అమరావతి రైతులకు అండగా ఉంటాం

వైయస్‌ జగన్‌ ప్రకటన 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌తో రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతుల భేటీ.

ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కుర్రగల్లు గ్రామాలకు చెందిన రైతులు శ్రీ వైయస్‌ జగన్‌తో భేటీ.
భూసమీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులను శ్రీ వైయస్‌ జగన్‌కు వివరించిన రైతులు.

అమరావతి రైతుల కోసం పార్టీ తరపున లీగల్‌ ప్యానెల్‌

అక్కడి రైతుల భూములు కాపాడేందుకు న్యాయ పోరాటం

రైతుల భూములు బలవంతంగా లాక్కోవడం దారుణం

శ్రీ వైయస్‌ జగన్‌ ధ్వజం

అమరావతి రైతులకు న్యాయం చేస్తాం

ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్న వారందరి పని పడతాం

తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సిందే

రైతుల భేటీలో శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

తాడేపల్లి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కుర్రగల్లు గ్రామాలకు చెందిన రైతులు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. భూసమీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులను శ్రీ వైయస్‌ జగన్‌కు వివరించిన రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు, బాధలు విన్న శ్రీ వైయస్‌ జగన్, అండగా ఉంటామని ప్రకటించారు. పార్టీ తరపున న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏం అన్నారంటే..:

అందుకే మావిగన్‌ ప్రతిపాదన:
    రైతులను సంతోష పెట్టే విధంగా ఉండాలనేదే మా అభిమతం. ముందు నుంచి అదే మా వైఖరి. ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఇంకా 50 వేల ఎకరాలు అవసరం ఏముంది? అందుకే మావిగన్‌ ప్రతిపాదించాము. ఇప్పటికే గన్నవరంలో విమానాశ్రయం ఉంది. దానికి దగ్గర్లోనే మరో ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇవ్వరు. మావిగన్‌లో పోర్టు కూడా ఉంది. అది మచిలీపట్నంలో ఉంది. మరో 30 ఏళ్ల తర్వాత కూడా మనకు రాజధాని కనిపించదు. ఎందుకంటే పనులు జరగవు. కారణం అక్కడ కనీస మౌలిక వసతుల కల్పన కోసం ఎకరానికి రూ.2 కోట్లు కావాలని 12 ఏళ్ల క్రితమే బ్యాంకులకు నివేదిక ఇచ్చారు. నిజానికి ఇప్పటికి ఆ రేటు పెరిగింది. ఈ లెక్కన రోడ్లు, డ్రైనేజీ, నీరు, కరెంటు వీటిన్నింటికే ఎన్నేళ్లు ఎన్ని కోట్లు ఖర్చు చేయాలి?. 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. చంద్రబాబు ఉద్దేశం:
    కొండవీటి వాగుపై ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం. ఇక్కడ రైతులకు నష్టం కలగ కూడదనే మావిగన్‌ను ప్రతిపాదించాం. ఆ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లు, పోర్టు, మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం జీరో నుంచి కడతామని అమరావతిపై వెనక్కు తగ్గడం లేదు. అక్కడ నిరంతరం పనులు. నిరంతరం కమిషన్లు. అదే ప్రభుత్వ లక్ష్యం. ఇంకా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. అదే చంద్రబాబు ఉద్దేశం. రాజధానిలో పనుల్లో  భారీగా అవినీతి జరుగుతోంది. 

పార్టీ తరపున లీగల్‌ ప్యానెల్‌.
అవసరం అయితే భూములు వెనక్కి:

    అమరావతి    రైతులు ఏం కావాలంటే అది చేస్తాం. బలవంతం భూసేకరణ అనేది ఉండదు. అవసరం అయితే, భూములు వెనక్కి ఇస్తాం. ఇంకా ఇప్పుడు మీ పోరాటంలో మా పార్టీ న్యాయ విభాగం కూడా పాలు పంచుకుంటుంది. మా లీగల్‌టీమ్‌ మీకు అన్ని విధాలుగా సహాయ, సహకారిగా ఉంటుంది. పార్టీ తరపున లీగల్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేస్తాం. మీ తరపున గట్టిగా పోరాడతాం. మనం ఇప్పుడు చేయగలిగింది న్యాయ పోరాటం మాత్రమే. మూడేళ్ల తర్వాత దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం ఏర్పడితే, మీకు పూర్తి న్యాయం చేస్తాం. అవకాశం ఉంటే భూములు కూడా తిరిగి ఇస్తాం.

దౌర్జన్యం చేసే వారికి శిక్ష తప్పదు:
    ముఖ్యమంత్రిగా చేయకూడని పని చంద్రబాబు చేస్తున్నారు. రైతులు భూమి ఇవ్వకపోతే, ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్‌ చేయడం, కాలువ తవ్వడం, రోడ్లు వేయడం, తోడిన నీరు పంపింగ్‌ చేయడం, దగ్గర్లో రిజర్వాయర్లు ఉంటే, గండి కొట్టి, నీరు పారేలా చేయడం దారుణం.
    ఏ రకంగా మీకు దౌర్జన్యం చేస్తున్నారో.. వారందరికి శిక్ష పడేలా చేస్తాం. మీకు న్యాయం చేస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించేలా చేస్తాం. మీ తరపున పోరాడేందుకు లీగల్‌ కమిటీ వేస్తాం. దాని ద్వారా అమరావతి రైతులకు న్యాయం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు.

Back to Top