శ్రీవారిని దర్శించుకున్న వైయ‌స్‌ జగన్‌

తిరుమల:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌,  ఆంధ్రప్రదేశ్‌ నిశ్చయ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాలు, తిరునామం ధరించి తిరుమల ఆలయానికి వచ్చిన వైయ‌స్‌ జగన్‌కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మార్గం ద్వారా వైయ‌స్‌ జగన్‌ ఏడుకొండలపై కొలువై ఉన్న కలియుగ వైకుంఠనాథుడిని దర్శించారు. రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వాదం ఇవ్వాలని శ్రీ వెంకటేశ్వరస్వామిని కోరారు.

ఆలయంలో శ్రీవారి సేవలో గడిపిన వైయ‌స్‌ జగన్‌కు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. శాలువాతో సత్కరించి.. శ్రీవారి చిత్రాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా ఆయన వెంట విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితర నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ఉన్నారు. జననేత ఏ కార్యక్రమమైనా చేపట్టేముందు భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా ఆయన శ్రీవారి దర్శించుకున్నారు.

మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో వైయ‌స్‌ జగన్‌  రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి తిరుమల కొండ మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయంలో  వైయ‌ఎస్‌ జగన్‌కు వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఘనస్వాగతం పలికారు. వారి కోసం కాన్వాయ్‌లోని తన వాహనం నుంచి దిగి మరీ.. వైయ‌స్‌ జగన్‌ అభివాదం చేశారు. ఈ సందర్భంగా తనను చుట్టుముట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అభిమానులు అందించిన శాలువాలు, పుష్పగుచ్చాలను స్వీకరించారు. అంతకుముందు వైయ‌స్‌ జగన్‌ తాడేపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5.20కు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. రాత్రికి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బస చేసిన వైఎస్‌ జగన్‌.. ఉదయం గెస్ట్‌హౌస్‌ నుంచి ఆలయానికి వెళ్లారు.

 

తాజా ఫోటోలు

Back to Top