చంద్రబాబు అరాచక పాలనకు రెండేళ్లు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వ‌జం 

నెల్లూరు జిల్లాలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిర‌స‌న కార్య‌క్ర‌మం

నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం నరుకూరులోని రిషీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్ల బెలూన్లు ఎగురవేసి కూటమి ప్రభుత్వ పాలనకు నిరసన తెలిపారు. కార్యక్రమానికి హాజరైన కాకాణి గోవర్ధన్ రెడ్డికి పార్టీ శ్రేణులు గజమాలలు, శాలువాలు, బొకేలతో ఘన స్వాగతం పలికాయి. కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమంతా ఇతరులు అమలు చేసిన పథకాలను కాపీ కొట్టడానికే పరిమితమైందని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా, అమ్మ ఒడి వంటి పథకాలనే పేర్లు మార్చి ఎన్నికల హామీలుగా ప్రకటించారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలను కూడా కాపీ చేసి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారని అన్నారు.

 సూపర్ సిక్స్ హామీల పరిస్థితి ఏమైంది? 

ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3,000 భృతి, వాలంటీర్లకు జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. తల్లికి వందనం పథకాన్ని కూడా ఎన్నికల హామీలకు విరుద్ధంగా అమలు చేశారని ఆరోపించారు. రైతులకు రూ.20 వేల సాయం అందిస్తామని చెప్పి, గతంలో రైతు భరోసా ద్వారా లబ్ధి పొందిన లక్షలాది రైతు కుటుంబాలను ఇప్పుడు పక్కన పెట్టారని పేర్కొన్నారు. కౌలు రైతుల సమస్యలపై మాట్లాడిన నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి కూడా స్పందించడం లేదని అన్నారు.

 డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయి 
మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారని మ‌హిళా విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత‌ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జీవో నెం.47 ద్వారా నిబంధనలను మార్చి భారీ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రవేశ పరీక్షలు లేకుండానే వందలాది ఉద్యోగాలు కట్టబెట్టారని, డీఎస్సీ ప్రక్రియ పూర్తయ్యాక జీవో నెం.56 ద్వారా మళ్లీ నిబంధనలు మార్చడం అనుమానాలకు తావిస్తోందన్నారు. టెట్, ఇతర పోటీ పరీక్షలకు కష్టపడి సిద్ధమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసిన ప్రభుత్వం 
కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తోందని, మహిళలు, రైతులు, యువత, వెనుకబడిన వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పూజిత‌ అన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైయ‌స్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించిందని గుర్తు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు, కక్షసాధింపు చర్యలు కొనసాగితే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలన్నింటినీ నమోదు చేస్తున్నామని, భవిష్యత్తులో వాటిపై ప్రత్యేక విచారణలు జరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండేళ్లుగా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాకాణి పూజిత‌ పేర్కొన్నారు.
 

Back to Top