తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌ గృహ ప్రవేశం

అమరావతి : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి ఉదయం గృహప్రవేశం చేశారు. సర్వమత ప్రార్థనల మధ్య ఉదయం 8.19 గంటలకు వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు నూతన ఇంట అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, అనిల్‌ కుమార్‌లు హాజరు కాగా.. వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి, తలశిల రఘురాంలు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ పార్టీ నేతల సమక్షంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడంతోపాటు, మహానేత వైయస్ఆర్ ను స్మరించుకున్నారు. ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ కార్యక్రమానికి  హాజరయ్యారు. 

Back to Top