ఉద్దానం కిడ్నీ బాధితులకు సర్కార్‌ అండ

పలాసలో 200 పడకల ఆసుపత్రి, డాక్టర్‌ పోస్టులు మంజూరు

ఉద్దానంలో రూ.600 కోట్లతో మంచినీటి పథకం 

రాష్ట్ర ప్రభుత్వ ఆమోద ముద్ర 

 అమరావతి: దశాబ్దాల తరబడి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రూ.600 కోట్లతో సమగ్ర మంచి నీటి పథకం నిర్మాణానికి అనుమతి తెలిపింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తూ, అందులో వైద్యుల పోస్టులు మంజూరు చేసింది. రూ.50 కోట్లతో డయాలసిస్‌, రీసెర్చ్‌ సెంటర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్హులు జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్ పద్ధతిలో 98 ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 60 ఖాళీలను ఈ సందర్భంగా భర్తీ చేయనున్నారు.ప్రజా సంకల్ప యాత్ర, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేయడం పట్ల ఉద్ధానం కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శాశ్వత పరిష్కారానికి చర్యలు
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి, రోగులు ఎక్కువగా ఉండడానికి అక్కడి ప్రజలు తాగే నీరు కారణమని పలువురు నిపుణులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని బోర్ల ద్వారా సేకరించిన నీటినే మంచినీటి పథకాల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఇకపై బయటి ప్రాంతం నుంచి నదీ జలాలను ఆ ప్రాంతానికి తరలించి ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని రేగులపాడు వద్ద ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వ చర్యల వల్ల జిల్లాలోని పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పట్టణాలతో పాటు ఏడు మండలాల పరిధిలోని 807 నివాసిత ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు ఉపయోగం కలగనుంది. ఈ సమగ్ర మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతి తెలుపుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఈ పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.   

Back to Top