బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు క‌ల్పించాలి

రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య సాయిరెడ్డి డిమాండు  
 

 న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండు చేశారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం వాడీవేడీ చర్చ జరిగింది. ఆయన ప్రతిపాదించిన బిల్లుకు మెజారిటీ రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి. బిల్లుపై  ఓటింగ్‌ జరపాలని తొలుత విజయసాయి రెడ్డి ప‌ట్టుప‌ట్టారు. దానికి కాంగ్రెస్‌ మిత్రపక్షాలతో సహా అనేక పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే బిల్లుపై స్పందించిన కేంద్రన్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.. దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిని నిరాకరించిన విజయసాయి రెడ్డి.. ఎట్టిపరిస్థితుల్లో కూడా బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.

తాను ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అభ్యంతరం తెలపని ప్రభుత్వం.. ఓటింగ్ సమయంలో అడ్డుచెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. బిల్లును మరింత సమగ్రంగా ప్రవేశపెడతామని హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అధికారంలో ఉన్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో 60 శాతం పదవులు వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చామని రాజ్యసభలో ప్రస్తావించారు. అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున సభలో సగం మంది సభ్యులు ఉండాలని సభ వైస్‌ ఛైర్మన్‌, సభ నాయకుడు వివరించారు. దీంతో బిల్లుపై ఓటింగ్‌ సాధ్యం కాదని మంత్రి రవిశంకర్‌ ప్రకటించారు. కేంద్రమంత్రి తీరుతో అసంతృప్తి వ్యక్తం చేసిన.. విజయసాయి రెడ్డి దానికి నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేశారు. దీనిపై మరింత పోరాటం కొనసాగిస్తామన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top