అన్నమయ్య జిల్లా: పుంగనూరులో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వైయస్ఆర్సీపీ అభ్యర్థి ఎస్.ఎం. నయాజ్, ఆయన సతీమణికి చేదు అనుభవం ఎదురైంది. తొమ్మిదో వార్డుకు వైయస్ఆర్సీపీ తరఫున నామినేషన్ వేయడానికి వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నామినేషన్ పత్రాలను లాక్కెళ్లినట్లు సమాచారం. నామినేషన్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనతో ఎన్నికల ప్రక్రియలో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థి పత్రాలను లాక్కెళ్లిన ఘటనపై పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలను అడ్డుకుని, నామినేషన్ పత్రాలను లాక్కెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ శ్రేణులు కోరుతున్నాయి.