ఏలూరు: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏలు) ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పార్టీ నాయకులు బీఎల్ఏలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్), ఏలూరు జిల్లా ఎస్‌ఐఆర్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోతుల శివారెడ్డి హాజరయ్యారు. అలాగే ఏలూరు నియోజకవర్గ పరిశీలకుడు డీవీఆర్‌కే చౌదరి, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుడు దాసరి రమేష్, నగర పార్టీ అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బూత్ కమిటీ జోన్ ఇన్‌చార్జి బీవీఆర్ చౌదరి, నగర బూత్ కమిటీ అధ్యక్షుడు ముచ్చర్ల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అక్రమంగా పేర్లు చేర్చడం లేదా తొలగించే ప్రయత్నాలపై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేస్తూ ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల వివరాలను పరిశీలించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని బీఎల్ఏలకు సూచించారు.