ఎస్పీ బాలు మృతికి సీఎం వైయస్ జగన్‌ సంతాపం

తాడేప‌ల్లి : సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాన’’ని పేర్కొన్నారు.

కాగా, 50 రోజులుగా వెంటిలేట‌ర్‌పై చికిత్స తీసుకుంటున్న ఎస్పీ బాలు ఈ శుక్రవారం కన్నుమూశారు. ప్లేబ్యాక్‌ సింగర్‌గా, నటుడిగా, మ్యూజిక్‌ కంపోజర్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గాంచారు ఎస్పీ బాలు. తెలుగు, త‌మిళ‌మే కాకుండా క‌న్న‌డంలోనూ ఆయ‌న పాడిన పాట‌కు ఎన్నో జాతీయ పురస్కారాలు ల‌భించాయి. త‌మ్ముడు క‌మ‌ల్ హాస‌న్‌కు చేతిలో సినిమాలు లేని స‌మ‌యంలో ఆయ‌న‌ మీదున్న ప్రేమ‌తో బాలు నిర్మాత‌గా మారారు. అలా తీసిన 'శుభ సంక‌ల్పం' ఎన్నో అవార్డుల‌ను తెచ్చి పెట్టింది. 

ఆ అరుదైన ఘనత ఎస్పీ బాలుదే : విజయసాయిరెడ్డి
ఎస్పీ బాల సుబ్రమణ్యం మృతిపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ఎస్పీ బాలసుబ్రమణ్యం కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన అరుదైన ఘనత ఎస్పీ బాలుకు సొంతం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పాడిన పాటలు, సంపాదించిన కీర్తి ముందు తరతరాలకు నిలిచే ఉంటుంద’’ని కొనియాడారు.

బాలు లేని లోటు తీరనిది: మంత్రి బాలినేని
కళామతల్లి ముద్దు బిడ్డ గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రమణ్యం అకాల మృతి జీర్ణించుకోలేక పోతున్నానని, ఆయన మృతి కళా ప్రపంచానికి తీరని లోటు అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం మంత్రి బాలినేని మాట్లాడుతూ.. అన్ని భాషల్లో తన మధుర గానంతో కళామతల్లిని పరవసింపచేసిన మహోన్నత వ్యక్తి బాలు అని కొనియాడారు. పండిత పామరుల హృదయాలను రంజింపచేసిన స్వర చక్రవర్తి మన మధ్య నేడు లేకపోవడం అత్యంత బాధాకరం అన్నారు. బాలు గానామృతం కళాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుదనడంలో అతిశయోక్తి లేదన్నారు. బాలు కుటుంబసభ్యులకు మంత్రి బాలినేని ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఎస్పీ బాలు మహనీయ గాయకుడు : సజ్జల రామక్రిష్ణారెడ్డి
‘తెలుగు నాట జన్మించి తన మధుర గాత్రంతో ప్రపంచాన్ని మంత్ర ముగ్దుల్ని చేసిన మహనీయ గాయకుడు, భారతదేశ చలనచిత్ర రంగంలో కేవలం తన గాత్రంతోనే కాకుండా నటనలోనూ ఎనలేని ముద్ర వేసిన ఆ మహానుభావుడు ఎస్పీ బాలు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. ఆ సంగీత మహనీయుడి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను’

  

తాజా వీడియోలు

Back to Top