‘ఉద్యమం’ అనే మాటకే అవమానం

‘పప్పు’నకు పంట ఎలా ఉంటుందో తెలుసా?

సీబీఐ విచారణ కోరవచ్చు కదా?

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి

తాడేపల్లి: అమరావతి ఉద్యమం పేరిట ‘300 రోజుల’ పేరుతో ఓ హడావుడి కార్యక్రమం చేస్తున్నారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. ఇది కేవలం మీడియా ద్వారా మాత్రమే జరుగుతున్న ఉద్యమని విమర్శించారు. బాగా డబ్బున్న ప్రొడ్యూసర్ తానే ఓ చెత్త సినిమా తీసి, తానే ఆడించుకుని, రికార్డ్ బద్దలు అంటూ సెలెబ్రేషన్స్ చేసుకున్నట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.ప్రజలు పాల్గొనే ఉద్యమాలు ఉత్తేజభరితంగా ఉంటాయని, కానీ మీరు చేస్తున్న పనులు.. ‘ఉద్యమం’ అనే మాటకే అవమానం కలిగించేవిగా ఉన్నాయని మండిపడ్డారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కొంతమంది అమాయకులు కూడా ఉన్నారని, వారిని కించపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. 

సీబీఐ విచారణ కోరవచ్చు కదా

చంద్రబాబు హయాంలో అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అందుకే బాబు బినామీల వెన్నులో వణుకు పుడుతోందన్న సజ్జల.. సీబీఐ విచారణ కోరవచ్చు కదా అని సవాల్‌ విసిరారు.  చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ తీరు పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఉద్యమం అంటారు. టీడీపీ నాయకులు ఎందుకు రావడం లేదు. అసలు మీరు ఎక్కడున్నారు. మీ కొడుకును మాత్రమే ఎందుకు పంపారు. రైతుల ఉసురు తగులుతుందంటూ లోకేష్‌ మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం. అసలు ‘పప్పు’నకు పంట ఎలా ఉంటుందో తెలుసా. ఏవేవో ట్వీట్లు చేస్తూ ఉంటారు. 5 కోట్ల ఆంధ్రుల సమస్య అంటారు. చారిత్రక ఆవశ్యకత అంటూ ఒక ఊత పదం వాడుతున్నారు. అసలు అమరావతి ఉద్యమం పాయింట్ జీరో స్థాయిలో అయినా ఉందా. నువ్వే దాన్ని వదిలేశావు... ఎప్పుడో వలస పక్షుల్లా అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. మీ పోరాటం నిజమైనదే అయితే ఎందుకు ఇక్కడే ఉండి పోరాడటం లేదు’’అని సజ్జల ప్రశ్నించారు.

వైయ‌స్ జ‌గ‌న్ సార‌ధ్యంలోనే న్యాయం..

అమారావతిలో మీరు చేసింది పచ్చి మోసం చేశార‌ని స‌జ్జ‌ల మండిప‌డ్డారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో న్యాయం జరగబోతుంది. మిమ్మల్ని నమ్మి మోసపోయామని తెలుసుకున్న తర్వాత, మీ సామాజిక వర్గంతో సహా అక్కడున్న వాళ్లంతా మిమ్మల్ని ఛీకొట్టారు. అసలు చంద్రబాబు ఏ రోజైనా ఉద్యమం నడిపారా..? విధ్వంసం మాత్రమే కదా మీకు తెలిసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందనే కదా సీబీఐ విచారణ కోరింది. సుమారు 4000 ఎకరాలు మీరు, మీ బినామీలు స్వాహా చేసినట్లు విచారణ కమిటీ నివేదికల్లో తేలింది. రోజూ డీజీపీకి, సీఎస్‌కి లేఖలు రాసే బదులు ప్రతిపక్ష నేత చంద్రబాబు సీబీఐ విచారణ కోరవచ్చు. మీరు కడిగిన ముత్యంలా బయటకు వస్తే ఎవరికీ అభ్యంతరం లేదంటూ స‌జ్జ‌ల చురకలు అంటించారు.

నీ బినామీలకు వెన్నులో వణుకు పుడుతోంది

అమరావతే రాజధానిగా ఉండాలని ఎన్నికల వరకూ పోరాటం చేసుకో. అక్కడ కేవలం రియల్ ఎస్టేట్ వాళ్లు మాత్రమే ఉన్నారు. అక్కడున్న నిజమైన రైతులు, మీరు ఉద్యమం ఎప్పుడు వదిలేస్తారా అని వేచి చూస్తున్నారు. మీరెంతగా అడ్డుపడినా రానున్న 3, 4 ఏళ్లలో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కొన్ని పనులకు టెండర్లను కూడా పిలుస్తున్నాం. రైతులకు అన్యాయం జరగడం లేదు.. కేవలం నీ బినామీలకు వెన్నులో వణుకు పుడుతోంది. మిగతా ప్రాంతాల అభివృద్ధికి మీరు అడ్డుపడుతున్నారని మిగిలిన ప్రాంతం వారు అభిప్రాయపడుతున్నారు.

 అమ‌రావ‌తి అభివృద్ధి చెంద‌డం ఖాయం..

సీబీఐ విచారణకు మేము కూడా రెడీ అనండి... త్వరలోనే ఏది ఏంటో తేలిపోతుంది. 90 మంది వరకూ అమరులయ్యారంటూ చెప్పుకొస్తున్నారు. మొన్ననే ఓ మృతుడి కూతురు లోకేష్ ట్వీట్ విషయంలో తిట్టి పోసింది. ఎలాగూ చరిత్ర హీనులయ్యారు. ఇంకా దిగజారాడానికి ఏమీ లేదు. అమరావతి ప్రాంతం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి వారి ఉద్యమాలు, లీగల్ సమస్యలు సృష్టించడం వల్ల ఆలస్యం అవుతుందేమో కానీ జరగడం మాత్రం ఖాయం’’ అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. 

Back to Top