తాడేపల్లి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించొద్దని కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసనలు చేపడుతున్నట్లు వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పదిహేను నెలల్లోనే విద్యారంగాన్ని పూర్తిగా నీరుగార్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బహిర్గతం అవుతాయనే భయంతోనే విద్యార్థి సంఘాలని ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి రాకుండా చీకటి ఉత్తర్వులిచ్చిందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహించిన లోకేష్ నేడు ఇలాంటి ఉత్తర్వులివ్వడం ఏంటని ప్రశ్నించారు. పాఠశాలల్లో విద్యార్థులకిచ్చిన బ్యాగులు నెల రోజుల్లోనే చిరిగిపోయాయి. మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా ఉన్నది. ఆంగ్ల బోధన అటకెక్కింది. సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయుల్ని కుదించి పాఠశాలల్ని రద్దు చేసింది. నాడు, నేడు రద్దు చేసి పాఠశాలల్ని నీర్వీర్యం చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కనీస వసతుల్ని కల్పించలేదు. ఇలాంటి సమస్యలన్నీ విద్యార్థి సంఘాల దృష్టికి వస్తాయనే లోకేష్ ఉత్తర్వులిచ్చారని విమర్శించారు. విద్యార్థుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలే అన్నారు. మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ లని రాజకీయ కార్యక్రమాలుగా మార్చింది చంద్రబాబు, లోకేష్ లే అని తీవ్రంగా వారు దుయ్య బట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కలుషితాహారం వల్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా కుడా లోకేష్ స్పందించడం లేదన్నారు. గత జగన్ హయాంలో సంక్షేమ కార్యక్రమాల గురించి విద్యార్థి నేతలు విద్యార్థులతో మాట్లాడే స్వేచ్ఛ ఉండేదని గుర్తుచేసారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి అప్రజాస్వామికమైన ఉత్తర్వులు ఐదేళ్లలో సీఎం గా జగన్ మోహన్ రెడ్డి ఇవ్వలేదని తెలిపారు. డా. బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రజాస్వామిక హక్కుల్ని లోకేష్ కాలరాస్తున్నారని తెలిపారు. విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు రాకూడదంటూ పాఠశాల విద్యా శాఖ, ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని 18 న అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు.