విజయవాడ: అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆర్ధిక వెనకబాటుతనం పోగొట్టాలన్నదే సీఎం వైయస్ జగన్ ఆలోచన అని స్పష్టం చేశారు. ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఎలక్షన్‌లు జరుగుతాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్న వార్తలు వాస్తవం కాదని వెల్లడించారు. బుధవారం నిర్వహించిన బీసీల ఐక్యత-సమగ్ర అభివృద్ధిపై బీసీ కులాలతో రౌండ్ టేబుల్ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రపంచం, కాలం మారుతున్నప్పుడు మనమూ మారాలని సజ్జల చెప్పారు. అవకాశాలు పెరుగుతున్నప్పుడు సాంకేతికత వచ్చినపుడు కులవృత్తులు కూడా మారుతాయని పేర్కొన్న ఆయన.. కత్తెర్లు, ఇస్త్రిపెట్టెలు ఇచ్చి సరిపెట్టుకోమంటున్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలా? లేక మారుతున్న భవిష్యత్ వైపు అడుగులు వేయిస్తున్న వైయస్ జగన్ కావాలా? అనేది ఆలోచించాలని ప్రజలను కోరారు. 'ఎన్నికల సమయంలో చంద్రబాబు ఒకటి కాదు మూడు చేస్తామని చెప్తాడు. జగన్ రూపాయి చేస్తే చంద్రబాబు పది చేస్తానంటారు. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని నమ్మితేనే ఓట్లేయమనే నాయకుడు జగన్ మాత్రమే. ఇలాంటి వారిని రాజకీయాలలో ఎప్పుడైనా చూశారా?. బీసీల అభ్యున్నతికి జగన్ ఏం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అట్టడుగు వర్గాలు సొంతంగా ఎదగాలనేది సీఎం వైయస్ జగన్ ఆలోచన. అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి వచ్చేలా చేయూతనిస్తున్నారు.' అని సజ్జల తెలిపారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని సజ్జల విమర్శించారు. స్వార్థపూరిత ఆలోచనలతో హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు చిల్లర వేసే నాయకులు కావాలా? పూర్తి స్థాయి చేయూత అందించే వారు కావాలా? అని ప్రశ్నించారు. వైయస్ జగన్ రూపాయి చేస్తే తాను 10 రూపాయలు చేస్తా అని చంద్రబాబు అంటున్నారని దుయ్యబట్టారు. 2014-19 మధ్యలో చంద్రబాబు ఎందుకు చేయలేదని నిలదీశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని సజ్జల స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ను తాము లెక్కల్లోకి తీసుకోవడం లేదని తెలిపారు. మా ప్రభుత్వం వల్ల మేలు జరిగింది అని నమ్మితేనే ఓట్లు వెయ్యండి అని వైయస్ జగన్ లాగా ఏ నాయకుడైన చెప్పగలరా.. బీసీల అభ్యున్నతికి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.