పుంగనూరు : పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో భారీ అవకతవకలు, నాసిరకం నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైయస్ఆర్‌సీపీ నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా పనుల నాణ్యతపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం పార్టీ సమన్వయకర్త తలారి రంగయ్య, కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు కెనాల్ పనులను పరిశీలించారు. రూ.102 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనుల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. సిమెంట్ లైనింగ్ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, పనులు పూర్తికాకముందే కెనాల్ గోడలు పెచ్చులూడిపోతుండటం నాసిరకం పనులకు నిదర్శనమని నేతలు మండిపడ్డారు. ప్రజాధనంతో చేపట్టే ప్రాజెక్టుల్లో నాణ్యతను పూర్తిగా విస్మరించి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజల సొమ్ముతో చేపట్టిన పనుల్లో పారదర్శకత, నాణ్యత ఉండాల్సిందిపోయి కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు దోచిపెట్టడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. “దోచిపెట్టడంలో చూపుతున్న శ్రద్ధ.. పనుల్లో నాణ్యతపై ఎందుకు చూపడం లేదు చంద్రబాబు?” అని ప్రశ్నించారు. పనుల్లో జరిగిన అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి, నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.