ఒకవైపు ప్రకటనలు..మరోవైపు దాడులు

అదే చంద్రబాబు అనైతిక పరిపాలన

వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ధ్వజం 

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి

సీఎం ప్రోద్భలంతోనే దాడులు కొనసాగుతున్నాయి

పద్ధతి ప్రకారం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు

వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలి

వారి దమననీతిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

పార్టీ లీగల్‌సెల్‌ మీటింగ్‌లో వైయస్‌ జగన్‌

తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఒకవైపు ప్రకటనలు చేస్తూనే, మరోవైపు యథేచ్ఛగా దాడులు చేయిస్తున్నారని, అదే చంద్రబాబు అనైతిక పరిపాలన అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న ఆయన, సీఎం ప్రోద్భలంతోనే ఆ దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలన్న వైయస్‌ జగన్, వారి దమననీతిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌సెల్‌ ప్రతినిధుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.

పార్టీ లీగల్‌సెల్‌ సమావేశంలో  వైయస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..:

రాష్ట్రంలో దారుణ పరిస్థితులు:
    ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దారుణ పరిస్థితులు మీకు తెలియనివి కావు. ఇంతకు మందు ఎప్పుడూ ఇలా జరగలేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు ఇలాంటివి ప్రోత్సహించలేదు. ఎన్నికలు అయ్యే వరకే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్లుగానే ప్రతి అడుగులోనూ అలాగే ఉన్నాం. ఏ స్థాయిలో మనం అడుగులు వేశామంటే, ఏకంగా మనకు ఓటు వేయని వారిని కూడా వెతుక్కుంటూ వెళ్లి, ప్రతి పథకాన్ని డోర్‌ డెలివరీ చేశాం. ఆ స్థాయిలో మంచి చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎక్కడా వివక్ష ఉండకూడదు. అవినీతి ఉండకూడదు అనే ముఖ్యమైన ఉద్దేశాలతో అడుగులు పడ్డాయి.

ఎక్కడికక్కడ రెడ్‌బుక్‌ రాజ్యాంగం:
    ఏ స్థాయిలో ఈరోజు శాంతి భద్రతలు దిగజారిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటే.. పైన ఉన్నవారు రెడ్‌బుక్‌ పెట్టుకుంటారు. అందులో మంచి చేసిన వారి పేర్లు రాసి, వారికి మంచి చేసే కార్యక్రమం జరుగుతుందా? అంటే అది కాదు. ఎవరిని తొక్కాలి. ఎవరిని నాశనం చేయాలి. ఎవరి ఆస్తులను ధ్వంసం చేయాలి. ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్‌బుక్‌ తయారు చేసుకుని, పైస్థాయిలో ఉన్న వారు రెడ్‌బుక్‌ పేరుతో అరాచకాలు సృష్టిస్తూ, దొంగ కేసులు పెడుతూ, ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆరాపడుతూ పైస్థాయిలో విధ్వంసాలు చేస్తుంటే, కిందిస్థాయిలోకి వచ్చేసరికి ఎవరి స్థాయిలో వారు రెడ్‌బుక్‌లు తెరవడం మొదలు పెట్టారు.
    నియోజకవర్గస్థాయిలో వారు, మండల స్థాయిలో ఇంకొకరు, గ్రామస్థాయిలో ఇంకొకరు కూడా రెడ్‌బుక్‌లు ఓపెన్‌ చేసి, విధ్వంసాలకు పాల్పడుతున్నారు. 

బాధితులపైనే తిరిగి కేసులు!:
    ఈరోజు ఎక్కడా న్యాయం, ధర్మం కనిపించడం లేదు. పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే.. ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని చెప్పి, పోలీసుల దగ్గరకు వెళ్లి, కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే, మనవారిపై వాళ్లే ఎదురు కేసులు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. 

వాళ్లే చేస్తారు. మనకు అంటిస్తారు:
    ప్రతిదీ డిజిటలైజ్‌ అయినప్పుడు, హార్డ్‌డిస్క్‌లు, సర్వర్‌లో ఉంటాయి కదా?. అలాంటప్పుడు పేపర్లు కాల్చేయాలని ఎవరనుకుంటారు?. ఒకవేళ ఎవరైనా ఆ పని చేయాలనుకుంటే, రెండు నెలల తరవాత, ఈ ప్రభుత్వంలో వారు బాగా ఉన్నప్పుడు, పైగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుపుతున్నప్పుడు బుద్ధి ఉన్నవాడు ఎవరైనా చేస్తారా?.
అంటే ప్రతిదీ వీళ్లే. ఏదో చేస్తారు. మళ్లీ దొంగకేసు మన వాళ్ల మీద పెడతారు. పక్కవాళ్లకు అంటించే కార్యక్రమం చేస్తున్నారు.

ఇటు ప్రకటనలు. అటు దాడులు:
    లా అండ్‌ ఆర్డర్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. అటువైపు ఉన్న వాడు మన వాడు కాదు అనుకుంటే చాలు, మీరు పోయి ఏదైనా చేసేయండి. పోలీసులు మీకు తోడుగా ఉంటారు. పోలీసులు వాళ్ల మీదనే కేసులు పెడతారు. మీకు అన్నివిధాలుగా రక్షణ ఇస్తారు అని చెప్పి, సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు అభయహస్తం ఇస్తున్నారు.
    ఆశ్చర్యం కలుగుతుంది. ఈనాడులో స్టోరీ. నేరం చేయాలంటే ఎవరైనా భయపడాలి అన్న చంద్రబాబు అంటూ కథనం. అటు చూస్తే, తాడిపత్రిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పెద్దారెడ్డి అక్కడ అడుగు పెట్టాలంటే భయం. ఆయన తాడిపత్రిలోని ఆయన ఇంటికి వస్తే ఆయనపై దాడి. పార్టీ కార్యకర్త మురళి ఇంటిపై దాడి. రాళ్లతో కొట్టారు. 
    అంటే ఒకవైపు భయాందోళన ఆయనే క్రియేట్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రజలను మభ్యపెట్టే స్టేట్‌మెంట్లు. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో క్యారీ చేస్తారు. అంటే ఒక పద్ధతి ప్రకారం దాడులు చేస్తారు. అందరినీ భయాందోళనకు గురి చేస్తారు. మరోవైపు ఏమీ జరగనట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ద్వారా వారే ప్రచారం చేస్తారు.

మీ చొరవ చాలా అవసరం:
    ఇలాంటి పరిస్థితుల్లో మీ (లాయర్ల) అవసరం చాలా ఉంది. ఎందుకంటే, ఈరోజు ఏదైనా విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు పోవాలంటే.. ఎక్కడో దానికి చొరవ అవసరం. అలా ఎవరో ఒకరు చొరవ చూపకపోతే, కోర్టులు కూడా వినే పరిస్థితి ఉండదు. 
    కేసులు పెట్టించడం దగ్గర నుంచి, అవి కోర్టుల వరకు వెళ్లడం, వాటిపై కోర్టులో వాదనలు వినిపించి, మన వారికి న్యాయం చేయడానికి అడుగులు వేస్తే తప్ప, మనం మనవాళ్లకు న్యాయం అందించని పరిస్థితి నెలకొంది. అందుకోసం ఒక పద్ధతి ప్రకారం అడుగులు వేద్దాం. 

వైయస్ఆర్‌సీపీ హయాంలోనే లాయర్ల సంక్షేమం:
    లాయర్ల సంక్షేమం, అభివృద్ది కేవలం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశాం. వారికి తోడుగా ఉన్నాం. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన యువ లాయర్లకు మూడేళ్లపాటు, ప్రతి ఆరు నెలలకోసారి రూ.30 వేల చొప్పున ఇచ్చాం. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉంటే, వారు పేదలకు అండగా ఉంటారన్న దృక్పథంతో అవన్నీ చేశామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 

Back to Top