టీచర్లపై కక్షసాధింపు ఎందుకు చంద్రబాబూ?

సమస్య పరిష్కరించాల్సింది పోయి వినతిపత్రం ఇచ్చినందుకు సస్పెన్షన్లా?

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను వరుసగా సస్పెండ్‌ చేశారు. వారు చేసిన నేరం ఏమిటి? తాము ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్‌ నిబంధనను ఇప్పుడు అమలు చేయడం వల్ల లక్ష మందికిపైగా సీనియర్‌ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే నేరమా? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. తమ సమస్య నుంచి మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతుగా ఉన్న ఎంపీలతో కలిసి కేంద్రానికి వినతిపత్రం ఇవ్వడం తప్పా? మీరు చేయాల్సిన పని మీరు చేయలేదు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి, తమ సమస్యను తామే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించిన టీచర్లపై రాజకీయ ముద్ర వేయడం దారుణమ‌ని మండిప‌డ్డారు. 
ఇది ప్రభుత్వ ఉద్యోగులపై మీ వైఖరికి నిదర్శనం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. ఐఆర్‌ లేదు, పీఆర్‌సీ లేదు, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్‌సీ బకాయిలు, డీఏలు, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ వంటి బకాయిలు పేరుకుపోయాయి అంటూ ప్ర‌భుత్వ తీరును వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు.  

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
చంద్ర‌బాబు  గారూ… ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా?
మొదటి రోజు వైయస్సార్‌ కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్‌ చేశారు? వారు ఏం నేరం చేశారు? వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలి, అన్న టెట్‌ నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్‌ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా?

మీ రెడ్‌బుక్‌ అరాచక జంగిల్‌రాజ్‌ చివరకు ప్రభుత్వ టీచర్లనూ వదిలిపెట్టడం లేదు.
చంద్రబాబుగారూ… అసలు ఈ టెట్‌ నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరాల్సింది మీరు కాదా? ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు?

మీరు చేయాల్సిన పని చేయలేదు. సీనియర్‌ టీచర్ల సమస్యను గాలికి వదిలేశారు. తమ సమస్యను మా పార్టీ ఎంపీల సహకారంతో తామే కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం వారిపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా?
మీరు చేయలేని పని వారు చేయడానికి ప్రయత్నించడమే తప్పా?
వినతిపత్రం ఇవ్వడమే నేరమా? దానికి సస్పెన్షన్‌ విధిస్తారా? 
ఒక సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లకు రాజకీయాలను అంటగట్టడం దారుణం. మరీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తారా?

ఉద్యోగుల విషయంలో మీ మోసం కూడా ఇదే స్థాయిలో ఉంది.
మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే IR ప్రకటిస్తామన్నారు. మెరుగైన PRC ఇస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి మూడో ఏడాది నడుస్తోంది ! IR లేదు! PRC లేదు! 5 DAలు పెండింగ్ !
CPS/OPSను పునఃసమీక్షిస్తామంటూ ఉద్యోగులకు ఆశ చూపారు. చివరకు CPSకు ప్రత్యామ్నాయంగా మేం ప్రకటించిన GPSను కూడా అమలు చేయకుండా ఉద్యోగులను త్రిశంకుస్వర్గంలో పెట్టారు. 

ఉద్యోగులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్‌ డీఏలు, GPF, APGLI, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, సరెండర్‌ లీవ్స్‌ లేదా ఎన్‌క్యాష్‌మెంట్‌ లీవులు… ఇలా దాదాపు రూ. 35వేల నుంచి రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టారు.
తమకు న్యాయంగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తుంటే ఒక్క పైసా ఇవ్వరు. కానీ వారికి సస్పెన్షన్లను బహుమానంగా ఇస్తున్నారు.ఇదేనా ఉద్యోగుల పట్ల మీ గౌరవం? ఇదేనా టీచర్ల పట్ల మీ బాధ్యత?
అధికారం ఉందనే అహంకారంతో, నియంతృత్వ విధానాలతో మీరు చెలరేగిపోతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబుగారూ. చివరకు మీ నీడను కూడా మీరు భరించలేని స్థాయికి వెళ్లిపోయారు.

వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయండి. వారికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటాం. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్‌ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తాం. వారికి భరోసా ఇస్తాం. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైయస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది.

Back to Top