మహిళను వివస్త్రను చేసిన ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలి

హోంమంత్రి అనిత తక్షణం రాజీనామా చేయాలి

వైయ‌స్సార్‌సీపీ మ‌హిళా నేత‌ల డిమాండ్‌

మ‌హిళను వివ‌స్త్ర చేసిన ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ ఈ నెల 21న అంబేద్కర్ విగ్రహాల వద్ద రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్సార్‌సీపీ మహిళా విభాగం నిరసనలు.

గుంటూరు కృష్ణబాబు కాలనీలో టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి దాడి చేసి, వివస్త్రణకు గురైన బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, గుంటూరు సిటీ పార్టీ ప్రెసిడెంట్ నూరి ఫాతిమా, మాజీ జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ మాజీ మేయర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత త‌దిత‌రులు.  

గుంటూరు: గుంటూరులో ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత దారుణంగా దిగజారిపోయిందో స్పష్టం చేస్తోందని వైయ‌స్సార్‌సీపీ మహిళా నేతలు మండిపడ్డారు. ఇలాంటి అమానవీయ ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలని, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలుస్తామని ప్రకటించిన వారు, రెండేళ్లుగా మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

గుంటూరు కృష్ణబాబు కాలనీలో బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారు 
మీడియాతో మాట్లాడుతూ ఏమ‌న్నారంటే..

రాష్ట్ర చరిత్రలోనే దారుణమైన ఘటన 
- విడదల రజిని, మాజీ మంత్రి

గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. బాధిత మహిళను, ఆమె కుటుంబాన్ని మాజీ సీఎం వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చాం. ఒక మహిళ తన ఇంటి ముందు బోరు మరమ్మతు చేసుకుంటున్న సమయంలో  రూ.10 వేలు  మామూలు ఇవ్వాలని టీడీపీ వార్డు సెక్రటరీ మల్లెల రమణ మూర్తి డిమాండ్ చేయగా..  ఆమె నిరాకరించడంతో కుటుంబంపై రెండుసార్లు దాడి చేసి మహిళను వివస్త్రను చేయడం అమానుషం. బాధిత కుటుంబం రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వీడియోలు వైరల్ అయిన తర్వాతే ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా వెంటనే చర్యలు తీసుకోకుండా రాజీ ప్రయత్నాలు జరిగాయి. రాజధాని ప్రాంతంలోనే మహిళకు రక్షణ లేకపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. మహిళల భద్రతను గాలికి వదిలేసి 'రెడ్ బుక్' రాజకీయాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఘటన ప్రభుత్వానికి తలదించుకునే విషయం. ఇకనైనా మహిళలకు రక్షణ కల్పించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.

ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చే ఘటన
-  వరుదు కళ్యాణి, వైయస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు 

గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చే సంఘటన. రూ.10 వేల మామూలు ఇవ్వలేదనే కారణంతో మహిళపై ఇంత దారుణంగా దాడి జరగడం రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత దిగజారిపోయిందో చూపిస్తోంది. బాధితురాలు పోలీసులను, ఎమ్మెల్యేను ఆశ్రయించినా వెంటనే చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం అత్యంత బాధాకరం. వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వం కదలడం ప్రజలందరూ గమనించారు.
ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయడం కంటే వీడియో ఎలా బయటకు వచ్చిందనే అంశంపైనే మహిళా కమిషన్ దృష్టి పెట్టడం విచారకరం. హోంమంత్రి అనిత ఇప్పటికీ స్పందించకపోవడం మహిళల పట్ల ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి, నిందితులు అందరికీ కఠిన శిక్ష పడాలి. మహిళలపై పెరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు నిర్వహిస్తాం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచి పోరాడుతుంది.

ఈ దారుణం మహిళా లోకాన్ని భయంతో ఉలిక్కి పడేలా చేసింది 
- షేక్ నూరి ఫాతిమా, గుంటూరు నగర అధ్యక్షురాలు 

గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన రాష్ట్రంలోని మహిళా లోకాన్ని కలచివేసింది. భయంతో ఉలిక్కి పడేలా చేసింది.  మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి అమానుష ఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. ఒక వార్డు సెక్రటరీ ఇంత దారుణానికి పాల్పడటమే రాష్ట్రంలో చట్టంపై భయం పూర్తిగా పోయిందనడానికి నిదర్శనం. ముఖ్యమంత్రి, హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యేపై భయం ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదు. మహిళల భద్రతను పూర్తిగా విస్మరించిన కూటమి పాలనలోనే ఇలాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇంత దారుణమైన ఘటన జరిగినా హోంమంత్రి అనిత ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు. బాధిత మహిళకు అండగా నిలవాల్సిన సమయంలో ప్రభుత్వం మౌనంగా ఉండటం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూపిస్తోంది. వైయస్ జగన్ గారి పాలనలో హయాంలో దిశా యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తే, ఇప్పుడు మహిళలు భయంతో జీవించే పరిస్థితి ఏర్పడింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయ‌స్సార్‌సీపీ మహిళా విభాగం అండగా ఉంటుంది. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఈ ఘటనకు ఎమ్మెల్యే బాధ్యత వహించాలి 
- ఉప్పాల హారిక‌, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ 

బాధిత మహిళకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకే మేము ఇక్కడికి వచ్చాం. ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి నైతిక‌ బాధ్యత వహించి సమాధానం చెప్పాలి. బాధిత మహిళపై దాడి చేయడమే కాకుండా అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె కుమారుడిపై కూడా హత్యాయత్నానికి పాల్పడ్డారు. మహిళ మెడలోని బంగారు గొలుసు, చెవి పోగులు లాక్కెళ్లగా, ఆమె చెవికి తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడి మెడపై దాడి చేసిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఇంత దారుణమైన ఘటన జరిగినా సీఎం చంద్రబాబు, హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. ఇలాంటి పరిపాలన రాష్ట్ర మహిళలకు అవసరమా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

బాధిత మహిళకు న్యాయం చేయాలి
- రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మాజీ మేయర్ 

రూ.10 వేల లంచం కోసం ఓ మహిళను ఇంత అమానుషంగా అవమానించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి పాలనలో రేపు ఇంకా ఎలాంటి దారుణాలకైనా పాల్పడే పరిస్థితి వస్తుంది. బాధిత మహిళకు తక్షణమే న్యాయం చేయాలి. నిందితులకు కఠిన శిక్షలు విధించకపోతే వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుంది. గుంటూరు ఘటనకు ముందు కావలిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అక్కడ ఆధారాలు లేవని కేసును పక్కన పెట్టగా, ఇక్కడ వీడియోలు బయటకు రావడంతో మాత్రమే కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన 48 గంటల తర్వాత అరెస్టులు చేయడం సమర్థవంతమైన చర్య కాదు. సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఉంటే బాధిత కుటుంబానికి ప్రభుత్వం ధైర్యం చెప్పగలిగేది. బాధిత మహిళను ప్రత్యక్షంగా కలిసిన తర్వాత ఆమె అనుభవించిన వేదన ఎంత తీవ్రంగా ఉందో అర్థమైంది. నిందితులకు కఠిన శిక్ష పడితేనే న్యాయం జరిగినట్టవుతుంది. జరిగిన అవమానాన్ని ఏ శిక్షా పూర్తిగా భర్తీ చేయలేదు. ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా బాధిత మహిళకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.

కావలి ఘటన పైన సీరియస్ గా స్పందించి ఉంటే... 
- కాకాణి పూజిత, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ 

కావలిలో జరిగిన తొలి ఘటనపైనే ప్రభుత్వం కఠినంగా స్పందించి ఉంటే గుంటూరులో ఈ దారుణం జరిగేది కాదు. మొదటి తప్పుకే గట్టి శిక్ష పడితే మరోసారి ఇలాంటి ఘటనలకు ఎవరూ సాహసించేవారు కాదు. తప్పు చేసిన వారిని కాపాడే వైఖరితోనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనే పరిస్థితి వచ్చింది. పోలీసులు కూడా రాజకీయ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దీంతో మహిళలకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం పూర్తిగా దెబ్బతింది. మహిళలు రోడ్డెక్కి నిరసనలు చేపడుతున్నారంటే అది ప్రభుత్వ వైఫల్యానికే నిదర్శనం. ఈ ఉద్యమం రాజకీయాల కోసం కాదు. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదనతో చేస్తున్న పోరాటం. దీన్ని ప్రభుత్వానికి చివరి హెచ్చరికగా భావించాలి. ఇప్పటికైనా మహిళల భద్రతపై దృష్టి పెట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. బాధిత మహిళకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం పోరాటం కొనసాగిస్తుందని కాకాణి పూజిత స్పష్టం చేశారు.
 

Back to Top