చింత‌మ‌నేనికి సీటిచ్చారంటే..బాబెంత దుర్మార్గుడో?

విజయరాయి స‌భ‌లో వైయ‌స్ ష‌ర్మిల‌

వైయస్ఆర్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు చేశారు

చంద్రబాబుకు జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారా?

చంద్రబాబుది రోజుకో మాట..పూటకో వేషం

వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదాకోసం పోరాటం 

జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మళ్లీ వ్యవసాయాన్ని పండుగ చేస్తారు

 

ప‌శ్చిమ గోదావ‌రి:  దెంద‌లూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ దుర్మార్గుడ‌ని తెలిసీ కూడా చంద్ర‌బాబు ఆయ‌న‌కు సీటిచ్చారంటే..ఆయ‌నెంత దుర్మార్గుడో అర్థం చేసుకోవాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ సోద‌రి వైయ‌స్ ష‌ర్మిల పేర్కొన్నారు. చింత‌మ‌నేని అసెంబ్లీకి వెళ్లే అర్హ‌త లేద‌న్నారు. ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో ఏ ఒక్క‌రికి మేలు జ‌ర‌గులేద‌ని, అనుభ‌వాన్ని దోచుకునేందుకు వాడుకున్నార‌ని విమ‌ర్శించారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే వ్య‌వ‌సాయాన్ని మ‌ళ్లీ పండుగ చేస్తార‌ని చెప్పారు. దెంద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం  విజ‌య‌రాయి గ్రామ స‌భ‌లో వైయ‌స్ ష‌ర్మిల ప్ర‌సంగించారు.

ఆ రికార్డు వైయ‌స్ఆర్‌  సొంతం
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నది ఐదేళ్లు మాత్రమే అయినా అద్భుతంగా పాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒక్క పన్ను కూడా పెంచకుండా అభివృద్ది చేసి చూపించిన రికార్డు వైయ‌స్ఆర్‌  సొంతం. ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో ఇవాళ మనకు చంద్రబాబు చూపిస్తున్నారు. రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశాడు. పసుపు–కుంకుమ అంటూ డ్వాక్రా రుణాల వడ్డీకి కూడా సరిపోకుండా భిక్షం వేస్తున్నట్లు ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నారు. మహిళలను దారుణంగా వంచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చి కార్పొరేట్‌ ఆస్పత్రుల నుంచి తొలగించారు. పేదలు అనారోగ్యం పాలైతే ప్రభుత్వాస్పత్రికే వెళ్లాలని శాసించాడు చంద్రబాబు. మరి ఆయన కుటుంబ సభ్యులకు జబ్బు చేస్తే ప్రభుత్వ ఆస్పత్రికి వెళతారా? 

 అనుభవజ్ఞుడినని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చి..
పోలవరం అంచనాలను చంద్రబాబు కమీషన్ల కోసం రూ.15 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు పెంచారు. మూడేళ్లలో పూర్తి చేస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకోలేదు. అనుభవజ్ఞుడినని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన ఆయన కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఇస్తే అమరావతిలో ఒక్కటి కూడా శాశ్వతం భవనాన్ని నిర్మించలేదు. కనీసం ఒక ఫ్లైఓవర్‌ కూడా కట్టలేని అసమర్థ సీఎం రాజధాని కడతారా? ఇంకో ఐదేళ్లు అధికారం అప్పగిస్తే అమరావతిని అమెరికా మాదిరిగా, శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌లా చేసేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? మన చెవిలో పువ్వులు, క్యాబేజీలు పెడుతున్నాడు. బాబొస్తే జాబొస్తుందన్నారు. కేవలం చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మాత్రమే జాబు వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదు. అలాంటి పప్పు ఏకంగా మూడు శాఖలకు మంత్రై కూర్చున్నాడు. యువతకు మాత్రం ఉద్యోగాలు, నోటిఫికేషన్లు లేవు. ఇది న్యాయమేనా?

బకాయిలను వడ్డీతో సహా చెల్లించమని నిలదీయండి
‘గత ఎన్నికల్లో 600కిపైగా హామీలిచ్చి వాటికి సమాధి కట్టి టీడీపీ మేనిఫెస్టో నుంచి సైతం తొలగించారు. ఇప్పుడు మళ్లీ మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ కొత్త హామీలిస్తున్న చంద్రబాబును నిన్ను నమ్మం బాబూ అని తేల్చి చెప్పండి. చంద్రబాబుకు హామీలను నిలబెట్టుకునే దమ్ముంటే గత వాగ్దానాల తాలూకు బకాయిలను వడ్డీతో సహా చెల్లించమని నిలదీయండి. టీడీపీ నేతలు ఓట్లు అడగటానికి వస్తే ముందు బాకీలు తీర్చమనండి. ఉద్యోగాలివ్వకుండా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆయన బకాయి పడ్డ రూ.1.20 లక్షలను వెంటనే చెల్లించమనండి’

బాబు రేపు ఏమంటారో..?
రాష్ట్రానికి ఊపిరి లాంటి హోదాను నీరుగార్చేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. గత ఎన్నికలకు ముందు హోదా అన్నారు చంద్రబాబు. ఎన్నికల తరువాత ప్యాకేజీ అన్నాడు. మళ్లీ ఇప్పుడు హోదా అంటున్నారు. ఇక రేపు ఏమంటారో ఆయనకే తెలియదు. హోదా కోసం జగనన్న ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రంలో నిరాహార దీక్షలు, బంద్‌లు, యువభేరీలు నిర్వహించి యువతను జాగృతం చేశాడు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పదవులకు రాజీనామా కూడా చేశారు. చంద్రబాబు ఇవాళ యూటర్న్‌ తీసుకుని హోదా కావాలనటానికి జగనన్న కారణం కాదా? గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు అన్నాడు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. ఆయనది రోజుకో మాట, పూటకో వేషం. అందుకే రెండు వేళ్లు చూపిస్తుంటారు.

 చంద్రబాబు పౌరుషం నిద్రపోయిందా? 
చంద్రబాబు ఈమధ్య పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తనకు అలవాటులేని పౌరుషం, రోషం అంటున్నారు. కేసీఆర్‌తో పొత్తు పెట్టుకున్నామని మాపై ఆరోపణలు చేస్తున్నాడు. నిజానికి కేసీఆర్‌తో పొత్తు కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చివరకు హరికృష్ణ మృతదేహం పక్కనే ఉందనే ఇంగితం కూడా లేకుండా టీఆర్‌ఎస్‌తో పొత్తుల గురించి మాట్లాడాడు. అప్పుడు చంద్రబాబు పౌరుషం నిద్రపోయిందా? లేక చచ్చిపోయిందా? సొంతమామకు వెన్నుపోటు పొడిచి కుర్చీని లాక్కున వ్యక్తి పౌరుషం గురించి మాట్లాడతారా? పిల్లి గట్టిగా అరిస్తే పులి అయిపోతుందా? పిల్లి పిల్లే.. పులి పులే. ఓదార్పు యాత్ర చేస్తానంటూ ఇచ్చిన ఒక్క మాట కోసం జగనన్న కాంగ్రెస్‌తో విబేధించి ఒంటరిగా బయటకు వచ్చారు. పౌరుషం, రోషం అంటే అదీ. పిల్లి ఎవరో.. పులి ఎవరో ఇక్కడే అర్థమైపోతోంది. మాకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదు. వైయ‌స్ఆర్‌ సీపీ పొత్తులు లేకుండానే బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందని దేశంలోని ప్రతి సర్వే చెబుతోంది’’.. 

మాట తప్పడు, మడమ తిప్పడు
తొమ్మిదేళ్లుగా ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలోనూ జగనన్న తోడుగా నిలిచారు. విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. పాదయాత్రతో కోట్ల మందిని కలుసుకుని వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నాడు. జగనన్న రాజశేఖరరెడ్డి కుమారుడు. మాట తప్పడు, మడమ తిప్పడు. జగనన్నకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి. బైబై బాబు.. అంటూ ప్రజాతీర్పు చెప్పండి’’

ఈ ఎన్నికలే మీకు ఆయుధం
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ క్రూరుడు, దుర్మార్గుడు అని ష‌ర్మిల విమ‌ర్శించారు. మహిళా తహశీల్దార్ వ‌న‌జాక్షిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు. ఆయనకు అక్కా చెల్లెలులు లేరా? ఇసుక మాఫియా నుంచి, లిక్కరు, భూదందా చేశారు. చింతమనేని ప్రభాకర్‌ మంచివాడని ఒక్కరైనా చెప్పగలరా? అలాంటి దుర్మార్గుడు అసెంబ్లీకి వెళ్లేందుకు అర్హుడా? ఐదేళ్లు ప్రజలను ఎంతగా హింసపెట్టారో మీకు తెలుసు. ఇదే మీకు అవకాశం. ఈ ఎన్నికలే మీకు ఆయుధం. ఆయన బెదిరింపులకు భయపడకండి. మోసపోకండి. డబ్బులకు లొంగకండి. చింతమనేనికి బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దుర్మార్గుడు చింతమనేనికి మళ్లీ సీటు ఇచ్చారంటే అంతకంటే దుర్మార్గుడు ఎవరు ఉండరు. మన సమస్యలకు పరిష్కారం వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడమే అన్నారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్‌ గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్లే. ఈవీఎం మీషన్లను చూడగానే ఒక్కసారి రాజన్నను గుర్తు చేసుకోవాలని సూచించారు. దెంద‌లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్బాయి చౌదరి, ఎంపీ అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్‌ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల‌ని ష‌ర్మిల‌మ్మ విజ్ఞ‌ప్తి చేశారు. 

  

Back to Top