మహిళలకు రెండు పోస్టులు తగ్గితేనే సీఎం ఒప్పుకోలేదు

 50 శాతం రిజ‌ర్వేష‌న్లతో యూనివ‌ర్సిటీల‌ పాలక మండలి నియామకాలు 

సీఎం వైయస్‌ జగ‌న్‌ తీసుకున్న నిర్ణయాన్ని పచ్చ మీడియా తట్టుకోలేకపోతుంది 

 క్లాస్‌మేట్‌ తయారు చేసిన పాలక మండలి సభ్యుల‌ జాబితాను బాబు ఆమోదించారు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేపల్లి: యూనివ‌ర్సిటీ పాలక మండ‌లి పోస్టుల్లో.. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 శాతం, మహిళకు 50 శాతం పదవులు కల్పించార‌ని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.  యూనివర్సిటీ పాలక మండలి పోస్టుల భర్తీ విషయంలో రిజర్వేషన్లు ఖచ్చితత్వం పాటించాలని సీఎం వైయస్‌ జగ‌న్‌ ఆదేశించారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో రెండు పోస్టులు తగ్గితే సీఎం ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు పదవులు దక్కాల్సిందేన‌ని సీఎం ఆదేశించారని తెలిపారు.  బుధ‌వారం తాడేప‌ల్లిలోని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 
 
దేశ చరిత్రలో తొలిసారి..
 విశ్వ విద్యాల‌యాల‌ను తీర్చిదిద్దడానికే యూనివ‌ర్సిటీల‌ పాలక మండలి నియామ‌కం జ‌రిగింది. దేశ చ‌రిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి వైయస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 50 శాతం రిజ‌ర్వేష‌న్లతో ఈ పోస్టులు భ‌ర్తీ చేశారు.  సామాజిక న్యాయం జరగలనే ఉద్దేశ్యంతో సీఎం వైయస్‌ జగ‌న్‌ తీసుకున్న నిర్ణయాన్ని పచ్చ మీడియా తట్టుకోలేకపోతుంది. ప్రభుత్వం కరోనాను ఎదుర్కొంటున్న తీరు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది. సీఎం వైయస్‌ జగన్‌కు పని తప్ప ప్రచారం అలవాటు లేదు.   

అప్పటి విద్యాశాఖ మంత్రికి తెలియకుండానే నియామకాలు
చంద్రబాబు హయాంలో 11 యూనివర్సిటీల పాలక మండలి భర్తీలో పదవులను నామినేటెడ్ పద్దతిలో నియమించారు. దాని కోసం ప్రత్యేక జీవో కూడా జారీ చేశారు. చంద్రబాబు క్లాస్‌మేట్‌ శ్రీనివాసులు నాయుడు తయారు చేసిన పాలక మండలి సభ్యుల‌ జాబితాను బాబు ఆమోదించారు. అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా తెలియకుండా యూనివర్సిటీ పాలక మండలి సభ్యులను నియమించారు. దీనిపై ఎల్లో మీడియా ఎందుకు నోరు మెదపడం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనాను ఎలా ఎదుర్కొవాలని ఆలోచన చేస్తుంటే..చంద్రబాబు, ఆయనకు సపోర్టు చేసే కొన్ని మీడియా సంస్థలు ప్రజల దృష్టి మరల్చేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ప్రతిపక్ష నేత ఇకనైనా అసత్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

Back to Top