‘లూలూ’ కోసమే ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర

పూనూరు గౌతమ్‌రెడ్డి ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ కార్మిక విభాగం (వైయస్సార్‌టీయూసీ) అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి.

ఆర్టీసీ ప్రైవేటీకరణపై మూర్ఖంగా ముందుకెళ్లడం సరికాదు   

కార్మిక సంఘాలతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమిస్తుంది  

:పూనూరు గౌతమ్‌రెడ్డి స్పష్టీకరణ

లక్ష కోట్ల విలువైన ఆర్టీసీ భూములపై కన్నేసిన చంద్రబాబు

అందుకు అనుగుణంగానే ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం   

ఎలక్ట్రిక్‌ బస్సులపై కేంద్ర నిర్ణయం అనుకూలంగా మార్పు

బస్సుల నిర్వహణకు రూ.500 కోట్లు లేవనడం సిగ్గుచేటు

ప్రెస్‌మీట్‌లో పూనూరు గౌతమ్‌రెడ్డి ఆక్షేపణ

తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న లక్ష కోట్ల విలువైన భూములపై కన్నేసిన చంద్రబాబు, వాటిని లూలూకు కట్టబెట్టి కాజేసేందుకే ప్రైవేటీకరణ పేరుతో వేగంగా అడుగులు వేస్తున్నాడని వైయ‌స్ఆర్‌సీపీ కార్మిక విభాగం (వైయస్సార్‌టీయూసీ) అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశలో అడుగులు ముందుకేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, కార్మిక సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదించిన ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని తన ప్రైవేటీకరణ కుట్రలకు వేదికగా మార్చుకున్నాడని, ఈ బస్సుల నిర్వహణకు రూ. 500 కోట్లు లేవని చెప్పడం సిగ్గుచేటన్నారు. రెండేళ్లలోనే రూ. 3.60 లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం దగ్గర ఆర్టీసీకి కేటాయించడానికి రూ. 500 కోట్లు లేవా అని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 55 వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు వైయస్‌ జగన్‌ గారు భరోసా కల్పిస్తే, ప్రైవేటీకరణతో చంద్రబాబు వారిని రోడ్డున పడేసే కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. నష్టాలు వస్తున్నాయనే కారణం చూపించి ఆర్టీసీని ప్రైవేటీకరించడం ఏ మాత్రం సరికాదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పి.గౌతమ్‌రెడ్డి తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో పూనూరు గౌతమ్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

చంద్రబాబు మేక వన్నె పులి:
    ఆంధ్ర రాష్ట్రంలో అంతుచిక్కని మాయగాడు చంద్రబాబు. మేకతోలు కప్పుకున్న పులి మాదిరిగా కపట నాటకాలు ఆడుతున్నాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేక తోలు తీసేసి పులి అవతారంలో కార్మికులను భయాందోళనలకు గురి చేస్తున్నాడు. దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా కార్పొరేషన్‌గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 55 వేల మంది కార్మికులకి వైయస్‌ జగన్‌ గారు ఉద్యోగ భద్రత కల్పిస్తే, 2024లో చంద్రబాబు సీఎం కాగానే ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలకు పదును పెడుతూ వస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తూ వచ్చాడు. అధిక ఆదాయం వచ్చే రూట్లను ప్రైవేటీకరించిన ఘనుడు చంద్రబాబు. ఆర్టీసీలో ప్రైవేట్‌ బస్సులను ప్రవేశపెట్టిందీ ఆయనే. పేద ప్రజలు రవాణా సాధనంగా ఉన్న ఆర్టీసీని కూడా ధనాశతో వారికి కాకుండా చేస్తున్నాడు. పథకం ప్రకారం ఆర్టీసీని నష్టాల బాట పట్టించి ప్రైవేటీకరణ చేయడానికి వేగంగా అడుగులు వేస్తున్నాడు. 16 రకాల సర్వీసుల్లో కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించి ఇప్పుడు దాన్ని కూడా లేకుండా చేయడానికి పూనుకుంటున్నాడు. ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం వచ్చే విజయవాడ– హైదరాబాద్, విజయవాడ– బెంగళూరు, విజయవాడ– చెన్నై వంటి రూట్లను ప్రైవేటుపరం చేసి, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తన వారికి మళ్లించాడు.  

ప్రభుత్వం దగ్గర రూ. 500 కోట్లు లేవా?:
    ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ఆలోచించకుండా ప్రైవేటుపరం చేయాలనే ధృఢ నిశ్చయంతో చంద్రబాబు పని చేస్తున్నాడు. ఆర్టీసీలో ఈ బస్‌ విధానాన్ని ప్రవేశపెట్టే నెపంతో తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాడు. కేంద్రం ఇస్తున్న 1000 ఈ బస్‌ల నిర్వహణకు రాష్ట్రానికి రూ. 500 కోట్లు వ్యయం అవుతుంది. ఆ డబ్బు ప్రభుత్వం వద్ద లేదన్న కారణం చూపి ప్రైవేటీకరణ చేస్తామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు రూ.89 కోట్లు ఖర్చు అవుతుండగా, అందులో కేంద్రం రూ.80 కోట్లు ఇస్తుంది. మిగిలిన రూ. 9 కోట్లు భరించే స్థోమత కూడా ప్రభుత్వానికి లేదనడం దారుణం. వైయస్‌ జగన్‌ గారు ఆర్టీసీని ప్రభుత్వం పరం చేసి తన మార్క్‌ చూపిస్తే, ఆయనకు మంచి పేరొంచ్చిందన్న అక్కసుతోనే ఇప్పుడు చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తామంటున్నాడు. 55 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలను రోడ్డున పడేయడానికి కూడా ఏమాత్రం సంకోసించడం లేదు. 
    లక్ష కోట్ల విలువైన ఆస్తులున్న ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి వాటిని కొట్టేయడానికే చంద్రబాబు ప్రైవేటీకరణ పేరుతో కుట్రలు చేస్తున్నాడు. ఆర్టీసీ భూములను లూలూ సంస్థకు కట్టబెట్టాలని చూస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 8 వేల బస్సుల స్థానంలో విడతల వారీగా ఈ బస్సులు ప్రవేశపెట్టే నెపంతో ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాడు. చంద్రబాబు నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు కానిచ్చేది లేదు. 

కార్మిక సంఘాలతో చర్చించాలి:
    ఆర్టీసీని లాభాలబాట పట్టించడానికి ఏం చేయాలో సదస్సులు నిర్వహించి కార్మిక సంఘాల సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఏకపక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. మా సూచనలు విస్మరిస్తే కార్మిక సంఘాలతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ నేతృత్వంలో ఉద్యమిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ స్థలాల్లో కాంప్లెక్స్‌లు అభివృద్ధి చేయాలని, వాటిలో థియేటర్లతో కూడిన మల్టీప్లెక్సులు నిర్మించాలని సూచించారు. అందుకే ఇప్పటికైనా ఆర్టీసీ ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని గౌతమ్‌రెడ్డి కోరారు.

Back to Top