ఎన్‌హెచ్ఆర్‌సీని ఆశ్ర‌యించిన‌ వైయ‌స్ఆర్‌సీపీ 

 మానవ హక్కుల ఉల్లంఘనల్ని డీజీపీ పట్టించుకోవట్లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల బృందం ఫిర్యాదు 

న్యూఢిల్లీ : ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై జాతీయ మానవ హక్కుల సంఘాన్ని వైయ‌స్ఆర్‌సీపీ ఆశ్ర‌యించింది. ఏపీ డీజీపీ మాన‌వ‌హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల బృందం మంగళవారం ఉదయం  ఎన్‌హెచ్ఆర్‌సీ యాక్టింగ్ చైర్ పర్సన్ విజయభారతిని కలిసి ఫిర్యాదు లేఖ అందజేసింది.

ప్రస్తుతం.. ఏపీలో వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తూ.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ విషయాలన్నింటిని మానవ హక్కుల సంఘం దృష్టికి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు తీసుకెళ్లారు.  

రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారు. పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త  వెంకటరెడ్డినీ నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న డీజీపీ పట్టించుకోవడం లేదు. వెంటనే జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని విచారణ జరపాలి.  మానవహక్కులను పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ఎంపీలు కోరారు. 

సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని, యాక్టివిస్టులను  కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని, రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని విజయభారతికి తెలియజేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఆమె.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎంపీలకు హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్‌ను కలిసిన బృందంలో వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ,  మేడ రఘునాథ్ రెడ్డి , డాక్టర్ తనూజా రాణి,  బాబురావు ఉన్నారు. 
 

Back to Top