ప్రతి మ‌హిళ‌ను లక్షాధికారిని చేస్తా 

పార్వ‌తీపురం స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ హామీ

ఉద్యోగాలు లేక యువత  ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు

రెండు లక్షలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి

స్వార్థం కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు

గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కలవండి..చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి

అన్న ముఖ్యమంత్రి అయితే మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏటా రూ.15 వేలు ఇస్తారని చెప్పండి

20 రోజులు ఓపిక పడితే మన పిల్లలను పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి

ధర్మానికి..అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది

 

పార్వతీపురం: ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో మీ కష్టాలు అన్ని చూశాను. బాధలు విన్నాను.. మీ అందరికీ నేను ఉన్నానని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భరోసా ఇచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక‌ ప్ర‌తి అక్కాచెల్లెమ్మ‌ల‌ను ల‌క్షాధికారుల‌ను చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తాన‌ని హామీ ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌త్యేక విమానాల్లో త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, ప‌శ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల‌కు వెళ్లి వ‌స్తారు కానీ, ప‌క్క‌నే ఉన్న ఒడిశా రాష్ట్రానికి వెళ్లి అక్కడి సీఎంతో మాట్లాడి ఉంటే ఏపీలో రెండు ప్రాజెక్టులు పూర్తి అయ్యేవ‌ని చెప్పారు. 20 రోజులు ఓపిక ప‌డితే అన్న ముఖ్య‌మంత్రి అవుతార‌ని, చంద్ర‌బాబు ఇచ్చే రూ.3 వేల‌కు మోస‌పోవ‌ద్ద‌ని ప్ర‌తిఒక్క‌రికి చెప్పాల‌ని పిలుపునిచ్చారు. బుధ‌వారం విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురం ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్ర‌సంగించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశాం. విజయనగరం జిల్లాను చూస్తే వెనుకబడిన జిల్లాకు చేసిందేమీ లేదు. పెద్ద సున్నా కనిపిస్తుంది. 2014 ఎన్నికలకు ముందు ఎలాంటి మాయమాటలు చెప్పాడో మీ అందరికీ తెలుసు. మళ్లీ ఎన్నిలకు వచ్చేసరికి మోసం చేయడానికి అలాంటి డ్రామాలు రోజూ కనిపిస్తున్నాయి. నిజంగా ఈ ప్రాంతానికి మంచిచేయాలని ఆలోచన చేసిన వ్యక్తి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గర్వంగా చెబుతా. ఇదే నాన్నగారి హయాంలో తోటపల్లి ప్రాజెక్టు కనిపిస్తుంది. దశాబ్దాలుగా ఏ ఒక్కరూ మంచిచేయని తరుణంలో.. పాదయాత్ర చేస్తూ తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరినప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే తోటపల్లి ప్రాజెక్టు రూ. 450 కోట్లతో 90 శాతం పూర్తి చేశారు. మిగిలిపోయిన పదిశాతం పనులు చేయలేక ఎంతటి దారుణంగా మోసం చేస్తుందో చూస్తున్నాం. అక్షరాల లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టు ఇవాల్టికి కూడా 80 వేల ఎకరాలకు ఇవ్వని పరిస్థితుల్లో ఉంది. ఐదు సంవత్సరాల పాలనలో ఏం చేశారో మీరంతా గమనించాలి. వైయస్‌ఆర్‌ హయాంను గుర్తు చేసుకోండి. ఒడిశాతో వివాదం ఉన్న కారణంగా ఏ ఒక్కరూ జంగావతి ప్రాజెక్టు చేయడానికి ముందుకు రాలేదు. వైయస్‌ఆర్‌ ఎప్పుడూ ఎక్కడా కనివిని ఎరుగని విధంగా రబ్బర్‌ డ్యాం ప్రాజెక్టు తీసుకొచ్చి రైతన్నలకు తోడుగా నిలిచారు. అటువంటి ప్రాజెక్టు పరిస్థితి మీరూ చూస్తున్నారు. 

స్పెషల్‌ విమానాల్లో టిఫిన్‌ కోసం తమిళనాడు స్టాలిన్‌ దగ్గరకు వెళ్తాడు.. భోజనం చేయడానికి పశ్చిమ బెంగాల్‌ మమతా బెనర్జీ వద్దకు, ఇంకా సరిపోదు అనుకుంటూ సాయంత్రం కాఫీ తాగడానికి రాహుల్‌గాంధీ దగ్గరకు వెళ్తాడు. అదే విమానం వేసుకొని పక్కనే ఉన్న ఒడిశా ప్రాజెక్టు దగ్గరకు వెళ్లడు. ఒడిశా ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్తే రెండు ప్రాజెక్టు పూర్తయ్యేవి.. రైతుల పొలాలు సస్యశ్యామలం అయ్యేవనే వాస్తవం ఒక్కసారి గమనించాలి. 

ఇదే పార్వతీపురం పురపాలకంలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలుసు. నాగావళి నదిలో నేలబావులు పాడైపోతే కనీసం పట్టించుకునే వాడు లేడు. పార్వతీపురంలో ఏరియా ఆస్పత్రిని 200 పడకలు చేసి స్థాయి పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించుకోవాలి. ఈ ప్రాంతంలో అగ్రిగోల్డ్‌ బాధితులు ఎక్కువ. పాదయాత్రలో వారు పడిన కష్టాలను చెప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం ఏం చేశారని ఒక్కసారి ఆలోచన చేయాలి. అగ్రిగోల్డ్‌ ఆస్తులు ప్రభుత్వమే అమ్మడమో.. కొనడమో ఏదో ఒకటి చేసి బాధితులు ఆదుకోవాల్సింది పోయి ఆ ఆస్తులను కాజేయాలని ఉద్దేశంతో చంద్రబాబు, ఆయన బినామీలు ఏమేం చేశారో ఆలోచన చేయండి. చంద్రబాబు పాలన చూడండి. 3648 కిలోమీటర్లు నేను నడిచా.. ఈ ప్రాంతం నుంచి నా పాదయాత్ర సాగింది. నా పాదయాత్ర విజయవంతం అయిందంటే దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు అని కచ్చితంగా చెబుతున్నా.

ప్రతి అడుగులో ప్రతి కుటుంబం పడుతున్న బాధలు విన్నా.. కష్టాలను నా కళ్లతో చూశా. ఈ రాష్ట్రంలో సాయం కోసం ఎదురుచూస్తూ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సాయం అందక అన్యాయ పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వేదికపై నుంచి హామీ ఇస్తున్నా.. మీ బాధలు విన్నాను. మీ కష్టాలు నేను చూశాను.. మీ అందరికీ నేను ఉన్నానని మాటిస్తున్నాను. 

రుణమాఫీ అనే పథకం వడ్డీలకు కూడా సరిపోక, వచ్చే అరకొర కూడా మోసం చేసేందుకు ఎన్నికల తేదీ వచ్చేటప్పుడు మాత్రమే డబ్బులు డిపాజిట్‌ చేయాలని మోసం చేస్తున్న పాలనను చూస్తున్నాం. ముందుగా ఇచ్చి ఉంటే రైతులకు వడ్డీలకు కాస్తఅయినా సరిపోయేదన్న ఆలోచన కూడా చేయకుండా ఏరకంగా మోసం చేశాడో పాదయాత్రలో నా కళ్లతో నేను చూశా.. ఏ పంట తీసుకున్నా.. ఉల్లి, టమాట, పత్తి, వరి, మిర్చి, పొగాకు, అరటి, వేరుశనగ ఏ ఒక్క పంటకు ఐదు సంవత్సరాల్లో గిట్టుబాటు ధర రాలేదని రైతు చెబుతున్న బాధలు విన్నా.. గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత సీఎంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు హెరిటేజ్‌ లాభాల కోసం తానే దళారీ అయి రైతులను నట్టేట ముంచాడని రైతులు చెబుతున్న మాటలు విన్నా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, చివరకు కాపుల విషయంలో చిన్నచూపు చూస్తూ మాట్లాడిన మాటలు విన్నా.. అసైన్డ్‌ భూములు లాక్కుంటున్నప్పుడు బాధితులు చెబుతున్న మాటలు విన్నా.. ఎన్నికలకు మూడు నెలల ముందు ఓట్ల కోసం రకరకాల సినిమాలు, డ్రామాలు ఆడుతుంటే ప్రజల దగ్గర నుంచి ఆ మాటలు వింటుంటే బాధగా ఉంది. తమకు రుణాలు, సబ్సిడీలు, గిట్టుబాటు ధరలు రావడం లేదని కౌలు రైతులు పడుతున్న బాధలు చూశా. పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూశా. పద్ధతి ప్రకారం స్కూళ్లు, హాస్టళ్లు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను దగ్గరుండి మూసేయిస్తున్న వైఖరిని చూశా. ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ పోస్టులు భర్తీ చేయరు. ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో పెడతారు. ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు ఉండవు. దగ్గరుండి చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను నీరుగారుస్తున్నాడు. తన బినామీ నారాయణ విద్యాసంస్థలకు పంపించాలనే ఆరాటపడుతున్న పరిస్థితి చూశా. 

వాళ్ల పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీఏ, ఎంసీఏ వంటి పెద్ద పెద్ద చదువులు చదించలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఆస్తులు అమ్ముకుంటున్నామని బాధతో వారు చెప్పిన మాటలు నేను విన్నా.. సమయానికి 108 రాక, ఆరోగ్యశ్రీలో జబ్బులు కవర్‌కాక, ప్రభుత్వ ఆస్పత్రలు అన్యాయమైన పరిస్థితుల్లోకి రావడం. ఆ ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు కూడా లేని పరిస్థితి. రోగాల బారినపడిన వారు మంచానికే పరిమితమైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆ బాధలన్నీ వారు చెబుతున్నప్పుడు నేను విన్నా.. ఆ కష్టాలను నా కళ్లతో నేను చూశా. ఉపాధ్యాయులు, వీఏఓలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశవర్కర్లు, అంగన్‌వాడీలు, కాంట్రాక్ట్‌ కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌లు జీతాలు పెంచమని అడుగుతున్నప్పుడు ప్రభుత్వం వాళ్ల మాటలు వినడానికి కూడా ఇష్టపడక పోలీసులతో వారిపై దౌర్జన్యం చేసినప్పుడు, వారి కష్టాలు చెబుతుంటే నేను విన్నా.. ప్రభుత్వం ఏర్పడేటప్పుడే 1.5 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ చెప్పింది. ఉద్యోగాలు వస్తాయేమోనని ఉద్యోగాల కోసం కోచింగ్‌ సెంటర్లకు వెళ్తూ వేలకు వేలు తగలేస్తున్న పిల్లలు నా దగ్గరకు వచ్చి నోటిఫికేషన్లు రావడం లేదు. ఉద్యోగాలు రావడం లేదన్న మాటలు కూడా నేను విన్నా.. చివరకు ఉద్యోగాలు రావడానికి మేలు చేసే ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన పరిస్థితులను కూడా చూశా. 

గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియా, మాఫియా సామ్రాజ్యంలో పెన్షన్, రేషన్, ఇల్లు, చివరకు మరుగుదొడ్లు మంజూరు కావాలన్నా.. లంచం లేనిదే పనిజరగని పరిస్థితులు నా కళ్లతో నేను చూశా. చివరకు పెన్షన్‌ కావాలంటే ఏ పార్టీ వారు అడుగుతున్న పరిస్థితులు చూశా. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం పడుతున్న బాధలు నేను చూశా.. మీ కష్టాలు అన్ని చూశాను. బాధలు విన్నాను.. మీ అందరికీ నేను ఉన్నానని భరోసా ఇస్తూ చెబుతున్నా.. 

ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చెప్పని అబద్ధం, చేయని మోసం ఉండదు. గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టి మీ అందిరనీ కొనుగోలు చేయడానికి కుట్ర చేస్తాడు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చేయని మోసం ఉండదు. మనం యుద్ధం చేస్తుంది చంద్రబాబు ఒక్కడితోనే కాదు.. బాబుతో జతకట్టిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో అమ్ముడుపోయిన అనేక టీవీ చానళ్లతో యుద్ధం చేస్తున్నాం. ఈ రోజు యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య. అందుకే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా.. మీ గ్రామాలు, మీ వార్డుల్లోకి వెళ్లినప్పుడు, ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అవ్వను, ప్రతి తాతను, ప్రతి అన్నను కలవండి. 

ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపడుదాం.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను బడులకు పంపిస్తే చాలు అక్కచెల్లెమ్మల చేతిలో సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని ప్రతి అక్కకు చెప్పండి. 
చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదు అక్కా.. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాం.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న ఉచితంగా చదివిస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 

అందరం పొదుపు సంఘాల్లో ఉన్నాం. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తాడేమోనని ఎదురుచూశాం. ఎన్నికల సమయంలో రుణమాఫీ అని మోసం చేశాడు. ఇంతకు ముందు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీ ఎగరగొట్టాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణాలన్నీ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతిచెల్లెమ్మకు చెప్పండి. అంతేకాదక్కా.. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీకే రుణాలు అందించే ప్రయత్నం చేస్తాడని చెప్పండి. ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను లక్షాధికారులను చేయాలని వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రాజన్న రాజ్యం చూశాం. మళ్లీ ప్రతి అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేయడం రాజన్న కొడుకు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొస్తాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 
గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరోజు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న పెట్టుబడి సాయం ఇవ్వడమే కాదు.. గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్నే రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని అడగండి. ఆ అవ్వకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. ఎన్నికలప్పుడు మోసం చేస్తూ మాటలు మాట్లాడడం, ఎన్నికలు అయిపోయిన తరువాత మోసం చేసే పరిస్థితులు మారాలి. ఇది జరగాలని కోరుతున్నా.. నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాలి. నవరత్నాలతో ప్రతి కుటుంబంలో సంతోషం నిండుతుందని ఆశిస్తున్నా.. పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగారావు నిలబడుతున్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు జోగారావుపై ఉంచాలని కోరుతున్నా.. అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా మాధవి నా చెల్లి నిలబడుతుంది. మంచి చేస్తుందనే నమ్మకం నాకు ఉంది. మీ అందరి చల్లని దీవెనలు మాధవమ్మపై కూడా ఉంచాలని పేరు పేరునా కోరుతున్నాను. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు అన్నారు. 
ప్రసన్నకు కొన్ని పరిస్థితు కారణంగా టికెట్‌ ఇవ్వలేకపోయాను. ప్రసన్నకు మంచి చేస్తాను. నా గుండెల్లో ఎప్పుడూ స్థానం ఉంటుందని మీ అందరికీ మాటిస్తున్నా.. 
 

Back to Top