ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించండి

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయ‌స్‌ జగన్‌

ఎస్‌ఈసీకి టీడీపీ దాడులపై ఆధారాలతో ఫిర్యాదు 

పారా మిలటరీ బలగాల మోహరింపు, స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ హాళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు విజ్ఞప్తి

విజయవాడ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరినట్లు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. టీడీపీ శ్రేణుల దాడులు, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలపై ఆధారాలతో సహా ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో పలుచోట్ల వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించడం లేదని జగన్‌ ఆరోపించారు. నామినేషన్‌ కేంద్రాల వద్దే పత్రాలను చించివేస్తున్నా అధికారులు, పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోందని ప్రశ్నించామని తెలిపారు. నామినేషన్‌ ప్రక్రియలోనే పోలీసులు, అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 కేంద్ర బలగాల మోహరింపునకు విజ్ఞప్తి 

ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పారా మిలటరీ బలగాలను మోహరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు జగన్‌ తెలిపారు. కేంద్ర బలగాల మోహరింపుపై గవర్నర్‌ను కూడా కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు చెప్పారు. బ్యాలెట్‌ బాక్సుల భద్రతపై అనుమానాలు ఉన్నాయని, స్ట్రాంగ్‌ రూమ్‌లలోనూ, కౌంటింగ్‌ హాళ్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాలని జగన్‌ కోరారు. ఎన్నికల ప్రక్రియలో ఫారం 17సీకి సంబంధించిన పత్రాల్లో ఫోర్జరీ సంతకాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్‌ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. 

Back to Top