రూ. 360 కోట్ల పోలవరం కాలువ మట్టి దోపిడీ

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అరాచకాలపై ధ్వజమెత్తిన వైయ‌స్ఆర్‌సీపీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని 
అవినాష్.

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఅర్ జిల్లా 
అధ్యక్షుడు దేవినేని అవినాష్.

మంత్రి నారా లోకేష్ అండతోనే ఎంపీ కేశినాని చిన్ని అరాచకాలు

విజయవాడలో 'ఎంపీ' అంటే 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' కాదు.

'మట్టి, పేకాట'గా మార్చేసిన ఏకైక వ్యక్తి కేశినేని చిన్ని

ఆగ్రహం వ్యక్తం చేసిన అవినాష్.

సాయికృష్ణ ఉదంతంపై సిబీఐ దర్యాప్తు చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ 

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ జిల్లాలో మట్టి, ఇసుక, ఫ్లైయాస్ దందా విచ్చలవిడిగా సాగుతోందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి నారా లోకేష్ అండదండలతో సాగిస్తున్న అక్రమ దందాలు, పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న అరాచకాలపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ అక్రమ దోపిడీకి అడ్డుకట్ట వేయడంతో పాటు, కృష్ణలంక పీఎస్ సీసీ ఫుటేజీ మాయంపై తక్షణమే సిబిఐ (CBI) విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

- రూ. 360 కోట్ల పోలవరం కాలువ మట్టి దోపిడీ – ప్రజల ప్రాణాలతో చెలగాటం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కూడా కూటమి నేతలు వదలడం లేదు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న కొత్తూరు తాడేపల్లిలో పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లను ఇష్టం వచ్చినట్లు తవ్వేసి, లారీల కొద్దీ మట్టిని తరలించి క్యాష్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్క విజయవాడలోనే ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో దాదాపు రూ. 350 కోట్ల నుంచి రూ. 360 కోట్ల విలువైన మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. మరి రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వరదలు వస్తే కాలువ కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది.. కేవలం స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 

ఇంత బహిరంగంగా నిరాటంకంగా మట్టి తవ్వకాలు సాగుతున్నా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. జిల్లా కలెక్టర్ సైతం ఈ దోపిడీపై మాట్లాడకపోవడం దారుణం, అధికారులు కూడా కూటమి నాయకులతో చేతులు కలిపి ఈ దందాలో భాగస్వాములుగా మారడం అత్యంత బాధాకరం. 

-  ‘గరుడ’ కంటే పెద్ద విలన్ కేశినేని చిన్ని!

విజయవాడకు గతంలో ఎంతోమంది పార్లమెంటు సభ్యులుగా పనిచేశారు, కానీ ఇంత అధ్వాన్నమైన ఎంపీని చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఎంపీ అంటే ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్’ అనే అర్థం పోయి.. విజయవాడలో ఎంపీ అంటే ‘మట్టి, పేకాట’ గా మార్చేసిన ఏకైక వ్యక్తి కేశినేని చిన్ని. దేశాన్ని ముంచిన విజయ్ మాల్యా కంటే పెద్ద స్కామ్‌లకు ఈయన పాల్పడుతున్నారు, ‘కేజీఎఫ్-1’ సినిమాలో ప్రతినాయకుడైన ‘గరుడ’ కంటే పెద్ద విలన్ లా కేశినేని చిన్ని ప్రవర్తిస్తున్నారు. 

గత ఎన్నికల్లో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని, ఇప్పుడు ఆ డబ్బును ఎలాగైనా రాబట్టుకోవాలనే ఏకైక  లక్ష్యంతోనే ఈ దందాలకు పాల్పడుతున్నారు.  ఇందులో భాగంగానే ప్రతి గ్రామంలో పేకాట క్లబ్బులు ఆడిస్తూ, రేషన్ బియ్యం, ఇసుక, మట్టి దందాలు చేస్తున్నారు,  చివరికి దేవాదాయ భూములను సైతం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

- నారా లోకేష్ అండతోనే బెదిరింపులు..

మంత్రి నారా లోకేష్ పూర్తి మద్దతు, అండదండలు తమకు ఉన్నాయని, అందుకే ఈ దందాలన్నీ చేస్తున్నామని కూటమి నేతలు బహిరంగంగానే ప్రగల్భాలు పలుకుతున్నారు. లోకేష్ అండ చూసుకునే.. అక్రమాలను ప్రశ్నించిన అధికారులను సైతం కూటమి నాయకులు బెదిరింపులకు గురిచేస్తున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ఘోరమైన మట్టి దందాకు తక్షణమే అడ్డుకట్టు వేయాలని డిమాండ్ చేస్తున్నాం. 

- కృష్ణలంక పీఎస్‌లో సీసీ ఫుటేజీ మాయం దారుణం – ‘సీబీఐ’ విచారణకు డిమాండ్.

ప్రస్తుతం విజయవాడలోని పోలీస్ స్టేషన్లు పేకాట, గంజాయి, సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయి.  కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ ఉదంతంలో ప్రమేయమున్న ప్రతి ఒక్క అధికారిపై చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనలో అంత్యక్రియలుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం అత్యంత దారుణం.  సిటీ పోలీస్ కమిషనర్ (సీపీ) ఆధ్వర్యంలో పనిచేసే టాస్క్ ఫోర్స్ వారే సాయికృష్ణను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు,  ఆ తర్వాత అక్కడ ఏమైందో, ఫుటేజీ ఎలా మాయమైందో సీపీ బయటకు వచ్చి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? సీసీ కెమెరా ఫుటేజీ మాయం కావడంపై పూర్తి స్థాయి విచారణ జరగాలి.  కూటమి ప్రభుత్వ పరిధిలోని సిట్ (SIT) మీద మాకు ఏమాత్రం నమ్మకం లేదుని దేవినేని అవినాష్ తేల్చి చెప్పారు.  ఈ మొత్తం  వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ‘సీబీఐ’ (CBI) తోనే విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేశారు.

Back to Top