మీ అందరికీ తోడుగా ఉంటా

మండపేట బహిరంగ సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నవరత్నాలతో ప్రతి కుటుంబంలో చిరునవ్వు తీసుకొస్తా

నా పాదయాత్రలో మండపేట ప్రజల కష్టాలన్నీ విన్నా

ఇళ్లపై ఉన్న రూ. 3 లక్షల బకాయిలన్నీ మాఫీ చేస్తా

పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను గెలిపించండి మంత్రిని చేస్తా 

చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పురావాలంటే మీ అందరి సహకారం కావాలి

వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించండి రాజన్న పాలన అందిస్తా

 

మండపేట: ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో మోసాలు, అన్యాయాలు, అబ‌ద్ధాలు చూశామ‌ని, ఇలాంటి పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడుదామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్ర‌తి ఒక్క‌రికి ఇన్నాళ్లు తోడుగా ఉన్నాన‌ని, ఇక ముందు కూడా ఉంటాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. పాద‌యాత్ర‌లో మీ అంద‌రి క‌ష్టాలు చూశాన‌ని, బాధ‌లు విన్నాన‌ని, అంద‌రికీ నేనున్నాన‌ని భ‌రోసా క‌ల్పించారు. బుధ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మండపేటలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

మండ‌పేట నియోజకవర్గం గుండా నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పూర్తి చేయగలిగానని గర్వంగా చెబుతున్నాను. ఇదే నియోజకవర్గం గుండా సాగిన పాదయాత్రలో ఆ రోజు మీరు చెప్పిన ప్రతి విషయం నేను విన్నా.. వరి పంట ఈ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. కనీస మద్దతు ధర రూ. 1750లు, ఉంటే కనీసం రూ. 12 వందలు కూడా రాని పరిస్థితి. ఇదే నియోజకవర్గంలో ధాన్యం దళారీలపాలవుతుందని, ధాన్యం దళారుల దగ్గరకు వెళ్లిన తరువాత కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్న పరిస్థితులు చెప్పారు. రైతుల పొట్టకొడుతూ ఏ రకంగా దోచేస్తున్నారో.. ధాన్యం రవాణా పేరుతో కోట్లు రూపాయలు తిన్నారని చెప్పుకొచ్చారు. ఆ రోజు మీరు చెప్పిన ప్రతి మాట నాకు ఇవాల్టికి గుర్తుంది. ఇదే మండపేట నియోజకవర్గంలో కపిలేశ్వరపురం, ఓరువెళ్లి, తాటపూడి, కేవరలంక నాలుగు ఇసుక రీచులలో ఏరకంగా బాహటంగా దోచుకుతింటున్నారో మీరు చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటే ఏ విధంగా కేసులు పెట్టారో చెప్పారు. నీరు – చెట్టు పేరుతో మట్టిని తవ్వినందుకు బిల్లులు, మళ్లీ మట్టి అమ్మి డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు. 

డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోగా.. ఇదే నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలకు ఇళ్లకు నోటీసులు అందించి ఏరకంగా బ్యాంకు వాళ్లు ఇబ్బందులు పెట్టారో చెప్పారు. పేదవాళ్లకు ఉచితంగా స్థలాలు ఇవ్వాల్సిందిపోయి స్థలాల పేరుతో చేస్తున్న అవినీతి చెప్పారు. ప్లాట్లు కట్టడానికి ఎంత అయితుందని ఏ బిల్డర్‌ను అడిగినా వెయ్యి రూపాయలు దాటదని చెబుతున్నారు. అటువంటి ప్లాట్లను అడుగుకు రూ. 2 వేలపైచిలుకు చెల్లిస్తూ పేదవాడిని దారుణంగా మోసం చేస్తూ అమ్ముతున్నారు. రూ. 6 లక్షల ప్లాటుకు రూ. 3 లక్షలు ఆ పేదవాడు కడుతూనే ఉండాలంట. ఇటువంటి మోసాన్ని, ఇటువంటి అన్యాయాన్ని చెప్పారు. ఆ ప్రతి పేదవాడికి చెబుతున్నా.. ఆ రోజూ ఇదే విషయాన్ని చెబుతూ హామీ ఇచ్చాను. మీరు చెప్పిన విషయాలను విన్నా.. మీ కష్టాలు చూశా.. మీ అందరికీ నేను ఉన్నానని చెబుతున్నా.. ప్రతి పేదవాడికి చెబుతున్నా.. చంద్రబాబు ప్లాట్లు ఏమైనా ఇస్తే వద్దూ అనకుండా తీసుకోండి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్లాట్లపై ఉన్న రూ. 3 లక్షల అప్పును మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నా.. 

నా పాదయాత్రలో మీ ప్రతి కష్టం నేను చూశా.. మీ ప్రతి బాధను నేను విన్నా.. మీ ఆవేదనను నా ఆవేదనగా తీసుకుంటున్నా.. సాయం అందక పేదరికంలో అల్లాడుతున్న పేదవాళ్ల కోసం మరోసారి చెబుతున్నా.. మీ బాధలు విన్నాను.. మీ కష్టాలు చూశాను. మీ అందరికీ తోడుగా నేను ఉంటాను.. ఉన్నాను అని మరోసారి చెబుతున్నా.. 

గిట్టుబాటు ధరలు అందని పరిస్థితి చూశా. రైతులు పడుతున్న ఆవేదనలు చూశా. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మాటతప్పడంతో వడ్డీల భారం తడిసిమోపెడై రైతులు పడుతున్న ఆవేదన చూశా. పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ చేస్తానని, కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తానని మాట తప్పడంతో ఆ పిల్లలు పడుతున్న బాధ చూస్తున్నా. పిల్లలను చదివించడం కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఫీజురియంబర్స్‌మెంట్‌ అరకొరగా ఇస్తూ.. అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి చూశా. చదువుల కోసం పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూశా. సతమతమవుతున్న ప్రతి తల్లికి హామీ ఇస్తున్నాను. మీ బాధలు నేను చూశాను. మీ కష్టాలు విన్నాను. మీ అందరికీ తోడుగా ఉంటానని మాట ఇస్తున్నా.. 

108 నంబర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌.. కుయ్‌ అంటూ రావాల్సిన అంబులెన్స్‌ వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఉన్న ప్రజలను చూశా. 108 సర్వీస్‌ లేక ప్రాణాలు పోయాయని ఆ కుటుంబం చెప్పిన బాధలు విన్నా. ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలుకాక వైద్యం సరిగ్గా అందక  పక్షవాతం వంటి రోగాలు వచ్చి పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి అన్నా నా పరిస్థితి ఇది. నన్ను ఎవరూ ఆదుకోలేదన్నా అని నా దగ్గరకు వచ్చిన రోగులను చూశా. ఆరోగ్యశ్రీ అందక ఇబ్బందులు పడుతున్న ప్రతి పేదవాడికి చెబుతున్నా.. మీ బాధలు నేను విన్నా.. మీ కష్టాలను నేను చూశా. మీ అందరికీ నేను ఉన్నానని హామీ ఇస్తున్నా. 

మొదటి సంతకంతోనే మద్యం షాపులు తీసేస్తామన్న మాటలు పక్కకు వెళ్లిపోయాయి. బెల్టుషాపులు ఎక్కువైపోయి. ఏ కిరాణాషాపులో చూసినా మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఆ మద్యం చేస్తున్న చిచ్చును ఆ కుటుంబం పడుతున్న అవస్థలను చూశా. రాత్రి ఏడు దాటితే ఇంట్లో నుంచి ఆడపిల్లలు గ్రామంలో తిరిగే పరిస్థితి కూడా లేని దుస్థితిని చూశా. ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి చెబుతున్నా. మీరు పడిన ప్రతి కష్టాన్ని నేను చూశాను.. నేను మీ అందరికీ తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా. 

మన రాష్ట్రంలో ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్న పిల్లలను చూశా. చదువులు అయిపోయి డిగ్రీలు చేతిలో పట్టుకొని ఉద్యోగాలు వస్తాయేమో.. గవర్నమెంట్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు లక్షా 40 వేలు అని కమల్‌నాథన్‌ కమిటీ తేల్చింది. ఖాళీ ఉద్యోగాలు ఒకేసారి విడుదల చేస్తారని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన ఆ పిల్లలను చూశా. పిల్లలు కోచింగ్‌ సెంటర్లకు వేలకు వేలు తగలేస్తున్నారు. చివరకు కాస్తో కూస్తో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటే అది ప్రత్యేక హోదా. అలాంటి హోదాను తాకట్టుపెట్టిన పరిస్థితులు చూశా. ప్రతి పిల్లాడికి ఉద్యోగాలు రాక వలసలు పోతున్న పరిస్థితులు చూశా. ఆ ప్రతి పిల్లాడికి హామీ ఇస్తున్నా.. మీ కష్టాలు చూశా.. మీ బాధలు విన్నా.. మీ అందరికీ నేను ఉన్నానని మాటిస్తున్నా.. 

పిల్లలను చదివించడం కోసం అక్కచెల్లెమ్మలు కూలీలకు పోతున్న పరిస్థితులు చూశా. ఈ బాధలు, కష్టాల మధ్యలో రాష్ట్రం ఐదు సంవత్సరాలు నడిచింది. చంద్రబాబు నాయుడి పాలనలో ఎక్కడ చూసినా కనిపించేది అబద్ధాలు. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఏదైనా చెబితే అమలు చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితులు తీసుకురావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. ఇదే మోసాలు, ఇవే అబద్ధాలు ఐదేళ్లలో జరిగాయి. పోలింగ్‌కు ఉన్న ఈ 15 రోజుల్లో ఇటువంటి అన్యాయాలు, మోసాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదు. చేయని మోసం, చూపని సినిమా ఉండదు. ఇవాళ మనం యుద్ధం చేస్తుంది చంద్రబాబు ఒక్కరితోనే కాదు.. చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియాతో యుద్ధం చేస్తున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో ఇంకా అమ్ముడుపోయిన అనేక ఎల్లో టీవీ చానళ్లతో యుద్ధం చేస్తున్నామని మర్చిపోవద్దు. మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. ఇవాళ యుద్ధం జరుగుతుంది ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుందని ఎవరూ మర్చిపోవద్దు. ఎన్నికలు దగ్గరపడే కొద్ది చంద్రబాబు చేయని అన్యాయం ఉండదు. ఆ అన్యాయాల్లో భాగంగా ఆయన చేయబోయే అతిపెద్ద అన్యాయం ఏంటో తెలుసా.. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికే గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టి మిమ్మల్ని మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మీరంతా అప్రమత్తంగా ఉండాలి. 

గ్రామాల్లో, వార్డుల్లో ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అన్నను, ప్రతి అవ్వా, తాతను కలవండి. ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపడుదాం.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను బడులకు పంపిస్తే చాలు అక్కచెల్లెమ్మల చేతిలో సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని ప్రతి అక్కకు చెప్పండి. 
చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదు అక్కా.. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాం.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న ఉచితంగా చదివిస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొస్తాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

అందరం పొదుపు సంఘాల్లో ఉన్నాం. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. ఇంతకు ముందు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీ ఎగరగొట్టాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణాలన్నీ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతిచెల్లెమ్మకు చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరోజు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న పెట్టుబడి సాయం ఇవ్వడమే కాదు.. గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్నే రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని అడగండి. ఆ అవ్వకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

నవరత్నాల ద్వారా జరిగే మంచి ప్రతి ఇంటికి చేర్చాలి. ప్రతి కుటుంబం నవరత్నాలతో సంతోషంగా ఉంటారని నమ్ముతున్నా. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడాలంటే మీరందరూ ముందుకు వస్తేనే సాధ్యం. దయచేసి మీఅందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి మన పార్టీ అభ్యర్థిగా పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నను నిలబెడుతున్నాను. మీరందరూ దీవించి పంపించిండి మంత్రిస్థానంలో కూర్చోబెడతాను. ఎంపీ అభ్యర్థిగా అనురాధను నిలబెట్టాను.. నా సోదరి అనురాధపై మీ చల్లని దీవెనలు ఉంచాలని కోరుతున్నా.. చివరగా మన పార్టీ గుర్తు ఎవరూ మర్చిపోవద్దు.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని పేరు పేరున సవినయంగా ప్రార్థిస్తున్నా..  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top