ఇవ్వాల్సింది గాజులు కాదు.. కొట్టేసిన భూములు 

  ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి  
 

 విజయనగరం: రాజధాని ఉద్యమానికి తనవంతు విరాళం అన్నట్లుగా చంద్రబాబు భార్యతో గాజులిప్పించారని.. అసలు ఇవ్వాల్సింది గాజులు కాదని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో చౌకగా కొట్టేసిన రైతుల భూములను తిరిగివ్వాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి  డిమాండ్‌ చేశారు. ‘అమ్మా భువనేశ్వరి.. మీ కంపెనీ హెరిటేజ్‌ పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి 14.22 ఎకరాల భూమిని చౌకగా కొట్టేసింది. దయచేసి 14 ఎకరాలను తిరిగి ఆ రైతులకు ఇచ్చేయండి. ఇవాళ మీరిచ్చే గాజులకన్నా.. ఆ రైతుకు కలిగిన నష్టం వందల రెట్లు పెద్దది’ అని పుష్పశ్రీవాణి కోరారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులకు చంద్రబాబే కారణమన్న సంగతి అందరికీ తెలుసని.. గ్రాఫిక్స్‌ చూపించి రైతులు, ప్రజలను ఇంతకాలం భ్రమల్లో పెట్టి.. ఇప్పుడు వారి కుటుంబాలను రోడ్డు మీదకు తెచ్చారని మండిపడ్డారు. ఐదేళ్లలో రాజధాని ఎందుకు కట్టలేదు? తమ భూములను అభివృద్ధి చేసి ఎందుకివ్వలేదని రాజధాని గ్రామాల ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేదన్నారు.
చంద్రబాబు 2014 జూన్‌ 8 నుంచి డిసెంబర్‌ 14 వరకు నిద్రపోకుండా తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, సహచరులు కలసి 4,069 ఎకరాలను కొన్నట్టు వెల్లడైందని పేర్కొన్నారు. లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా అక్రమాలు బయట పడతాయన్నారు. ముందుగా 4,069 ఎకరాలను రైతులకు తిరిగి ఇప్పించాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఇంట్లోంచి బయటకు రాని భువనేశ్వరి ఇప్పుడు తమ భూముల కోసం బయటకు వచ్చారంటే ఆమెకు వ్యాపార, స్వప్రయోజనాలే ఎక్కువని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.  

తాజా వీడియోలు

Back to Top