అన్నమయ్య జిల్లా: రాయచోటిలో వైయస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్పై దాడికి యత్నం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మదనపల్లి రోడ్డులోని మానస రెస్టారెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఘటనలో జిన్నా షరీఫ్ కారును ధ్వంసం చేసినట్లు సమాచారం. అనంతరం పోలీసులు ఆయనను సంబేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ను టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని వైయస్ఆర్సీపీ వర్గాలు తెలిపాయి. జిన్నా షరీఫ్ను సంబేపల్లి నుంచి కలకడకు, అక్కడి నుంచి గుర్రంకొండకు పోలీసులు తరలిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డిని రాయచోటి పట్టణంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పట్టణ రింగ్రోడ్డు పరిసరాల్లో టీడీపీ కార్యకర్తలు మోహరించినట్లు పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంలో పోలీసులు వారికి సహకరిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులపై దాడులకు యత్నించడం, వాహనాలను ధ్వంసం చేయడం, నాయకుల రాకపోకలకు అడ్డంకులు సృష్టించడం వంటి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ శ్రేణులు కోరుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు స్వేచ్ఛగా పాల్గొనేలా పోలీసులు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.