తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని తిట్టడానికే పేరెంట్ టీచర్ మీటింగ్‌లు పెట్టుకునేట్టయితే కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా, ప్రెస్‌మీట్ పెట్టుకుంటే సరిపోదా అని తండ్రీకొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ లపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈవెంట్‌లు, సెట్టింగ్‌లు, షూటింగ్‌లు, ఇక్కడికి రావడానికి ప్రత్యేక విమానాల ఖర్చు ఇవన్నీ ప్రజలపై భారం మోపడం దేనికని ప్రశ్నించారు. సర్వసాధారణంగా జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ ని కూడా రాజకీయ సభల మాదిరిగా మార్చేసి పిల్లల వైయస్ జగన్‌పై ద్వేష భావం కలిగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో విద్యా రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడితే చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా సర్వనాశనం చేశాడని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ పాల్గొన్న ఈవెంట్‌లో వేసిన బెంచీలు, ఫర్నీచర్, డిజిటల్ బోర్డులన్నీ వైయస్ జగన్ నాడు-నేడు ద్వారా ఆ బడికి తీసుకొచ్చినవేనని స్పష్టం చేశారు. ఏడాదిన్నర లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పులు తేవడం మినహా ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేసిన పాపానపోలేదని ధ్వజమెత్తారు. కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు మాత్రం ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని, ఎప్పుడెప్పుడూ చంద్రబాబు దిగిపోతాడా అని ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. ఏడాదిన్నరకే పాలన చేతకాక చేతులెత్తేసిన చంద్రబాబు, ఇంకో మూడున్నరేళ్లు ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమయ్యే పనికాదని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ● రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశాడు వైయస్ జగన్ గారు 2019లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి విశ్వసనీయతకు రోల్ మోడల్‌గా నిలిచారు. కరోనా పేరు చెప్పి పథకాలను ఎగ్గొట్టాలని చూడలేదు. పథకాలు అమలు చేయడం భారంగా మారిందనే మాటలు చెప్పలేదు. అధికారం ఇచ్చిన ప్రజలకు అనుక్షణం మేలు చేయాలనే చూశారు కాబట్టే కులం, మతం, పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా రూ. 2 లక్షల కోట్లకుపైగా జమ చేశారు. వైయస్ జగన్ ఐదేళ్ల పాలన ఎంతో పారదర్శకంగా సాగితే, చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండానే ఏడాదిన్నరలోనే రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశాడు. మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పథకాలు అమలు చేయాలంటే భయమేస్తుందని చెప్పడం ఆయన అసమర్థతకు, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రజలకిచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టే ప్రజలను వంచిస్తున్నాడు. అయినా ప్రజలకు ఏదో చేసేస్తున్నట్టు నమ్మించడానికి తండ్రీకొడుకులు ఈవెంట్ల పేరుతో ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. వారం వారం ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్లలో తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్‌కి, అప్పుడప్పుడూ విదేశాలకు తిరుగుతూ ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. అధికారం ఉన్నంతకాలం డబ్బు సంపాదించుకోవడం, ఓడిపోయాక ఆ డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబు చేస్తున్నపని. అంతే తప్ప ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా ప్రజలకు చేసిన మేలు శూన్యం. ● ఆ బడిని తీర్చిదిద్దింది జగనే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) పేరుతో పార్వతీపురం మన్యం జిల్లా భామిని స్కూల్‌లో సీఎం చంద్రబాబు పిల్లల ముందు షో చేసి వచ్చాడు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఈ పాఠశాలను నిర్మిస్తే, వైయస్ జగన్ సీఎం అయ్యాక నాడు-నేడు ద్వారా మరింత మెరుగులు దిద్దితే అవన్నీ కనపడనీయకుండా లక్షలు ఖర్చు చేసి సెట్టింగ్ వేశారు. సర్వసాధారణంగా జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్‌ను తండ్రీకొడుకులు రాజకీయ కార్యక్రమంలా మార్చేశారు. ఈవెంట్ కోసం తీసుకొచ్చిన కెమెరాల సాక్షిగా వైయస్ జగన్ హయాంలో ఏర్పాటుచేసిన బెంచీలు, డిజిటల్ బోర్డులతో తామే గొప్పగా చేశామని చెప్పుకునే ప్రయత్నంలో తండ్రీకొడుకులు విఫలమయ్యారు. సినిమా షూటింగ్‌లు, ఆడియో ఫంక్షన్లకు సెట్టింగ్‌లు వేసినట్టు పేరెంట్ టీచర్ మీటింగ్ కి సెట్టింగ్‌లు వేయించారు. గతంలో ఒకసారి ఇలాగే విద్యార్థులతో తల్లికి వందనం పథకాన్ని కనిపెట్టింది లోకేష్ అన పిల్లల ముందు చంద్రబాబు చెబుతున్నాడు. అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. పైగా మొదటి ఏడాది పథకాన్ని పూర్తిగా అమలు చేయకపోగా రెండో ఏడాది సైతం 30 లక్షల మంది పిల్లలకు పథకాన్ని వర్తింపజేయలేదు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇవ్వాల్సి ఉంటే రూ.13 వేల మాత్రమే ఇచ్చాడు. చాలా మందికి రూ.8 వేలు, రూ.9 వేలు జమ చేసి మమ అనిపించారు. పిల్లలకు కనీసం నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా ప్రభుత్వం అందించలేకపోతోంది. విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందే కాకుండా వైయస్ జగన్ చేసిన పనులను కూడా తామే చేసినట్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తండ్రీకొడుకులు తీవ్రమైన భావదారిద్ర్యంలో బతుకుతున్నారు. వైయస్ జగన్ ని తిట్టడానికి ఈవెంట్‌లు, దానికి లక్షలు ఖర్చు పెట్టి సెట్టింగ్‌లు, అక్కడికి రావడానికి ప్రత్యేక విమానాల ఖర్చులు అవసరమా? ప‌్రెస్ మీట్ పెట్టి తిట్టొచ్చు కదా. జగన్ హయాంలో విద్యావ్యవస్థ నాశనమైందని చెబితే విద్యార్థులు ఎలా నమ్ముతారోనన్న ఆలోచన కూడా వారికి లేదు. ● తండ్రీ కొడుకులు పొలిటికల్ జోకర్లు అయ్యారు ఏడాదిన్నరకే పరిపాలన చేతకాక ఈవెంట్ లతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నాడు. వైయస్ఆర్‌సీపీ హయాంలో జీఎస్టీ వసూళ్లలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటే, చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతినెలా అట్టడుగున ఉంటోంది. వారం వారం అప్పులు తేవడం తప్ప, చంద్రబాబు సృష్టించిన సంపద శూన్యం. తండ్రీకొడుకులు పొలిటికల్ జోకర్లుగా మారిపోయారు. తాము అద్భుతాలు చేస్తున్నట్టుగా ఊహల్లో బతుకుతున్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఏపీ పోలీసులు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీస్ వ్యవస్థ దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయింది. వ్యవసాయరంగం పూర్తిగా కుదలైంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో అరటి పంట విదేశాలకు ఎగుమతి చేస్తే, ఇప్పుడు కేజీ అరటి అర్ధ రూపాయికి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రావడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు మనస్సాక్షి అనేది అస్సలు లేదు. వారు అధికారంలో ఒక్క నిమిషం కొనసాగడానికి అర్హత లేదు. ఇప్పటికైనా మా వల్ల కాదని దిగిపోయి వైయస్ జగన్ చేతికి పాలన పగ్గాలు ఇవ్వాలి. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా వైయస్ జగన్‌ని గెలిపించుకుందామా అని ఎదురుచూస్తున్నారు.