తిరుపతి: తిరుపతిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. వైయస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్ పత్రాలను టీడీపీ కార్యకర్తలు చించివేశారు. వైయస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థి తరఫున ప్రపోజర్గా వ్యవహరిస్తున్న ఎంపీ గురుమూర్తిని నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ గురుమూర్తి నామినేషన్ పత్రాలను చూపించిన సమయంలోనే వాటిని చించివేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద అభ్యర్థుల హక్కులకు భంగం కలిగించే ఘటనలు చోటుచేసుకోవడంపై వైయస్ఆర్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నామినేషన్ పత్రాలను చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరాయి. అభ్యర్థులు ఎలాంటి అడ్డంకులు, బెదిరింపులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా అధికారులు తగిన భద్రత కల్పించాలని వైయస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. తిరుపతిలో వైయస్ఆర్సీపీ అభ్యర్థి మల్లం రవిపై దాడి తిరుపతి నగరపాలక సంస్థ 7వ డివిజన్ వైయస్ఆర్సీపీ అభ్యర్థి మల్లం రవిపై దాడి జరిగినట్లు సమాచారం. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయనపై దాడికి పాల్పడినట్లు వైయస్ఆర్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల నామినేషన్ల సమయంలో అభ్యర్థులపై దాడులు జరగడం ఆందోళన కలిగించే అంశమని వైయస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా పోలీసులు భద్రత కల్పించాలని, దాడికి బాధ్యులైన వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాయి. తిరుపతిలో వైయస్ఆర్సీపీ నేతలకు రక్షణ కల్పించడంలో పోలీసుల వైఫల్యం: ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఆగ్రహం స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి వైయస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న కేంద్రానికి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో కలిసి వెళ్లినట్లు తెలిపారు. ఆ సమయంలో వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమను చుట్టుముట్టి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఆధార్ కార్డు, నామినేషన్కు సంబంధించిన ఆధారాలు చూపాలని పోలీసులు అడిగారని, పత్రాలు చూపిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు వాటిని లాక్కెళ్లినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదంటూ నిబంధనలు చెప్పే పోలీసులు, ఒక ఎంపీకి, ఎమ్మెల్సీకి రక్షణ కల్పించలేకపోవడం విచారకరమని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని గురుమూర్తి స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రతిపక్ష నేతల హక్కులకు భంగం కలిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులకే రక్షణ కల్పించలేకపోతే స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు ఎలా జరుగుతాయని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు స్వతంత్రంగా చట్టాన్ని అమలు చేయకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. పోలీసు యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి, వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా భద్రత కల్పించాలని డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు.