పంతం నానాజీపై కఠిన చర్యలు తీసుకోవాలి

కర్నూలు పోలీసులకు కాటసాని రామభూపాల్ రెడ్డి ఫిర్యాదు 

కర్నూలు: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారిపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఎస్సైకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. జూన్ 21న నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నానాజీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేశారని, అనంతరం ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఒక ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాటసాని రామభూపాల్ రెడ్డి అన్నారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజల మధ్య శత్రుత్వం పెంచేలా ఉండటంతో పాటు రాష్ట్ర శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)-2023 నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే నానాజీతో పాటు ఆ వీడియోలు, పోస్టులను ప్రచారం చేసిన వారిపై కూడా వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 
 

Back to Top