ఎస్కేయూలో వైయ‌స్ఆర్‌ విగ్రహం తొలగింపు

టీఎన్‌ఎస్‌ఎఫ్, టీడీపీ కార్యకర్తల బెదిరింపులకు తలొగ్గిన వర్సిటీ ఉన్నతాధికారులు

విద్యార్థుల వినతి మేరకు గతంలో వైయ‌స్ఆర్‌ విగ్రహం ఏర్పాటు

తాజాగా పరిస్థితులు మారడంతో అవమానకర రీతిలో తొలగింపు

భద్రంగా తన తోటకు తరలించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత

 అనంతపురం: తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) ఉన్నతాధికారులు దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అవమానకర రీతిలో తొలగించారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంతో పాటు లక్షలాది విద్యార్థులకు ఉచిత విద్యనందించిన డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని విశ్వవిద్యాలయంలో ప్రతిష్టించాలని గతంలో విద్యార్థులు, అధ్యాపకులు కోరారు.  దీనికి గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి, వర్సిటీ క్యాంపస్‌లో వైయ‌స్ఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

ఇందుకు వర్సిటీ నయా పైసా ఖర్చు చేయలేదు. ఎనిమిది మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఇచ్చిన నిధులతో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే.. తాజాగా టీడీపీ అధికారంలోకి రావడంతో ఎస్కేయూలోని వైయ‌స్ఆర్‌ విగ్రహాన్ని తొలగించాలని టీడీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.హుస్సేన్‌ రెడ్డి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎంవీ లక్ష్మయ్యలను గురువారం డిమాండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రంలోపు విగ్రహాన్ని తొలగించాలని, లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో హడలిపోయిన వీసీ, రిజిస్ట్రార్‌ గురువారం సాయంత్రమే హడావుడిగా పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారు. 

పాలక మండలి సభ్యుల్లో సింహభాగం వైయ‌స్ఆర్ విగ్రహం తొలగించడానికి సమ్మతించలేదు. అయినప్పటికీ వర్సిటీ ఉన్నతాధికారులు ఏకపక్షంగా శుక్రవారం ఉదయమే విగ్రహాన్ని తొలగించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆ వెంటనే పొక్లెయిన్‌తో విగ్రహాన్ని తొలగించారు. విగ్రహం తీసుకెళ్లాలని దాని ఏర్పాటుకు ఆర్థిక సాయం చేసిన అసోసియేట్‌ ప్రొఫెసర్లను కోరారు. వారు సమ్మతించలేదు. దీంతో విగ్రహాన్ని తమ తోటలో భద్రంగా పెట్టుకుంటామని ఓ వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు చెప్పడంతో ఆక్కడికి తరలించారు. టీడీపీ బెదిరింపులకు భయపడి, వర్సిటీ ఉన్నతాధికారులు విగ్రహాన్ని తొలగించడం పలు విమర్శలకు తావిచ్చింది.

టీడీపీ నేతల వైఖరి అప్రజాస్వామికం
ఎస్కేయూలో వైయ‌స్ఆర్‌ విగ్రహాన్ని తొలగించడం అప్రజాస్వామికం. గతంలో విగ్రహాల తొలగింపు సంస్కృతి లేదు. విద్యా వ్యవస్థ బలోపేతానికి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఎందరో పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు వైయ‌స్ఆర్ కృషి చేశారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఎస్కేయూలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు టీడీపీ నేతల ఒత్తిడితో విగ్రహాన్ని తొలగించడం గర్హనీయం. అనంతపురం జేఎన్‌టీయూలో ఎన్టీఆర్‌ ఆడిటోరియం నిర్మించి,  ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసినా వైఎస్సార్‌సీపీ పాలనలో ఏనాడూ ఆ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయలేదు. 

ఇందుకు భిన్నంగా టీడీపీ నేతలు వైయ‌స్ఆర్‌ విగ్రహాన్ని తొలగించడం దారుణం. ప్రజలకు మేలు చేసేందుకు ఎన్నికల్లో  గెలిపిస్తే, టీడీపీ నేతలు కక్ష సాధింపులకు, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారు. ఎస్కేయూలో మహానేత వైయ‌స్ఆర్‌ విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేయాలి. ఇందుకోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం.
­– మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రారామిరెడ్డి 

Back to Top