పేద విద్యార్థులకు విద్యాసామగ్రి అందించండి 

ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా

  

విజయపురం(చిత్తూరు) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించే సాయమే తనకు నిజమైన సన్మానమని ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా అన్నారు. బుధవారం నగరి రూరల్‌ మండలం దామరపాకంలో రూ.2 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్‌షెల్టర్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం దామరపాకం దళితవాడలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. దామరపాకం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకు నోటు పుస్తకాలను అందజేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం గ్రామాలకు వచ్చినప్పుడు తనను అభినందించడానికి వచ్చేవారు శాలువలు, పూలదండలు తీసుకురావద్దని, ఆ ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు ఇచ్చే విద్యాసామగ్రి  పేద విద్యార్థుల చదువులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు కుమారస్వామి రెడ్డి, చంద్రారెడ్డి, బుజ్జిరెడ్డి, తిరుమలరెడ్డి, వేలాయుధం, ధర్మలింగం,  చంద్రారెడ్డి, గణపతిశెట్టి, విజయబాబు, సోమశేఖర్, రమేష్, మణి తదితరులు పాల్గొన్నారు.  

Back to Top