కల్లు గీత కార్మికుల జీవితాల్లో భరోసా కల్పించే పాలసీ

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

అమరావతి యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు..

 తాడేప‌ల్లి:  కల్లు గీత కార్మికుల జీవితాల్లో భరోసా కల్పించే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొత్త పాల‌సీ తెచ్చార‌ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ అన్నారు. అద్భుత‌మైన‌ పాలసీ తెచ్చినందుకు ముఖ్యమంత్రికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రైతుల యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే ఎక్కడికీ వారిని దేవుడు రానివ్వడం లేదని మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌ పేర్కొన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.  

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ ఇంకా ఏమన్నారంటే...
రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన కల్లు గీత పాలసీని ప్రకటిస్తూ.. కల్లు గీత వృత్తి మీద ఆధారపడి జీవించే కుటుంబాలకు ఒక భరోసాను కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, గీత వృత్తి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కల్లు వృత్తి మీద ఆధారపడి దాదాపు లక్ష మంది జీవిస్తున్నారని ముఖ్యమంత్రి తన సుదీర్ఘ పాదయాత్ర సమయంలోనే గమనించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. గీత వృత్తిదారుడి కుటుంబ సభ్యులు రోజుకు మూడు పర్యాయాలు భయపడుతూ, తమవారు భద్రంగా ఇంటికి రావాలని దేవుడికి దండం పెట్టుకుంటూ జీవిస్తుంటాయి. ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేసే వృత్తి అది. చెట్టు ఎక్కే ప్రతిసారి అంటే, రోజుకు మూడు సార్లు గీత కార్మికులు మృత్యు ముఖంలోకి వెళ్ళే పరిస్థితి. వారి కష్టాలను వైయ‌స్ జగన్ మనసుతో చూశారు. కల్లు గీత వృత్తి మీద ఆధారపడ్డ వారి  కుటుంబాలు భయంకరంగా ఉన్నాయని గమనించారు. వారి కుటుంబంలో ఏ ఒక్కరికైనా ప్రమాదం జరిగితే..  ఆ కుటుంబాల్లో, రెండు, మూడు తరాల వారు ఇబ్బంది పడే పరిస్థితి. 

ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా
గీత కార్మికుల కష్టాలు గుర్తించిన ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్, గీత వృత్తిదారుడు ప్రమాదానికి గురైతే.. రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా అందే విధంగా, అంటే వైయ‌స్స్ఆర్ బీమా నుంచి రూ. 5 లక్షలు, ప్రభుత్వం నుంచి మరో రూ. 5 లక్షలు ఇవ్వాలని నూతన పాలసీలో ప్రకటించారు. ఇటువంటి పరిహారం దేశంలో మరెక్కడా లేదు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో అత్యధికంగా గీత కార్మికులు ఉంటారు. దేశం మొత్తం మీద  8.51 కోట్ల తాటిచెట్లు ఉంటే.. ఒక్క తమిళనాడులోనే 5.31 కోట్ల చెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ రాష్ట్ర వృక్షం తాటిచెట్టే. అయినా, ఆ రాష్ట్రంలో ఎక్స్ గ్రేషియా చాలా తక్కువ. అసంఘటిత కార్మికులు మరణించిన సందర్భాల్లో ఇస్తున్నట్టు మాత్రమే పరిహారం ఇస్తున్నారు. దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ప్రమాద బీమా, ఎక్స్ గ్రేషియా రూ. 10 లక్షలు ఇస్తున్నది మనమే. పక్క రాష్ట్రం తెలంగాణలో చూసినా, కేవలం రూ. 5 లక్షలు మాత్రమే బీమా కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని 95, 245 కల్లు గీత కార్మికుల కుటుంబాలకు వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. 

బాబు పాలనలో వీధివీధినా బెల్టు షాపులు
చంద్రబాబు పాలనలో వీధివీధినా బెల్ట్ షాపులు పెట్టి, గీత వృత్తి దారులను పూర్తిగా దగా చేశాడు. చంద్రబాబు పాలనలో గీత కార్మికులకు 5 ఎకరాల తాటి తోపులు ఇస్తానని వాగ్దానం చేసి దారుణంగా మోసగించాడు.  గీత వృత్తిదారులను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నాడు తప్పితే.. వారి అభివృద్ధికి ఏనాడూ కృషి చేయలేదు. నేచురల్ డ్రింక్ అయిన కల్లుపై బాబు హయాంలో ఏనాడైనా అధ్యయనం చేయించాడా..?. ఆ వృత్తిదారులను కాపాడాలని ఎప్పుడైనా ఆలోచించాడా..?.  ఆఖరికి చంద్రబాబు హయాంలో తాటి చెట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా నరికేస్తుంటే.. దానిని అడ్డుకునేందుకు కూడా కనీస చర్యలు తీసుకోని వ్యక్తి చంద్రబాబు.  బీసీల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగానే, బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో ఒక కమిటీ వేసి, ఏలూరులో బీసీ గర్జన ఏర్పాటు చేసి, అందులో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, మేం అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం వల్ల బీసీల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయి. చంద్రబాబు పాలనలో బీసీలను,  గీత కార్మికులను దగా చేయడంతో వారంతా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీకి అండగా నిలిచారు. వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డికి ప్రేమ పాత్రులయ్యారు. గీత కార్మికుల సంక్షేమం కోసం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న...  ఎక్స్ గ్రేషియాను పెంచిన విధానం గానీ, కల్లు  కిస్తీలను పూర్తిగా మాఫీ చేసిన విధానం తీసుకొచ్చి, గీత వృత్తిదారులు స్వేచ్ఛగా కల్లు గీసుకునే పరిస్థితి కల్పించారు. 

బీసీలకు అన్నివిధాలా అండగా..
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తీసుకొన్న గొప్ప నిర్ణయాల వల్లే బీసీల జీవితాల్లో మార్పులు వచ్చాయి. ఫీజు రీయింబర్స్ మెంటు ద్వారా బీసీల కుటుంబాల్లోని పేద విద్యార్థులు సైతం,  గొప్ప చదువులు చదివి, డాక్టర్లుగా, ఇంజినీర్లుగా మారి విదేశాల్లో స్థిరపడిపోయారు. తండ్రి చూపిన బాటలోనే.. ఆస్తిని ఇవ్వను పేద విద్యార్థులకు మంచి చదువు ఇస్తానని వైయ‌స్‌ జగన్ చెప్పారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీషు మీడియం చదువులతోపాటు, విద్యార్థులకు అవసరమైన బ్యాగులు, యూనిఫాం, షూ, మధ్యాహ్నం భోజనంగా గోరు ముద్ద, వసతి దీవెన, అమ్మ ఒడి, విద్యా దీవెన.. ఇలా ఎన్నో పథకాలు తెచ్చి విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అన్నింటికీ మించీ ఆరోగ్య శ్రీ పథకం బీసీల పాలిట సంజీవనిగా మారింది. వైఎస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీలో 2240 ప్రొసీజర్స్ ఉంటే,  వాటిని టీడీపీ హయాంలో చంద్రబాబు వెయ్యికి కోత వేసి.. బీసీల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో ఇప్పుడు 3,255  ప్రొసీజర్స్ ను చేర్చి పేద ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చారు. అలానే, ఉపాధి పథకం ద్వారా  ఖాళీ ప్రదేశాల్లో కాలువ గట్లు, ఏటి గట్లు, ప్రభుత్వ భూముల్లో తాటి చెట్లు పెంచడం ద్వారా గీత వృత్తి దారులకు మరింత సంరక్షణ కల్పిస్తున్నారు.  కల్లు మీద కూడా అధ్యయనం చేయించి, విదేశాల్లో ఉన్న నీరా పాలసీని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేస్తూ, ఈ వృత్తిని సంరక్షించేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ చర్యలు తీసుకుంటున్నారు. గీత కార్మికుల కుటుంబాల గురించి ఆలోచన చేసిన ఒకే ఒక్క నాయకుడు వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి.  

గీత వృత్తిదారులపై టీడీపీ అబద్ధపు లెక్కలు
టీడీపీ అంటేనే ఒక అబద్ధం.  95,245 మంది గీత వృత్తిదారులు ఉన్నారని ప్రభుత్వపరంగా లెక్కలు చెబుతుంటే.. 2 లక్షల మందికి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ గత చరిత్ర చూస్తే.. 43 వేల బెల్టు షాపులు పెట్టి, మంచినీళ్ళు దొరక్కపోయినా, మద్యం దొరికేలా చేసింది వారే. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అంటే.. రియల్ ఎస్టేట్ వ్యాపారమే. భూమితో అనుబంధం ఉండదు. భూములు ధరలు పెంచాలి, లాభాలు గడించాలన్నదే బాబు లక్ష్యం. చంద్రబాబు హయాంలో.. ఆదరణ పథకం పేరుతో, తాటిచెట్లు ఎక్కేవారికి మోకులు, కత్తులు ఇస్తానని 15, 170 గీత కార్మికులను ఎంపిక చేసి, వారిలో 14 వేల మందికి అవి ఇచ్చాడు.  వీటి కోసం చంద్రబాబు ఖర్చు చేసింది మొత్తం రూ. 8 కోట్లు లోపే. టీడీపీ లెక్క ప్రకారం చూసినా, వాళ్ళు 14 వేల మందికి ఆదరణ పనిముట్లు ఇస్తే.. మా  ప్రభుత్వం 95 వేల మందిని గీత వృత్తిదారులను గుర్తించి, వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాం.  మా ప్రభుత్వం ఇంత చేస్తుంటే.. గీత కార్మికులను ఉద్దరించినట్టు టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం దౌర్భాగ్యం. గీత వృత్తిలో ఉన్న 5 కులాలకు అంటే, శెట్టిబ‌లిజ‌, శ్రీ‌శైన‌, యాత‌, ఈడిగ‌, గౌడ‌లకు 5 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

బీసీలను దగా చేసిన బాబు        
చంద్రబాబు దగాకు బలైపోయినవారు బీసీలే. చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్ మెంటు సక్రమంగా అమలైందా..?. ఫీజు రీయింబర్స్ మెంటులో కోతలు, ఆరోగ్యశ్రీలో కోతలు, ఆఖరికి స్కాలర్ షిప్పుల్లో కోతలు.. ఇలా బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న వ్యక్తి చంద్రబాబు. 2004లో రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే బీసీల జీవితాల్లో మార్పు మొదలైంది.  బీసీలంటే బానిసలుగా, భయస్తులుగా బతకాలని చూసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు పాలనలో నేత కార్మికులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.  నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారులను తోలు తీస్తానని అవమానించిన వ్యక్తి చంద్రబాబు అయితే.. నాయీ బ్రాహ్మణులను ఎవరూ అవమానించకుండా జీవో నంబరు 50 తెచ్చి, వారి గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం ఇది. బీసీలంటే చంద్రబాబుకు ఎంత అలుసు అంటే.. తూర్పు గోదావరి జిల్లాలో అధిక జనాభా ఉండే,  శెట్టి బలిజలకు రెండు సీట్లు అడిగితే.. ఇస్తే, మీరు గెలుస్తారా అని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. 

బాబు దుష్ట పాలనతో బీసీలు మూడు తరాలు వెనక్కి..
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాదయాత్ర ముసుగు వేసినంత మాత్రాన.. ఈరోజు న్యాయమే గెలిచింది కదా.. !. ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి పంపించి, పదే పదే అదే మాట్లాడి అదే నిజం అని ప్రజల్లో ఒక భ్రమ కల్పించేందుకు తన మీడియా ద్వారా, తన మనుషుల ద్వారా చంద్రబాబు నిరంతరం ప్రయత్నిస్తూ శునకానందం పొందుతున్నాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు, నేను ఇది చేశానని  చెప్పగలిగే పరిస్థితి లేదు. అదే, మా పార్టీ, మా ప్రభుత్వం చెప్పగలుగుతుంది. ప్రతి ఇంటికీ వెళ్ళి, వారికి ఎన్ని పథకాలు ఇచ్చామో మా ఎమ్మెల్యేలు ధైర్యంగా వెళ్ళి చెబుతున్నారు.  బీసీలను దగా చేసిందీ, వంచించిందీ చంద్రబాబే. చంద్రబాబు దుష్ట పాలన వల్ల బీసీలను మూడు తరాలు వెనక్కు వెళ్ళే విధంగా చేశాడు. ఇప్పుడు కొత్తగా, బీసీల సదస్సులు పెట్టి ఏం చెబుతాడు..?. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హతే టీడీపీకి లేదు. 1995-2004 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు బీసీలకు ఏమైనా మంచి చేసినట్లైతే.. బీసీల్లో రెండు తరాలు అయినా బాగు పడి ఉండేవి. అన్నివిధాలా బీసీలను నాశనం చేసింది చంద్రబాబే. బీసీలు మోసపోయే రోజులు పోయాయి. బీసీలు బాబు చెప్పినట్టు ఆడే తోలు బొమ్మలు, ఆట బొమ్మలు కాదు 
అన్నది ఇకనైనా గుర్తుంచుకోవాలని మంత్రి వేణు హితవు పలికారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top