వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ ఫిర్యాదు స్వీకరించని పోలీసులు

ప్రకాశం జిల్లా: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లగా తమ ఫిర్యాదును స్వీకరించలేదని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఒంగోలు వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జ్ చుండూరి రవిబాబు కలిసి ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. మీడియా వేదికగా వచ్చిన వ్యాఖ్యలు సమాజంలో అపోహలు కలిగించేలా ఉన్నాయని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఫిర్యాదు చేసే హక్కు ఉందని, అలాంటి హక్కులను పోలీసులు గౌరవించాలని తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందిస్తూ వినతి పత్రాన్ని స్వీకరించ‌ని విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

Back to Top