విజయవాడ: లైంగిక వేధింపులు తాళలేక తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్య ఘటన అత్యంత దురదృష్టకరమని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బాలిక ఆత్మహత్యకు కారకులైన వినోద్ జైన్‌ను ఉరి తీసినా తప్పు లేదని ఆమె పేర్కొన్నారు. టీడీపీ నేత వినోద్‌జైన్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక కుటుంబ సభ్యులను ఆదివారం దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మతో కలిసి పరామర్శించారు. బాలిక తండ్రి గంగాధర్‌కుమార్, తాతయ్య మాంచాలరావులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బాలిక ఎంతో మనోవేదనకు గురైందని, టీడీపీ నేత వినోద్ జైన్ తనను లైంగికంగా ఇబ్బందికి గురిచేసినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొందని తెలిపారు. మూడు పేజీల లేఖ రాసిందంటే ఆమె ఎంతగా మానసిక వేదనకు గురైందో అర్థం చేసుకోవచ్చన్నారు. బాలిక తాతయ్య రిటైర్డ్ తహసీల్దారు అని, పిల్లల కోసం ఏలూరు నుంచి విజయవాడ వచ్చినట్లు తెలిపారన్నారు. 50 ఏళ్లకు పైగా వయసున్న వినోద్ జైన్ దారుణంగా ప్రవర్తించాడని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వినోద్‌జైన్ ఎంపీ కేశినేని నాని ముఖ్య అనుచరుడని, వినోద్ తరఫున చంద్రబాబు కూడా గత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏమి సమాధానం చెపుతారని ప్రశ్నించారు. బాలిక తల్లిదండ్రుల బాధ చూడలేక పోతున్నామని, దోషిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి చెప్పారు. చంద్రబాబు ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్ వద్ద, మెట్ల వద్ద అసభ్యంగా ప్రవర్తించాడని, మానవత్వం లేని వ్యక్తికి సంఘంలో చోటు ఉండకూడదన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు దుర్గమ్మ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. చిత్రంలో దీక్షిత గౌరి తల్లిదండ్రులు బాలిక ఆత్మహత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులే కారణమని బాలిక తన సూసైడ్ నోట్‌లో రాసిందని, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల విద్యార్థిని లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు పురిగొల్పిన వినోద్‌జైన్‌ను ఉరితీసినా తప్పులేదన్నారు. వినోద్‌జైన్ దుర్బుద్ధి కారణంగా ప్రతిభావంతురాలైన బాలిక బలైందన్నారు. కుటుంబానికి చెప్పుకోలేని స్థితిలో ఆ బాలిక భయపడి మేడ మీద నుంచి దూకిందంటే ఏ మేరకు వేధించాడో అర్థమవుతోందన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో టీడీపీ నేతల పేర్లు వచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే, ఇలాంటి ఘటన జరిగేది కాదన్నారు. బాలిక లేఖ చూసే వరకూ వాస్తవం బయటకు రాలేదని, రెండు నెలలుగా శరీరాన్ని తాకుతూ ఇబ్బంది పెట్టాడన్నారు. టీడీపీలో వినోద్‌జైన్ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు అహరహం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే టీడీపీ వాళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెపుతారని ఆమె ప్రశ్నించారు. స్థానిక కార్పొరేటర్ రెహమతున్నీసా బాలిక ఇంటికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు. బాలిక తల్లిని ఓదార్చారు.