జనం కష్టాల్లో ఉంటే జల్సాల్లో సీఎం

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ధ్వ‌జం

కుటుంబంతో యూరప్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు  

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడున్నాడో తెలియదు

సరదాల కోసం ప్రత్యేక విమానాల్లో వీకెండ్‌ టూర్లు 

గుర్తు చేసిన పుత్తా శివశంకర్‌రెడ్డి

అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు

అయినా రైతులను ఆదుకునే దిక్కులేదు

ఫీజు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని ప్రభుత్వం

అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్న కూటమి పాలన 

ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌రెడ్డి స్పష్టీకరణ

తాడేపల్లి: కూటమి పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, గత కొన్నాళ్లుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అయినా వారిని ఆదుకునే దిక్కు లేకుండా పోయిందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. అకాల వర్షాల వల్ల అరటి తోటలు పడిపోయి, మామిడి పూత, పిందెలు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. మరోవైపు మిర్చి, ధాన్యం, పొగాకు పంటలకు మద్ధతు ధరలు దక్కడం లేదని, మిర్చి రైతులు రోడ్డు మీదనే తమ పంటను తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌రెడ్డి తెలిపారు.
ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

కమీషన్ల కోసం పరిశ్రమలపై వేధింపులు:
    కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజల జీవన విధానం దుర్భరంగా మారింది. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు వాటాల కోసం, కమీషన్ల కోసం పాకులాడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వేధింపులకు సిమెంట్‌ కంపెనీలు నడపలేని పరిస్థితి నెలకొందని టీడీపీ అనుకూల పత్రికే పతాక శీర్షికల్లో వార్తలు రాసింది. ఎమ్మెల్యేల కమీషన్ల దాహానికి రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు. జిందాల్‌ వంటి పరిశ్రమ మహారాష్ట్రకు వెళ్లిపోయింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉన్న పరిశ్రమలు కూడా మూసేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. 
    ఇప్పటికే తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రోడ్డెక్కి కమీషన్ల కోసం పంచాయతీలు పెట్టుకున్న ఘటన రాష్ట్ర ప్రజలంతా చూశారు. అయినా చంద్రబాబు వారిని నియంత్రించలేకపోవడంతో ఆదినారాయణరెడ్డి మరోసారి బరితెగించి సిమెంట్‌ కంపెనీలను బెదిరించే స్థాయికి వెళ్లారు.

సీఎం చంద్రబాబు జల్సా టూర్‌:
    రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం తన పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబంతో కలిసి యూరప్‌ టూర్‌కి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్‌ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. వీళ్లంతా పాలనను గాలికొదిలేసి ప్రతి వీకెండ్‌ కి విలాసాల కోసం ప్రత్యేక విమానాల్లో వెళ్లి జల్సా చేస్తున్నారు. ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు.

బకాయిల విడుదల లేదు:
    అకాల వర్షాలతో పంటలకు అపార నష్టం జరుగుతున్నా, ఆ పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి అండగా ఉంటామని చెప్పడానికి మంత్రులెవరూ బయటకు రావడం లేదు. రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు టీసీలు ఇవ్వకుండా వేధిస్తున్నాయి.
    మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యాలు పేదలకు ఉచిత వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి. పేదలు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నారని పుత్తా శివశంకర్‌రెడ్డి తెలిపారు.

Back to Top