శాసనమండలి సలహాలు ఇచ్చే సభ మాత్రమే

అసెంబ్లీలో పాసైన బిల్లును రిజక్ట్‌ చేసే సభ కాదు

మండలి చైర్మన్‌ తీరు క్షమించరాని నేరం

టీడీపీకి ఫేవర్‌ చేయడానికి రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారా..?

మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఫైర్‌

సచివాలయం: శాసనమండలి సలహాలు చెప్పే సభ తప్ప.. శాసనసభలో పాసైన బిల్లును మెజార్టీ ఉందని ఓడించే సభ కాదని మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. నిన్న మండలిలో చైర్మన్‌ ప్రవర్తించిన తీరు క్షమించరాని నేరమన్నారు. బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తామని చెప్పిన తరువాత మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా లేచివెళ్లిపోయాడన్నారు. సచివాలయంలో ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అవకాశం ఇస్తే జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి అడుగుతామో.. ఇంకొకటి అడుగుతామో మాకు అవకాశం ఇవ్వాలి. మీ అభిప్రాయాలు ఏంటని సభలో చర్చ జరగాలి కాదా..? ఇదేమీ లేకుండా ప్రీపాన్ల్‌గా వచ్చిన మండలి చైర్మన్‌ రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోయాడన్నారు. చాలా మంది చైర్మన్‌లుగా చేశారు కానీ, ఎవరూ ఇలా ఒక పార్టీ కార్యకర్తలా ప్రవర్తించలేదన్నారు. ఏమైనా లావాదేవీలు ఉంటే టీడీపీ ఆఫీస్‌కు వెళ్లి చేసుకోవాలి కానీ, మండలి చైర్మన్‌ షరీఫ్‌ పెద్దల సభలో రాజ్యాంగానికి విరుద్ధంగా నడిపించారన్నారు. టీడీపీకి ఫేవర్‌ చేయడానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని ఖూనీ చేయకూడదని చెప్పామని, ఇది క్షమించరాని నేరమన్నారు.

ఒక స్పీకర్‌గా హౌస్‌కు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి న్యాయం చేయాల్సిందిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా చేసిన విధానం ఆక్షేపనీయమన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని, ఇవాళ కాదు.. రేపు అయినా సమాజానికి మండలి చైర్మన్‌ షరీఫ్‌ క్షమాపణ చెపాల్సిన పరిస్థితి ఉందన్నారు. సభ వాయిదా వేసిన తరువాత రాజీనామా చేసి వెళ్లిపోతే ఇంకా గౌరవంగా ఉండేదని, చైర్మన్‌గా చేసే అవకాశం షరీఫ్‌ కోల్పోయాడన్నారు. సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తానని చెప్పినప్పుడు ఎందుకు ఓటింగ్‌ తీసుకోలేదు. ఓటింగ్‌ తీసుకోకుండా ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచించిన విధంగా రెండు ముక్కలు చెప్పడానికి వచ్చి వెళ్లిపోయాడని, ఇటువంటి దురాఘతం గతంలో ఎన్నడూ వచ్చి ఉండదన్నారు.

 

Back to Top