తిరుపతి: ప్రభుత్వం అనుకూల అధికారులను కాపాడుకునేందుకు, వాస్తవాలు వెలుగు చూడకుండా ఉండేందుకు తిరుపతి తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణను నిర్వీర్యం చేశారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ తొక్కిసలాటకు బాధ్యులైన వారు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో వారిని కాపాడేందుకు మొత్తం నివేదికనే నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులను బలిపశువులను చేశారని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో అసలు నిజాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. వైయస్ జగన్ సీఎంగా ఉండగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీలైనంత ఎక్కువమంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో శ్రీరంగపట్టణాన్ని ఆదర్శంగా తీసుకుని పది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను కల్పించడం జరిగింది. 23 మంది మఠాధిపతుల ఆశీర్వాదాలతో దేశంలోని హిందువులంతా గర్వించేలా రెండేళ్లపాటు అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ రెండేళ్లు కూడా వైకుంఠ ఏకాదశికి ముందు రోజు రాత్రే పది రోజులకు టోకెన్లు ఇవ్వడం జరిగింది. దీంతో ఎలాంటి తొక్కిసలాట జరగుండా భక్తులు టోకెన్లు తీసుకుని నిర్విఘ్నంగా స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. కానీ కూటమి ప్రభుత్వంలో టోకెన్ల పంపిణీ అడ్డగోలుగా జరిగింది. జనవరి 10,11, 12వ తేదీలకు మాత్రమే టోకెన్లు ఇస్తామని చెప్పారు. అక్కడున్న పరిస్థితిని చూసి మిగతా ఏడు రోజులకు టోకెన్లు ఇస్తామని ప్రోసీడింగ్స్‌లో చెప్పారు. టోకెన్ల పంపిణీలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో 6 మంది భక్తులు చనిపోగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. జనవరి 9న తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు సందర్శించి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఈవో, సీవీఎస్వో మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తిరుపతికి వచ్చి ఈ ఘటనకు టీటీడీ చైర్మన్, ఈవో, చైర్మన్‌ల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని నిర్ధారించి వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం నిందితుల తరఫున ఆయనే క్షమాపణలు చెప్పేసి వచ్చారు. ఈ దుర్ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి తీవ్రమైన ఆగ్రహావేశాలు పెల్లుబుకడంతో ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. కావాల్సిన వారితోనే సాక్ష్యం ఇప్పించుకున్నారు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ముందే డెయిరీ ఫామ్ అధికారి హరినాథరెడ్డి, క్రైమ్ డీఎస్పీ రమణ కుమార్‌ని బాధ్యులను చేస్తూ సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమిలను మాత్రం బదిలీ చేసి వదిలేశారు. ఆరు నెలల తర్వాత ఇచ్చిన కమిషన్ నివేదిక చూస్తే విచారణ పేరుతో తమకు కావాల్సిన వారితోనే సాక్ష్యం ఇప్పించుకుని ప్రభుత్వమే రిపోర్టు రాసి వారితో ఇప్పించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించి నిన్న కేబినెట్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం చూస్తే అసలు నిందితులను వదిలేసి మేకలను బలిచ్చినట్టుగా ఉంది. ముందే అనుకున్నట్టుగా డెయిరీ ఫామ్ అధికారి హరినాథరెడ్డి, క్రైమ్ డీఎస్పీ రమణ కుమార్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ముందుగానే సిద్ధం చేసుకున్న స్క్రిప్టు ఆధారంగా హరినాథరెడ్డిని బలిచేసేందుకు ఆయన వైయస్ఆర్‌సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని గత ఆరు నెలలుగా ప్రచారం చేస్తూ వచ్చారు. తాము చెప్పాలనుకున్నదే ఆరు నెలల తర్వాత జ్యూడిషియల్ కమిషన్ ద్వారా చెప్పించారని ఎవరికైనా అర్థమవుతుంది. దురుద్దేపూర్వకంగా ఈ నివేదికను ఇచ్చినట్టుగా వైయస్ఆర్‌సీపీ భావిస్తూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. చంద్రబాబు ఏర్పాటు చేసే కమిషన్లకు, వారిచ్చే రిపోర్టులకు ఇదొక కేస్ స్టడీ. మీటింగ్ ప్రొసీడింగ్స్ ప్రకారం చూస్తే.. వైకుంఠ ఏకాదశికి సన్నద్ధత కోసం 21-12-2024 న నిర్వహించిన సమావేశంలో హరినాథరెడ్డికి టోకెన్లు ఇచ్చే కౌంటర్ దగ్గర నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఆయనతోపాటు సూర్యప్రకాశ్ అనే మరో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కి సైతం సమానమైన బాధ్యతలు అప్పగించారు. వీరితోపాటు క్యూలైన్లను పర్యవేక్షించే బాధ్యతలను లా అండ్ ఆర్డర్ విజిలెన్స్ (సీవీఎస్వో) విభాగానికి అప్పగించారు. వీరిని సమన్వయం చేసే బాధ్యతను జేఈవో గౌతమికి అప్పగించారు. లా అండ్ ఆర్డర్ చూడాల్సిన బాధ్యత సంబంధిత (సీవీఎస్వో) ఎస్పీదేనని ఆరోజు ఇచ్చిన ప్రోసీడింగ్స్‌ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి జరిగినప్పుడు విచారణకు వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి చందనా ఖన్.. తొక్కిసలాటల ఘటనలకు ఈవోనే బాధ్యత వహించాలని తన నివేదికలో ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పారు. ఆలయ ఈవో సర్వాధికారాలు ఉన్న వ్యక్తిగా సమన్వయ సమావేశంలో ఎస్పీ, కలెక్టర్, రెవెన్యూ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అంటే ప్రమాదం జరిగితే వారే బాధ్యులని కదా అర్థం. వారందర్నీ వదిలిపెట్టి కేవలం ఇద్దరి మీదనే క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారు? టోకెన్ల కోసం వచ్చిన భక్తులను నేరుగా క్యూ లైన్లలోకి వదలకుండా హోల్డింగ్ పాయింట్లు ఎందుకు ఏర్పాటు చేశారు? భక్తులు తొక్కిసలాటలో పడిపోయినప్పుడు అక్కడున్న పోలీస్ అధికారులు చోద్యం చూశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? చంద్రబాబు తాను చేసిన తప్పులన్నీ పక్కనపెట్టి గతంలో వైయస్ఆర్‌సీపీ తీసుకున్న 10 రోజుల దర్శన నిర్ణయమే తప్పంటూ ప్రచారం చేశాడు. మా హయాంలో ఏ అపచారం జరగకుండా రెండేళ్లపాటు దర్శనాలు కల్పించినప్పుడు ఆయనెందుకు చేయలేకపోయారు? చంద్రబాబు పర్యటనలకి అధికార యంత్రాంగం మొత్తం వెళ్లి ఆయన్ను మెప్పించే పనుల్లో బిజీగా ఉండి, భక్తుల బాగోగులు పక్కనపెట్టాయి కాబట్టే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సీబీఐ విచారణతోనే నిజాలు నిగ్గుతేలుతాయి చంద్రబాబు ఆదేశాలతో ఏ విచారణ కమిషన్ వేసినా నిజమైన నిందితులు పట్టుబడే అవకాశాలు ఉండవని ఈ నివేదికను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. తమకు అనుకూలంగా వ్యవహరించే వారు నిందితులైనా వారిని కాపాడి, అమాయకులను బలిచేసే ఈ కుట్రలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన ఈ జ్యుడిషియల్ నివేదికను వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తుంది. సీబీఐకి అప్పగిస్తే తప్ప ఈ ఘటనకి కారణమైన నిజమైన నిందితులు బయటకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదని వైయస్ఆర్‌సీపీ అభిప్రాయపడుతోంది. హిందువుల మనోభావాలు కాపాడాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి.