగతిలోకి అడుగు పెట్టిన ప్రతి విద్యార్ధికి ట్యాబులను అందించడంతో పాటు బైజూస్‌ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా పిల్లలకు చదువుకునే వెసులుబాటు కల్పించాం. నాడు నేడుతో స్కూళ్లను పూర్తిగా మార్పు చేస్తున్నాం. 

ఉన్నత విద్యలోనూ నడిపిస్తూ..
ఉన్నత విద్యకు వెళ్లేసరికి విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో అడుగులు ముందుకు వేయడంతోపాటు కరిక్యులమ్‌లో మార్పు తీసుకొచ్చి... ఉద్యోగాల దిశగా అడుగులు వేయిస్తూ చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. వీటితో పాటు ప్రపంచస్ధాయి విద్య కోసం వేరే దేశాలకు వెళ్లి అతి ఉత్తమ కాలేజీలలో సీట్లు సంపాదించుకునేవారికి.. విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా రూ.1.25 కోట్ల వరకు మంజూరు చేస్తూ... చదువుల కోసం మద్ధతు ఇస్తున్నాం. సత్య నాదెళ్ల తరహాలో దేశం గర్వించతగ్గ రీతిలో వాళ్లు ఉండాలని ఈ పథకాన్ని తీసుకొచ్చాం. 

వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా పథకాలతో పాటు ఈ పథకాలన్నింటినీ అమలు చేయడం ద్వారా విద్యారంగంలో పిల్లలకు మంచి జరగాలి, చదువులు పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావాలని అడుగులు ముందుకు వేస్తున్నాం.
ఈ 4,536 మందిని... సాచ్యురేషన్‌ విధానంలో అర్హులు ఎవరూ మిస్‌ కాకూడనే ఉద్దేశ్యంతో గ్రామ సచివాలయాల్లోనే దరఖాస్తు పెట్టుకునే వెసులుబాటు కల్పించాం. మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ కూడా గ్రామసచివాలయాల్లో ఇచ్చే వెసులుబాటూ కల్పించాం. లంచాలకు తావులేకుండా, వివక్షకు తావులేకుండా వాలంటీర్‌ మీ అందరినీ చేయిపట్టుకుని నడిపించి, సాయం చేసే విధంగా కార్యక్రమాన్ని చేస్తున్నాం. 

గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయన్నది గమనిస్తే..
గతంలో అప్పుడు కూడా ఇలా పెళ్లిళ్లు చేసుకుంటే ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అవి నిజంగా మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో కాకుండా కేవలం ఎన్నికలకు మేలు జరగాలన్న ఉద్దేశ్యంతో కేవలం ఫౌడర్‌ కోటింగ్‌లా చేసిన కార్యక్రమాలు. అరకొరగా సొమ్ములు ఇవ్వడంతో పాటు అవి కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితులు. 

2018లో రూ.68.68 కోట్లు ఎగ్గొట్టారు.
2018లో ఏకంగా 17,709 మంది పెళ్లిళ్లకు రూ.68.68 కోట్లు ఇస్తామని చెప్పి పూర్తిగా ఎగురగొట్టి పథకానికే ఎగనామం పెట్టారు. ఇవాళ మాత్రం పిల్లలకు మంచి జరగాలని.. వారికి తోడుగా ఉండాలని, అమౌంట్‌ కూడా పెంచి, సాచ్యురేషన్‌ విధానంలో ప్రతి మూడు నెలలకొకమారు ఈ పథకాన్ని అమలయ్యేలా చేస్తున్నాం. లంచాలకు తావు లేకుండా, వివక్షకు చోటు లేకుండా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. 

గత ప్రభుత్వంలో ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలకు రూ.50 వేలు ప్రకటించి అవి కూడా ఎగరగొట్టిన అధ్వాన్నమైన పరిస్థితులు. ఇప్పుడు మనం వారికి రూ.1లక్ష వరకు పెంచి సాయం అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఎస్సీలు, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే గతంలో రూ.75 వేలు ఇస్తామని ప్రకటనలకే పరిమితమయ్యారు. ఇప్పుడు మనం దాన్ని రూ.1.20 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం.
గతంలో బీసీలకు రూ.35వేలు ఇస్తామని ప్రకటిస్తే.. దానిని మనం రూ.50 వేలకు పెంచి అమలు చేస్తున్నాం.

మనం తీసుకొచ్చిన మార్పులు..
మనం తీసుకున్న మార్పులన్నీ మీరు చూస్తున్నారు. బీసీల కులాంతర వివహాలకు సంబంధించి వాళ్లు రూ.50 వేలు ప్రకటిస్తే మనం రూ.75వేలు ఇస్తున్నాం. మైనార్టీలకు గత ప్రభుత్వం  రూ.50 వేలు ప్రకటిస్తే మనం రూ.1 లక్ష ఇస్తున్నాం. వికలాంగులకు గత ప్రభుత్వం రూ.1లక్ష ఇస్తామని ప్రకటించి ఎగురగొట్టి వారికి అన్యాయం చేస్తే... మనం ఇప్పుడు వారికి రూ.1.50 లక్షలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. భవన నిర్మాణకార్మికులకు గత ప్రభుత్వం రూ.20వేలు ప్రకటిస్తే.. మనం ఇప్పుడు వారికి రూ.40 వేలు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ద్వారా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. పెళ్లిళ్లు చేసుకున్న పిల్లలందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు. 

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎం డి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ కె హర్షవర్ధన్, మైనార్టీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జి సి కిషోర్‌ కుమార్, వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ ఎస్‌ షన్‌ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top