టీడీపీవి శవ రాజకీయాలు  

వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి

ఉదయమే ఇది అనుమానాస్పద మృతి అని చెప్పాం

వివేకానందరెడ్డి హత్యా ఉదంతాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు

బాధితులపై ప్రభుత్వం బుదరజల్లే ప్రయత్నం చేస్తోంది

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ వల్ల న్యాయం జరుగదు

వివేకా హత్యపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరగాలి

వైయస్‌ఆర్‌ జిల్లా: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఎలాంటి విచారణ చేయించకుండానే శవ రాజకీయాలు చేస్తోందని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. వివేకానందరెడ్డిది సహజ మరణం కాదని ముందు నుంచే చెబుతున్నామని, ఈ కేసును పక్కదారి పట్టించే విధంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో న్యాయం జరుగదని, సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండు చేశారు. శనివారం కడపలో మేయర్‌ సురేష్‌బాబుతో కలిసి అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిన్న ఉదయం ప్రజల మనిషి, అందరి ప్రియతమ నాయకుడు వైయస్‌ వివేకానందరెడ్డి హత్య చేయబడ్డ విషయం అందరికి తెలిసిందే అన్నారు. ఈ హత్యా ఉదాంతాన్ని రాష్ట్రంలోని నేతలు ఎన్ని రకాలుగా పక్కదారి పట్టించారో చూశాం. అసలు హత్య చేసింది ఎవరు? చేయించిది ఎవరూ? ఇందులోని కుట్రను బాధ్యత గల ప్రభుత్వం విచారణ చేయకుండా కేవలం శవ రాజకీయాలు చేస్తోంది.

నిన్న ఉదయం నుంచి కేసును పక్కదారి పట్టించేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 6.30 గంటలకు కార్యకర్తలు ఇంటి వద్దకు వచ్చారు. వాళ్లతో మాట్లాడి జమ్ములమడుగుకు బయలుదేరాం. వివేకానందరెడ్డి బామర్ధి ఫోన్‌ చేసి బావ చనిపోయారని చెప్పారు. మేం వెళ్లే సరికి 6.40 గంటలు అయి ఉంటుంది. బాడీ చూసి బయటకు వచ్చి..వెంటనే 6.43కు పోలీసులకు ఫోన్‌ చేశాం, 7 గంటలకు మళ్లీ ఫోన్‌ చేశాను. మళ్లీ 7.13 గంటలకు ఫోన్‌ చేశాం. అప్పటికీ పోలీసులు రాలేదు. విషయం తెలియగానే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. పోలీసులు వచ్చి బాడీని స్వాధీనం చేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

వివేకానందరెడ్డి కూతురు, భార్య హైదరాబాద్‌లో ఉన్నారు. వారు వచ్చే వరకు పోస్టు మార్టం చేయవద్దని చెప్పాం. ఆ తరువాత పోస్టు మార్టం ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలతో ఇది హత్య అని మాట్లాడాం. అంతకు ముందు కూడా ఇది అనుమానాస్పద మృతి అని స్పష్టంగా చెప్పాం. ఇది సాధారణ మరణం కాదనే కదా అర్థం. డాక్టర్లు నిర్ధారించిన తరువాత సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండు చేశాం. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. గతంలో అనేక సిట్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలలో మృతులకు, చిత్తూరు జిల్లాలో ఇసుక దోపిడీ సందర్భంగా ఏర్పాటు చేసిన సిట్‌తో ఎలాంటి ఫలితం రాలేదు. ఇటువంటి పరిస్థితిలో సిట్‌పై నమ్మకం లేక సీబీఐ విచారణ కోరుతున్నాం. వాస్తవాలను బయటకు తీసి దోషులను కఠినంగా శిక్షించాలి. 

 

Back to Top