ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై రాజ్యసభలో వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో చేపల వేట రంగ అభివృద్ధి కోసం చేపట్టిన హార్బర్ ప్రాజెక్టుల పురోగతిపై వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. మచిలీపట్నం, పూడిమాకా (అనకాపల్లి), ఉప్పాడ, నిజాంపట్నం, బుడుగుట్లపాలెం వంటి ఫిషింగ్ హార్బర్లను కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలోగా పూర్తి చేస్తుందో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ స్పందిస్తూ, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో కేవలం 25 శాతం పనులు మాత్రమే పూర్తవడంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఆలస్యమవడం వల్ల మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.