కల్తీ పాల బాధిత చిన్నారులకు వైద్యం కొనసాగించాలి

మాజీ ఎంపీ మార్గాని భరత్‌ డిమాండ్‌

రాజమహేంద్రవరంలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌.

చిన్నారులను ఇంటికి తీసుకెళ్లాలనడం దారుణం

బాధిత కుటుంబాలకు వైద్య ఖర్చులు చెల్లించాలి 

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన మాజీ ఎంపీ మార్గాని భరత్‌ 

రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో ఆస్పత్రి పాలైన ఇద్దరు చిన్నారులు కోలుకునే వరకు వైద్యం కొనసాగించాలని, వైయస్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
    చిన్నారులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని, అక్కడే ఉంచితే వారి వైద్య ఖర్చులు ఆ కుటుంబాలే భరించాలని ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి చేయడం దారుణమని మాజీ ఎంపీ మండిపడ్డారు. పాల కల్తీకి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఘటన జరిగినప్పుడు వారు కోలుకునే వరకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుందని కలెక్టర్, మంత్రులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మేరకు చిన్నారులకు  వైద్యం కొనసాగించడంతో పాటు, గతంలో వారు చేసిన ఖర్చులను కూడా బాధిత కుటుంబాలకు రీయింబర్స్‌ చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో మార్గాని భరత్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

అవసరమైతే న్యాయపోరాటం:
    బాధితులు పేద వారే కదా, వాళ్లేం చేస్తారులే అనే ధీమాతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ వారి పక్షాన నిలబడి పోరాడుతుంది. ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధితుల తరఫున న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాడుతాం. 

ఇప్పటికీ కారణాలు వెల్లడించలేదు:
    కల్తీ పాల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. ఈ ఘటన జరిగి 4 నెలలు గడిచినా పాలలో ఏం కలిసిందని ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రభుత్వ వైద్య విభాగం, పోలీసులు కూడా 16 మంది మరణాలకు కారణం చెప్పడం లేదు. ఇంతమంది చనిపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మృతుల కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదు సరికదా.. ఈ దుర్ఘటనపై కనీసం రివ్యూ కూడా చేయలేదు.

ఆస్పత్రి ఒత్తిడి చేయడం సరి కాదు:
    5 నెలల చిన్నారి రుహానియా 4 నెలలుగా మృత్యువుతో పోరాడుతోంది. రెయిన్‌బో ఆస్పత్రి సిబ్బంది ఇప్పుడు పాపను ఇంటికి తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ తీసుకెళ్లనట్టయితే రేపటి నుంచి చేసే వైద్య ఖర్చుల భారం భరించాల్సి ఉంటుందని బెదిరిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు వైద్యానికయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్, మంత్రులు హామీ ఇచ్చారు. కానీ తీరా చూస్తే ఆస్పత్రి సిబ్బంది మాత్రం డిశ్చార్జి చేస్తామని చిన్నారి తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు.
    ఇప్పటికే ఈ పాప వైద్యం కోసం తల్లిదండ్రులు దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆ పేద కుటుంబానికి డబ్బులు వెచ్చించే స్థోమత లేదు. వీరితోపాటు మరో రెండేళ్ల బాబు రిత్విక్‌ని కూడా తీసుకెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది వేధిస్తున్నారు. ప్రభుత్వం ఇకపై వారికయ్యే వైద్య ఖర్చులు భరించదని చెబుతున్నారు. బాధితులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని కలిసినా నాకు సంబంధం లేదు, కలెక్టర్‌ని కలవాలని చెప్పి తప్పించుకుంటున్నాడు. దీంతో కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగదని వారికి అర్థమై చేసేదేమీ లేక న్యాయం కోసం నన్ను ఆశ్రయించారు. 

తక్షణమే ప్రభుత్వం స్పందించాలి:
    తక్షణం చిన్నారులిద్దరికీ ప్రభుత్వం వైద్యం కొనసాగించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కల్తీ పాలు తాగి 16 మంది చనిపోయారు. ఇద్దరు చిన్నారులు నాలుగు నెలలుగా మృత్యువుతో పోరాడుతున్నారు. కాబట్టి వారు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలి. పిల్లల వైద్యానికి ఇంతవరకు వారు చేసిన ఖర్చు రీయింబర్స్‌ చేయాలి. చిన్నారులిద్దరికీ వైద్యం కోసం కొంత నగదును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి. పిల్లలకు న్యాయం చేసేందుకు వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ వివరించారు.

Back to Top