తాడేపల్లి: అధికారమే పరమావధిగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్న పాలకులతో ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసి, తమ ప్రతినిధులను ఎన్నుకునే స్వేచ్ఛను, స్వాంతంత్య్రాన్ని కూడా కోల్పోయేలా నేటి పాలకులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత ప్రమాదకరమని అన్నారు. గత ఏడాది జరిగిన జనరల్ ఎలక్షన్, తాజాగా జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను చూస్తే ఎంతగా వ్యవస్థలను నాశనం చేస్తూ, బరితెగించి ప్రజాస్వామిక స్పూర్తిని దెబ్బ తీస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. ప్రజాస్యామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులు, మేధావులు, విజ్ఞులు ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... పాలకులకు విలువలు, విశ్వసనీయత ముఖ్యం: దివంగత మహానేత వైయస్సార్ ఆశయాలతో శ్రీ వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించిన నాటి నుంచి విలువలు విశ్వసనీయత, జవాబుదారీతనంతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. 'ప్రజలకు మనం జవాబుదారీతనంతో ఉండాలి. వారికి మనమిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వకూడదని' శ్రీ వైయస్ జగన్ చెబుతూ ఉంటారు. వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యం కాపాడటం అంటే వ్యవస్థలు సక్రమంగా సరైన మార్గంలో నడిచేలా చూసుకోవడమే. ఆ బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. కాబట్టే వాటి విలువ పార్టీలో ఉన్న మనందరికీ తెలుసు. ఇవన్నీ ఎవరో నిర్దేశిస్తే చేసేవి కావు. మనకై మనమే సంకల్పంతో నెరవేర్చాల్సినవి. రాజకీయ పార్టీ ప్రతినిధిగా చెబుతున్నా.. దేశంలో వ్యవస్థలన్నీ యాంత్రికంగా తయారైన పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం తగ్గుతోంది. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు: తాత్కాలిక అవసరాల కోసం వ్యవస్థలను వాడుకోవడం మన రాష్ట్రంలో కళ్ల ముందే కనిపిస్తోంది. ఏడాది కాలంగా రాష్ట్రంలో జరిగిన పాలన గమనిస్తే అధికారం కోసం ఎలాంటి హామీలైనా ఇవ్వొచ్చు.. అధికారంలోకి వచ్చాక అవసరం లేదని పక్కకు తోసేయొచ్చనే బాధ్యతారహిత్యం కనిపిస్తోంది. యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా చేయొచ్చనే అభిప్రాయం ఈవీఎంల విషయంలో దేశంలో బలపడింది. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలకు సమాధానం ఉండటం లేదు. మన రాష్ట్రంలోనే ఓటింగ్ నిర్వహించిన విధానంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయి. ఓటింగ్ పూర్తయిన రోజు ప్రకటించిన ఎన్నికల శాతానికి తుది వివరాలు ఇచ్చిన దానికి ఓటింగ్ శాతంలో 12.5 శాతం తేడా ఉంది. దాదాపు 50 లక్షలకు పైగా ఓట్లు తేడా ఉన్నాయని అడుగుతుంటే సమాధానం చెప్పే వ్యవస్థ ఏది..? ఎన్ని అరాచకాలు చేసినా సంయమనంతో ఉన్నాం: మొన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కేవలం 10 వేల ఓట్లు, 15 బూత్‌ల కోసం 2 వేల మంది పోలీసులను మోహరించారు. ఏ ఒక్క వైయస్ఆర్‌సీపీ ఏజెంట్‌ను కూడా బయటకు రానీయలేదు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే చోద్యం చూస్తూ కూర్చున్నారు. దీనిని వ్యతిరేకస్తూ మేం తలపడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఓటర్లలో 50 శాతంగా ఉన్న మహిళలు క్యూలైన్లలో ఎక్కడైనా కనిపించారా? ఎన్నికల సందర్భంగా ఏమేం అరాచకాలు జరిగాయో సీసీ టీవీ ఫుటేజ్‌లు తీస్తే మొత్తం బయటపడిపోతుంది. ఈసీ కనీసం ఆ పని చేయలేదు. ఎన్నికల అరాచకాలపై మేం కోర్టు మెట్లెక్కితే ఆధారాలు తీసుకురావాలని కోరుతుందేమో అనుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తు అదీ జరగలేదు. అయినా న్యాయ వ్యవస్థమీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. ఈ వ్యవస్థలన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారని వైయస్ జగన్ భావిస్తున్నారు కాబట్టే ఈ విషయాలపై ఇంతలా తాపత్రయ పడుతున్నాం. అవసరమైతే మేం కూడా ఆ పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని ఎప్పటికప్పుడు చెబుతున్నాం. ప్రజల్లో పాపులారిటీ ఉన్నా వ్యవస్థలను మేనేజ్ చేయాలనుకోవడం లేదు కాబట్టే, పరీక్షలు ఎదుర్కొన్నాం కాబట్టే ఈరోజు ఇలా ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ ప్రజల విశ్వాసంతో వారిచ్చే తీర్పే అంతిమం. పులివెందులలో పర్యటించి వాస్తవాలు ప్రపంచానికి తెలియజేయండి: వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నప్పుడే రిఫరీ పాత్ర పోషించడానికి సివిల్ సొసైటీ స్వచ్ఛందంగా చొరవ తీసుకుని ముందుకు రావాలి. నిన్న జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయంలోనూ ఇదే చెబుతున్నాం. పెద్ద మనుషులుగా ఎవరు ముందుకొచ్చినా నిలబడటానికి మేం రెడీ. సీనియర్ జర్నలిస్టులు కావొచ్చు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కావొచ్చు, సామాజిక స్పృహ ఉన్నవారు, న్యూట్రల్ గా ఉన్న ఎవరైనా కావొచ్చు. ఈసీ ఎలాగూ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వదు కాబట్టి 15 బూత్‌లు ఉన్న ఊర్లలోకి నేరుగా వెళ్లండి. ఎంతమంది వేలికి సిరా చుక్క ఉందో చూడండి. మీరే వాస్తవాలను ప్రజలకు చూపించండి. అప్పుడైనా ఎన్నికలు ఎంత దారుణంగా నిర్వహించారో అర్థమవుతుంది. మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలంటే వాటిని రక్షించాల్సిన వ్యవస్థలన్నీ స్వతంత్రంగా, స్వేచ్ఛగా పనిచేయాలి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. అందులో వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ ముందుంటుంది. ఈ స్వేచ్ఛా సాంతంత్ర్యం నిలబడాలని తపనపడే ప్రతి బాధ్యత గల పౌరుడు ఈ ఉద్యమంలో భాగస్వాములైనప్పుడే ఈ స్వాతంత్య్రానికి నిజమైన అర్థం. పైపైన చూస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లినట్టే కనిపిస్తోంది. కానీ లోతుగా చూస్తే వ్యవస్థల పనితీరులో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత సామాజిక స్పృహ ఉన్న మనందరిపైనా ఉంటుంది. మన వ్యవస్థలను మనం రక్షించుకుందాం. మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇన్ చార్జి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేశ్, వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి ఆలూరి సాంబశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, వైయస్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.