తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డయేరియా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయనగరం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందడంతో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. డయేరియా మరణాలపై వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల వైయస్ జగన్ ప్రభుత్వ తీరును ఎక్స్ వేదికగా ఎండగట్టారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్ ఏమన్నారంటే.. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబుగారి ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణం. నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. లిక్కర్, ఇసుక స్కాంల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబుగారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళంపాడారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్‌క్లినిక్స్, పీహెచ్‌సీలను నిర్వీర్యంచేశారు. ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్తం చేశారు. స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబుగారు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.