పెళ్లి ఊరేగింపులో జగనన్న డీజే పాట 

అడ్డుకున్న‌ పోలీసులపై ప్రజల ఆగ్రహం 

అనంతపురం జిల్లా: పెళ్లి ఊరేగింపులో జగనన్న డీజే పాట రావడంతో కూడేరు పోలీసులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని ఊరేగింపును అడ్డుకున్నారు. వైయ‌స్‌ జగన్‌ పాటను పెట్టరాదంటూ హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులపై స్థానికులు తిరగబడ్డారు. ఈ ఘటన కూడేరు మండలం కలగళ్లలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు...  కలగళ్లలో వడ్డే శ్రీకాంత్, రూప వివాహం ఆదివారం జరిగింది. అదే రోజు రాత్రి ఊరేగింపులో కుటుంబసభ్యులు డీజే ఏర్పాటు చేసి బంధు మిత్రులతో కలసి సరదాగా డ్యాన్స్‌ చూస్తూ సందడి చేయసాగారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రూపొందించిన పాట ప్లే కావడంతో పిల్లలు, యువత రెట్టింపు ఉత్సాహంతో ఈలలు వేస్తూ స్టెప్పులు వేశారు.
 
ఈ విషయంపై గిట్టని వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కలగళ్లకు చేరుకుని డీజే పెట్టరాదంటూ రెండు గంటల పాటు అడ్డుకున్నారు. దీంతో వేడుక జరుపుకోవడం కూడా నేరమేనా? అని పెళ్లి వారు వాదనకు దిగారు. అయితే వైయ‌స్‌ జగన్‌ పాటలు పెట్టరాదని పోలీసులు చెప్పడంతో పోలీసుల తీరుపై పెళ్లి వారితో పాటు పలువురు గ్రామస్తులు మండిపడ్డారు. ఇదే గ్రామంలో టీడీపీ వారు పెళ్లి ఊరేగింపులో డీజే పెట్టి టీడీపీ పాటలు పెట్టి సంబరాలు జరుపుకున్నారని, ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వచ్చిందని నిలదీశారు. ప్రజలు తిరగబడడంతో పోలీసులు మారుమాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.   

Back to Top