విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో సెప్టెంబరు నెలలోనే డయేరియా మృత్యు ఘంటికలు మోగాయి. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వ్యాధి తీవ్రస్థాయిలో ప్రబలింది. 14 మందిని బలి తీసుకుంది.కలుషిత నీరు కారణంగా పలువురు వాంతులు, విరేచనాలతో గత నెలలోనే అనేకమంది ఆస్పత్రులకు వచ్చారు. గత నెల మూడో వారంలోనే మండలంలోని పెనుబర్తి గ్రామంలో డయేరియాకు ఒకరు మృతి చెందారు. ఈ విషయం పత్రికలు, మీడియాలోనూ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్‌లో కూడా డయేరియా ఔట్‌బ్రేక్ ట్రెండ్ కనిపించింది. డయేరియా వ్యాప్తిపై అధ్యయనానికి, నివారణ చర్యల కోసం ఇటీవల వైద్య శాఖ నియమించిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్‌ఆర్‌టీ) కూడా ఇదే విషయాన్ని నిర్ధారించినట్లు తెలిసింది. ప్రభుత్వం అప్పట్లోనే స్పందించి, వ్యాధి నివారణ చర్యలు చేపట్టి ఉంటే వ్యాధి ఇంతగా ప్రబలి ఉండేది కాదు. ఈ నెల 15 తర్వాత కేసులు విపరీతంగా పెరగడం, మరణాలు ఎక్కువ అవడంతో ప్రభుత్వ యంత్రాంగం గుర్లపై దృష్టి సారించింది. అప్పటికే నష్టం తీవ్రమైంది. ఇప్పటికీ ప్రభుత్వం బాధితులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించలేకపోతోంది. తాగునీరు కలుషితమవడమే కారణం గుర్ల మండలంలో తాగు నీరు కలుషితమైన కారణంగానే డయేరియా ప్రబలినట్లు ఆర్‌ఆర్‌టీ నివేదించిందని బుధవారం వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో సేకరించిన 44 నీటి నమూనాలలో 31 నమూనాల్లో కోలిఫాం ఉన్నట్లు తేలింది. 57 మల నమూనాలను పరీక్షించగా భూతల, భూగర్భ జలాలు కలుషితమైనట్లు తేలింది. నీటి వనరు అయిన చంపా నదిలో దహన సంస్కారాలు, జాతరలు, పండుగలు మొదలైన మతపరమైన కార్యకలాపాలు చేస్తున్నారని కమిటీ గమనించింది.