అనంతపురం: పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీన పరిస్తే సహించేది లేదని, కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి హెచ్చరించారు. వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో వెన్నపూస రవీంద్రారెడ్డి పాల్గొని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే పంచాయత్ రాజ్ వ్యవస్థని ఇంత బలహీన పరచిన ప్రభుత్వలు ఎక్కడ లేవని ధ్వజమెత్తారు. కూలీలకు చెందాల్సిన ఉపాధి హామీ నిధులని సైతం టీడీపీ నేతలు దోచుకుంటున్నారని, కేంద్రం విడుదల చేసిన 15 వ ఫైనాన్స్ నిధులని కూడా దారి మళ్ళించిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి చెల్లిందన్నారు. సర్పంచ్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపి వారి పిల్లలకి చెందాల్సిన తల్లికి వందనం పథకంలో కోత విధించారని మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శులకు తక్షణమే పోస్టింగ్‌లు ఇచ్చి జీతాలు జమ చేయాలని కలెక్టర్ వినోద్‌ను కోరారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు యోగేంద్ర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శలు బసవ రాజు, బండి కిరణ్, సంయుక్త కార్యదర్శలు సీవీ రంగా రెడ్డి, సాదిక్ వలి, నియోజకవర్గ అధ్యక్షులు మూలి లోకనాథ్ రెడ్డి, విజయ కుమార్, తిప్పే స్వామి ,తిక్కస్వామి, భూతవి సుధాకర్, యోగేష్ రెడ్డి, చిన్న రంగా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.