ఒంగోలులో నీటి దాహార్తి తీర్చుతా

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోండి

వైయ‌స్ఆర్‌ ఒంగోలులో 10 వేల మందికి ప‌క్కా ఇళ్లు ..మరో 10 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు

పేద‌ల ఇళ్ల నిర్మాణాల్లో చంద్ర‌బాబు క‌క్కుర్తి

ప్ర‌త్యేక హోదా సాధించుకుందాం

గ్రామ సెక్ర‌టేరియ‌ట్ ద్వారా ప్ర‌తి ఊర్లో ప‌ది మందికి ఉద్యోగాలు

అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ వెళ్తాం

 

ప్రకాశం: చ‌ంద్ర‌బాబు ఐదేళ్ల పాల‌న‌లో క‌నీసం తాగునీటిని కూడా ఇవ్వ‌లేక‌పోయార‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఒంగోలు ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చుతాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. చంద్ర‌బాబు పాల‌న‌లో మోసం. అన్యాయం, అబ‌ద్దాలే క‌నిపిస్తాయ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ చంద్ర‌బాబు పోవాల‌ని కోరుకుంటున్నార‌ని, రాజ‌న్న రాజ్యం మ‌ళ్లీ రావాల‌ని ఆశిస్తున్నార‌ని చెప్పారు. మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఉద్యోగాల విప్ల‌వాన్ని తెస్తామ‌ని మాట ఇచ్చారు. బుధ‌వారం ఒంగోలు ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.

జగన్‌ అనే నేను హామీ ఇస్తున్నా..
ఇదే ఒంగోలులో చంద్రబాబు పాలనను ఒక్కసారి గమనించమని మిమ్మల్ని కోరుతున్నాను. అప్పట్లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోండి. ఒంగోలులో 10 వేల మందికి ఇళ్లులు కట్టించి మరో 10 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత నాన్నగారిది. ఇవాళ ఇదే పేదవాడి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వంలో పేదవాడిని కూడా వదిలిపెట్టకుండా ఏరకంగా దోపిడీ చేస్తున్నారో గమనించండి. చంద్రబాబు పేదవాడికి ప్లాట్లు కట్టిస్తున్నాడంట. 300 అడుగుల ప్లాట్లు కట్టడానికి ఎంత అవుతుందని ఏ కాంట్రాక్టర్‌ను అడిగినా స్థలం ఉచితం, సిమెంట్‌ సబ్సిడీ, ప్లాట్లలో లిఫ్టు, గ్రనైట్‌ ఫ్లోరింగ్‌ లేదు. ఇలాంటి ప్లాట్లు కట్టడానికి అడుగుకు వెయ్యి రూపాయలకు మించి కాదని ఏ కాంట్రాక్టర్‌ అయినా చెబుతాడు. పేదలకు ఇచ్చే 300 అడుగుల ప్లాట్లు చంద్రబాబు రూ. 2 వేలకు అమ్మే కార్యక్రమం చేస్తున్నాడు. 300 అడుగుల ప్లాటు అడుగుకు రూ. 2 వేలు అంటే అక్షరాల రూ. 6 లక్షలు ఖర్చు అవుతుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రూ. 3 లక్షలు ఇస్తే.. లబ్ధిదారుడి పేరు మీద మరో రూ. 3 లక్షలు అప్పుగా రాసుకుంటాడట. ఆ లబ్ధిదారుడు బ్యాంకులకు 20 సంవత్సరాల పాటు నెలకు రూ. 3 వేలు కడుతూ పోవాలంట. లంచాలు తీసుకునేది చంద్రబాబు, రూ. 3 లక్షల ప్లాటు రూ. 6 లక్షలకు అమ్ముతాడు. రూ. 3 లక్షల లంచం చంద్రబాబు తీసుకుంటాడు. ఆ లంచాలకు నెలకు రూ. 3 వేలు పేదవాడు బ్యాంకులకు కట్టాలంట. గతంలో చెప్పా.. ఇవాళ చెబుతున్నా.. దేవుడి ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మన ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌ అనే నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా.. ఎన్నికల వేళ చంద్రబాబు ఇస్తున్న ప్లాట్లు ఎవరూ వద్దు అనకుండా తీసుకోండి మన ప్రభుత్వం వచ్చిన తరువాత పేదవాడు కట్టే రూ. 3 లక్షల అప్పు మొత్తం మాఫీ చేస్తాం. 

అగ్రిగోల్డు బాధితుల‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు
అగ్రిగోల్డు బాధితులు ఉన్నారు. ఈ టౌన్‌లో, ఈ జిల్లాలో కూడా ఎక్కువే. ఐదు సంవత్సరాల పాలనపై ఆలోచన చేయండి. చంద్రబాబు వచ్చిన తరువాత అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా, అగ్రిగోల్డు ఆస్తులను అత్తగారి సొత్తు అన్నట్లుగా చంద్రబాబు, లోకేష్, మంత్రులు అడ్డగోలుగా దోచేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కష్టాలు, బాధలు నాకు చెప్పారు. మీ బాధలు నేను విన్నాను. మీ కష్టాన్ని నేను చూశాను. ప్రతి అగ్రిగోల్డ్‌ బాధితులకు హామీ ఇస్తున్నా.. నేను ఉన్నానని భరోసా ఇస్తున్నా. 

నీళ్లు వ‌చ్చాయంటే..
చంద్రబాబు పాలనను గమనించండి. ఒంగోలు నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తీసుకొస్తానని చంద్రబాబు చెప్పాడు. ఐదేళ్ల తరువాత అడుగుతున్నా.. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కనిపించిందా.. మురుగునీరు ప్రవహించే పోతురాజు కాల్వలను రూ. 100 కోట్లతో ఆధునీకరిస్తానన్నాడు. ఆధునీకరణ జరిగిందా.. ? ముఖ్యమంత్రి హోదాలో ఇస్తున్న మాటల పరిస్థితి చూడండి. గత ఎన్నికల్లో ఒంగోలు ప్రజలకు రోజు తాగునీరు అందిస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి నీరు వస్తుందా..? ఆ మూడు రోజులకు నీరు వస్తున్నాయంటే పది సంవత్సరాల కిందట వైయస్‌ఆర్‌ రామతీర్థం జలాశయం కట్టాడు కాబట్టే నీరు వస్తుంది. పది సంవత్సరాల కిందట పరిస్థితి అది. ఈ రోజు జనాభా పెరిగి తాగునీటి అవసరం ఎక్కువైనా కూడా వైయస్‌ఆర్‌ కట్టించిన గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నుంచి నీరు ఇస్తానని మభ్యపెట్టాడు. నీరు వచ్చాయా.. ఎక్కడా కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. 

ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాల్లో తీర ప్రాంతం వరకు వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలే ఇవాల్టికి గొంతు తడుపుతున్నాయని ప్రజలు సంతోషంగా చెబుతూ.. మరోవైపున పది సంవత్సరాలు అయిపోయింది జనాభా పెరుగుతుంది. అయినా నీరు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి నాన్నగారి పాలన గుర్తు చేసుకోండి. రిమ్స్‌ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ వచ్చింది నాన్నగారి హయాంలోనే. ఈ ఐదేళ్ల చంద్రబాబు కాలంలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా, కనీసం ఒక్క యూనివర్సిటీ అయినా వచ్చిందా.. ఎన్నికల వేళ మాత్రం చంద్రబాబు వచ్చి ఒక రాయి, టెంకాయి కొట్టి పోతాడు. 

దేశంలోనే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు
రామయపట్నం పోర్టుకు సంబంధించి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి పోర్టు కట్టాలనే ఆలోచన చేయడు. ఉద్యోగాలు వస్తాయని తెలిసినా కూడా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి మేలు చేయాలనే ఉద్దేశంతో నిర్మించలేదు. ఎన్నికలు వచ్చే సరికి అప్పుడు వచ్చి ఒక రాయి వేసి టెంకాయి కొట్టి వెళ్లిపోతాడు. మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మీరంతా చూసింది మోసం.. మోసం.. మోసం తప్ప మరొకటి ఉండదు. అవినీతి, అబద్ధాలు, అన్యాయాలు తప్ప చేసిందేమీ లేదు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు పేరు వినిపిస్తుంది. కానీ, ఆంధ్రరాష్ట్రంలోని రైతన్న దేశంలోనే అత్యంత పేద రైతుగా వినిపిస్తున్నాడు. దేశంలోనే అత్యధిక రుణభారం ఉన్న వ్యక్తి మన రాష్ట్ర రైతన్న అని నాబార్డు నివేదిక చెబుతుంది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు గతంలో రూ. 14 వేల కోట్లు ఉండేవి. ఇవాళ అవి రెట్టింపు అయి రూ. 28 వేల కోట్లకు ఎగబాకాయని సాక్షాత్తు బ్యాంకర్స్‌ కమిటీ రిపోర్టులు చెబుతున్నాయి. 

జాబు రావాలంటే బాబు పోవాలి..
ఐదు సంవత్సరాల తరువాత నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ పట్టణానికి వెళ్లినా చదువు అయిపోయి సర్టిఫికెట్లు పట్టుకొని ఉద్యోగాలు వస్తాయనే ఆశ ఎండమావి అయిపోయి ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. రాష్ట్రంలో అక్షరాల 1.75 కోట్ల ఇళ్లు ఉంటే.. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అన్నాడు.. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు.. ఆ తరువాత జాబు ఇవ్వలేకపోతే ఇంటింటికీ రూ. 2 వేల భృతి ఇస్తానన్నాడు. కానీ, ఈ ఐదు సంవత్సరాల కాలంలో జాబు ఏ ఇంటికైనా వచ్చిందంటే అది చంద్రబాబు ఇంటికి మాత్రమే. ఆయన కొడుకును ఎమ్మెల్సీ చేశాడు. ప్రమోషన్‌ ఇచ్చి మంత్రిని కూడా చేశాడు. జాబు విషయంలో తన కొడుకు మీద చూపించిన శ్రద్ధ, ప్రతి పేదవాడి ఇంటిపై చూపించి ఉంటే. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టబోయి ఉంటే గవర్నమెంట్‌లో ఖాళీగా ఉన్న 1.40 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ధ్యాస పెట్టి ఉంటే ప్రతి ఇంటికి కాస్తయినా ఊరట కలిగి ఉండేది. ఐదు సంవత్సరాల తరువాత జాబు రావాలంటే బాబు పోవాలనే మాట వినిపిస్తుంది. 

బాబు వచ్చాడు.. జాబు పోయిందనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. బాబు వచ్చాడు.. 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు గృహ నిర్మాణ శాఖలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల 3500 మంది ఉద్యోగాలు గోవింద.. బాబు వచ్చాడు వెయ్యి మంది గోపాలమిత్రల ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు ఆయూష్‌లో పనిచేస్తున్న 8 వందల మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు సాక్షర భారత్‌లో పనిచేస్తున్న 30 వేల మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు మధ్యాహ్న భోజన పథకంలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న 85 వేల మంది కార్మికుల ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు.. ఉద్యోగాలు గోవింద. జీతాలు పెంచమంటే లాఠీ దెబ్బలు కొట్టిస్తున్నాడు. 

సిగ్గు లేకుండా టీవీల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడంటే.. 
రాష్ట్ర ప్రభుత్వంలో లక్షా 25 వేల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి నుంచి జీతాలు ఇవ్వడం పూర్తిగా మనేశారు. వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు నాలుగు నెలల నుంచి జీతాలు బంద్, ఉద్యోగాలకు తమ జీపీఎఫ్‌ డబ్బులు తీసుకోలేకుండా ఆంక్షలు విధించాడు. హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంస్థలకు, గురుకులాలకు, మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న వారికి నాలుగు నెలలుగా జీతాలు బంద్, చంద్రబాబు హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. ఫీజురియంబర్స్‌మెంట్‌ కింద ఇవ్వాల్సిన బకాయిలు రూ. 18 వందల కోట్లు బంద్, మధ్యాహ్న భోజన పథకానికి సరుకుల కోసం బిల్లులు ఇవ్వకుండా పిల్లలను ఇబ్బందులు పెడుతున్న ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడు చంద్రబాబు తప్ప. సీపీఎస్‌ నిధులను సంబంధిత నిధికి జమ చేయకుండా వాడేశాడు. పోలీసులకు టీఏ, డీఏలు పూర్తిగా బంద్‌ చేశాడు. ఇలాంటి మనిషికి అధికారం ఇస్తే రేపు రేషన్‌ కూడా దొరకదని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు పాలన ఒకసారి చూడండి. 57 నెలలు అన్యాయాలు చేసి చివరి మూడు నెలలు మాత్రం చేస్తున్న మోసం చూడండి. నిరుద్యోగ భృతి ఇస్తానని రూ. 1.20 లక్షలు ఐదేళ్లలో బాకీ పడ్డాడు. చివరి మూడు నెలలకు మాత్రం కోటి 75 లక్షల ఇళ్లులు ఉంటే కేవలం 3 లక్షల మందికి అది కూడా రూ. వెయ్యి ఇచ్చి సిగ్గు లేకుండా టీవీల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడంటే.. ఇంతకంటే దారుణమైన వ్యక్తి ఎక్కడైనా ఉంటాడా.. 

ప్రభుత్వ ఉద్యోగాలు 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటి కోసం పరీక్షలు పెడతారని పిల్లలు ప్రిపరేషన్‌ కోసం వేలకు వేల రూపాయలు తగలేస్తున్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చాడా.. నా పాదయాత్రలో ప్రతి ఇంటా నిరుద్యోగులను చూశా. వారి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన విన్నా.. వారందరికీ భరోసా ఇచ్చి చెబుతున్నాను. నేను ఉన్నానని చెబుతున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలు విషయంలో రాష్ట్రంలో రిటైర్డ్‌ అయిపోయి ఖాళీగా ఉన్న వాటితో కలిపి 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి శ్రీకారం చుడతాను. ప్రతి సంవత్సరం జనవరి 1కే ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తాం.  

ఉద్యోగాల విప్ల‌వం తెస్తాం
మన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ తెరుస్తాం. మీ ఊరులోనే చదువుకున్న 10 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేట్లుగా చేస్తానని హామీ ఇస్తున్నా.. అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వలంటీర్‌ను తీసుకుంటాం. ఆ గ్రామ వలంటీర్లకు నెలకు రూ. 5 వేల వేతనం ఇస్తాం. ఆ గ్రామంలో ఉన్న వలంటీర్‌ గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై ఆ ఇళ్లకు ప్రతి సంక్షేమ పథకం డోర్‌ డెలవరీ చేస్తాడని హామీ ఇస్తున్నా. ఎవరి చుట్టూ ఎవరు తిరగాల్సిన పనిలేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. 50 ఇళ్లకు వలంటీర్, గ్రామ సెక్రటేరియట్‌ పెట్టి ప్రతి పథకాన్ని మీ ఇంటికి నేరుగా అందజేస్తామని మాటిస్తున్నా.. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ప్రభుత్వ పథకాలు అందజేసేటప్పుడు కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడమని భరోసా ఇస్తున్నా.

అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకువేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రై వేట్‌ బస్సులు కూడా నడుస్తున్నాయి. ఆ ప్రై వేట్‌ బస్సుల కాంట్రాక్ట్‌ జేసీ బ్రదర్స్, కేశినేని ట్రావెల్స్‌కు అప్పగిస్తున్నారు. ఇది పూర్తిగా మార్చేస్తాం. ఏ గవర్నమెంట్‌ కాంట్రాక్టులో అయినా సరే బస్సులు, కార్లు, అన్ని నిరుద్యోగ యువతకే ఇస్తామని హామీ ఇస్తున్నా. ఆ నిరుద్యోగ యువత కార్లు అద్దెకు పెట్టాలన్నా.. దాని కోసం పెట్టుబడి కింద సబ్సిడీ కూడా ఇస్తామని హామీ ఇస్తున్నా.. అంతేకాదు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి నిరుద్యోగ యువతకు ఇచ్చే ఈ లబ్ధి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 50 శాతం చెందేలా చేస్తాం. 

ఉద్యోగాల కల్పన కోసం ఇంకో అడుగు ముందుకు వస్తాం. అంతేకాకుండా పరిశ్రమల కోసం మన భూములు తీసుకుంటున్నారు. ఉద్యోగాలు మాత్రం మన పిల్లలకు రావడం లేదు. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారికి ఇస్తున్నారు. ఈ పరిస్థితి పూర్తిగా మార్చేస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి శాసనసభలోనే ఒక చట్టం తీసుకువస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే రిజర్వేషన్‌ తీసుకువస్తాం. అంతేకాకుండా.. మన పిల్లలు ఆ పరిశ్రమల్లో పనిచేయడానికి ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు తీసుకొస్తా.. పరిశ్రమల్లో ఉద్యోగాలను బట్టి ఉచితంగా ట్రై నింగ్‌ ఇస్తారు.

ఆ తరువాత దేవుడు ఆశీర్వదించి 25 ఎంపీ స్థానాలు మీ చల్లని దీవెనలతో సాధిస్తే మన ఎంపీలకు జతగా తెలంగాణ 17 ఎంపీలు మద్దతు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తాం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్న ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. హోదాతో హోటళ్లు, పరిశ్రమలు, ఆస్పత్రులు వస్తాయి. హోదా వస్తే జీఎస్టీ, ఇన్‌కం ట్యాక్స్‌ కట్టాల్సిన పనిలేదు. ఒక ఉద్యోగాల విప్లవానికి నాంది పలుకుతాం. మీ అందరి చల్లని దీవెనలు కావాలని కోరుతున్నా.. 

ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌వండి
ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ఉండవు. ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి మరోసారి మభ్యపెట్టేందుకు గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. మిమ్మల్ని మరోసారి మోసం చేయడానికి కుట్ర చేస్తాడు. బాబు కుట్రలను ఛేదించడానికి మీరంతా ఏకం కావాలి. గ్రామాలు, వార్డులకు వెళ్లి ప్రతి అన్న, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వాతాతలను కలవాలి. 

అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. అక్కా వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైనే పలుకుతున్నాయి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రతి అక్కకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని ప్రతి అక్కను అడగండి. రుణాలు మాఫీ కాకపోగా గతంలో సున్నావడ్డీకే వచ్చే రుణాలు పూర్తిగా ఎగరగొట్టాడని చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. చంద్రబాబు చేసే పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల రుణాలన్నీ అన్న నాలుగు దఫాలుగా చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. ఆవరం రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. వారం రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. చంద్రబాబు ఊరికి కనీసం 10 ఇళ్లులు కూడా కట్టించలేదు. వారం రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ జగనన్నతోనే అది సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.

నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో మన బతుకులు మారుతాయి. మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందం చూడవచ్చని గట్టిగానమ్ముతున్నా.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నను నిలబెడుతున్నాను. మీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నను నిలబెడుతున్నాను. వీరిద్దరిని ఆశీర్వదించాలని పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరకు మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 
 

Back to Top