`సాక్షి`పై కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు

డీఎస్పీల ప్రమోషన్ల పెండింగ్ కథనంపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

విచారణకు హాజరైన సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి,స్టేట్ బ్యూరో ఇన్చార్జ్ విశ్వనాథరెడ్డి, వడ్డాది శ్రీనివాస్

గంటన్నర పాటు విచారణ

తాడేప‌ల్లి:  ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి సర్కారు ఘోర వైఫల్యాలు.. అంతులేని అవినీతి, అక్రమాలపై ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ‘సాక్షి’ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.  ‘సాక్షి’ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు గతంలో పలుచోట్ల దాడులకు తెగబడగా ఇటీవల విజయవాడ ఆటోనగర్‌లోని ప్రధాన కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసులు చొరబడి అరాచకంగా వ్యవహరించడం తెలిసిందే. తాజాగా డీఎస్పీల ప్ర‌మోష‌న్ల పెండింగ్ క‌థ‌నంపై తాడేప‌ల్లి పోలీసులు ఇటీవ‌ల కేసు న‌మోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి తో పాటు స్టేట్ బ్యూరో ఇన్చార్జ్ విశ్వనాథరెడ్డి, స్టేట్ క్రైమ్ ఇన్చార్జి వడ్డాది శ్రీనివాస్‌ల‌ను గంటన్నర పాటు పోలీసులు విచారించారు. విచార‌ణ పేరుతో వేధింపుల‌కు పాల్ప‌డ్డారు.

మీడియా గొంతు నులిమే యత్నం
ఓ రాజకీయ పార్టీ నేత మాట్లాడిన అంశాలను ప్రచురించినందుకు మీడియాపై కేసులు పెట్టి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే యత్నాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్నాయి. అధికారులతో ఫిర్యాదులు ఇప్పించడం.. ఆ వెంటనే ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం కూటమి సర్కారుకు పరిపాటిగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే.. వాటిని ఖండించవచ్చు లేదా సంబంధిత అధికారి లేదా పదవిలో ఉన్న నాయకుడు పరువు నష్టం దావా వేసుకునే వీలుంది. అయితే చంద్రబాబు సర్కారు కొత్త సంస్కృతికి తెర తీసింది. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించడం... ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పే ప్రక్రియను ఎంచుకుంది. పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక వార్త వస్తే చాలు.. వెంటనే కేసు రిజిస్టర్‌ చేయాలనేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలను వార్తగా ప్రచురించినందుకు తాడేపల్లి పోలీసులు ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు.  

తీవ్రంగా ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు
‘సాక్షి’ దినపత్రిక ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తకు సంబంధించి ఏకంగా పత్రిక సంపాదకుడు ఆర్‌.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి, రిపోర్టర్, వార్తను వెబ్‌ ఎడిషన్‌లో ప్రచురించినందుకు ఇన్‌చార్జిగా ఉన్న ధనంజయరెడ్డిపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయించి నోటీస్‌లు ఇవ్వడాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు.  ఈ మేర‌కు గురువారం తాడేప‌ల్లి పోలీసు స్టేష‌న్‌కు విచార‌ణ‌కు హాజ‌రైన ధ‌నంజ‌య‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, శ్రీ‌నివాస్‌ల‌ను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ..పత్రికలో ఏదైనా వార్త వస్తే దానిపై అభ్యంతరాలుంటే వివరణ కోరడం లేదా రిజాయిండార్‌ ఇవ్వడం ఆనవాయితీ కాగా ఏకంగా అక్రమ కేసులు మోపి ‘సాక్షి’ జర్నలిస్టులను కోర్టుకు ఈడ్వటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించేలా ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు వ్యవహరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Back to Top