అది మహానాడు కాదు.. ‘దగా నాడు’

ప్రజలకు ఏం చేశారని ఈ సంబరాలు?

వైయ‌స్ఆర్‌సీపీ నేత పోతిన మహేష్‌ ఫైర్‌ 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ నేత పోతిన మహేష్‌.

మహానాడులో వైయ‌స్ జగన్ పై లోకేష్‌ వ్యక్తిగత విమర్శలు

మంత్రి నారా లోకేష్‌ మాటలు అత్యంత ఆక్షేపణీయం

నిప్పులు చెరిగిన పోతిన మహేష్‌

ఇదే లోకేష్‌ తల్లి తరపు తాత ఎన్టీఆర్‌ పేరే ఎందుకు చెబుతారు?

తండ్రి తరపు తాత ఖర్జూరనాయుడి పేరేందుకు చెప్పరు?

సంప్రదాయం ప్రకారం తండ్రి తరపు తాతనే ముఖ్యం కదా?

కేవలం రెండు ఎకరాలే ఇచ్చారని ఆయనపై కోపమా?

లోకేష్‌ ఏనాడైనా తన మేనత్తలను గౌరవంగా చూశారా?

‘నారా మహల్స్‌’ పూజలకు వారినెందుకు ఆహ్వానించలేదు?

సూటిగా ప్రశ్నించిన పోతిన మహేష్‌

ఏడాది పాలనలో ప్రజలకు ఒక్క మంచి అయినా చేశారా?

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా?

వైయ‌స్ జగన్‌ అమలు చేసిన పథకాలు ఎగ్గొట్టినందుకు సంబరాలా?

నాడు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్‌ ఎగ్గొట్టారు

ఇప్పుడు ఆరు సూత్రాలంటూ కొత్త పాట పాడుతున్నారు

పోతిన మహేష్‌ ఆక్షేపణ

సంక్షేమం లేక నిరుపేదలు పండుగలకూ దూరం 

అటు అవినీతి సొమ్ముతో టీడీపీ ఆర్భాట సంబరం

ఆత్మస్తుతి. పరనింద.. అదే దగానాడులో మహాపర్వం

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై విమర్శల పర్వం

టీడీపీ కూటమి పాలనలో యథేచ్ఛగా దోపిడి పర్వం

లిక్కర్, మైనింగ్, శాండ్‌.. ప్రతిచోటా మాఫియా రాజ్యం

ప్రెస్‌మీట్‌లో పోతిన మహేష్‌ ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందక ఏ ఒక్క పేద కుటుంబం కూడా కనీసం పండుగ కూడా జరుపులోని స్థితిలో ఉంటే, అవినీతి సొమ్ముతో చంద్రబాబు మాత్రం మహానాడు పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత పోతిన మహేష్‌ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ. ఏడాది పాలనలో ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనిని అయినా ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ అంటూ ఇచ్చిన హామీలను ఎగ్గొడుతూ, నేడు ఆరు సూత్రాలు అంటూ కొత్త పాట ప్రారంభించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రెస్‌మీట్‌లో పోతిన మహేష్‌ ఇంకా ఏమన్నారంటే..:

మహానాడు కాదు. దగానాడు:
    కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా తమ ఘనతగా చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఒక్క కార్యక్రమం కూడా లేకపోవడం సిగ్గుచేటు. ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కడపలో నిర్వహిస్తున్నది మహానాడు కాదు దగానాడు. ప్రజలను అనేక హామీలతో నమ్మించి, మోసం చేశారు. తమను తాము పొగుడుకోవడం, గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా మహానాడు అనే దగానాడును జరుపుకుంటున్నారు. 

గత ప్రభుత్వం చేసిన మంచిని నాశనం చేస్తున్నారు:
    ఈ ఏడాది పాలనలో చంద్రబాబు తన గుండెపై చేయి వేసుకుని ఇదీ మా ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు అని ఒక్కటైనా చెప్పుకోగలరా? గత ప్రభుత్వం చేసిన మంచిని కూడా కనుమరుగు చేస్తున్నారు. విద్య, వైద్యంతో పాటు, అన్ని రంగాలను, సంక్షేమాలను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా అవినీతి తాండవిస్తోంది. మట్టి, ఇసుక, మద్యం మాఫియా చెలరేగిపోతోంది. రూపాయికే వేల కోట్ల విలువైన భూములను తమ బినామీలకు కట్టబెడుతున్నారు. అందుకోసమేనా మహానాడులో తెలుగుదేశం వారు సంబరాలు చేసుకుంటున్నది?.

అందుకేనా ఈ సంబరాలు?:
    ఈ రాష్ట్రానికి మంచి చేస్తే, ప్రజలకు గొప్ప పాలనను అందిస్తే దానికి సంబరాలు చేసుకుంటే ఒక అర్థం ఉంటుంది. కానీ గత వైయస్‌ఆర్‌సీపీలో వైయస్‌ జగన్‌ అనేక సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరువ చేస్తే, వాటిని అర్థాంతరంగా రద్దు చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన ఇవ్వడం లేదు. డిగ్రీలు పూర్తి చేసుకున్న వారు ఉపాధి లభించక, ఇటు నిరుద్యోగ భృతి కూడా రాక, నిరాశ నిస్పృహతో ఉన్నారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా గవర్నమెంట్‌ స్కూళ్లు, ఆస్పత్రులను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దితే, వాటిని మళ్ళీ తిరోగమనంలోకి నడిపిస్తున్నందుకు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను, ఇంగ్లీష్‌ మీడియంను రద్దు చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా?.

తాత ఖర్జూరనాయుడి పేరెందుకు చెప్పరు?:
    మహానాడులో మంత్రి నారా లోకేష్‌ జగన్‌గారిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. తల్లి, చెల్లిని గెంటేశారంటూ, పిచ్చి మాటలు మాట్లాడారు. మరి ఇదే నారా లోకేష్‌ తన తల్లి తరుఫు తాత ఎన్టీఆర్‌ గురించి పదేపదే చెప్పుకుంటున్నారు కానీ, తన నాన్న చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడి పేరు ఎందుకు చెప్పుకోవడం లేదు?. సంప్రదాయం ప్రకారం తండ్రి తరుఫు తాతగారి పేరు చెప్పాలి కదా? మరి ఆ పని ఎందుకు చేయడం లేదు? కేవలం రెండు ఎకరాలు మాత్రమే తన తండ్రి చంద్రబాబుకు ఇచ్చారని తాత ఖర్జూరనాయుడిని లోకేష్‌ చిన్నచూపు చూస్తున్నారా?.
    అంతే కాదు, చంద్రబాబు కుటుంబసభ్యులు ఎవరు? ఆయన సోదరీమణులు ఎవరూ అంటే దానికి సమాధానం చెప్పరు. అమరావతిలో నిర్మిస్తున్న రాజభవనం భూమిపూజకు, కుప్పంలో భారీగా కట్టిన నారామహల్‌ గృహ ప్రవేశానికి లోకేష్‌ తన మేనత్తలను ఎందుకు ఆహ్వానించలేదు? వీటికి సమాధానం చెప్పాలి. మదీనాగూడాలో తన నాయినమ్మ ఆస్తిని లోకేష్‌ తన పేరుమీద రాయించుకున్నారు. కానీ తన తండ్రి తరుఫు బంధువులను ఎందుకు గౌరవించరో చెప్పాలి. 

ఆరు శాసననాలంటూ లోకేష్‌ అర్థం లేని మాటలు:
    ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ అంటూ ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. ఇప్పుడు తాజాగా ఆరుసూత్రాలు అంటూ మహానాడులో గొప్పగా చెప్పుకుంటున్నారు. రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్‌ సిలెండర్, ఉచిత బస్సు, యాభై ఏళ్ళకే బీసీ మహిళలకు పెన్షన్‌ ఏమయ్యాయయని ప్రశ్నిస్తున్నాం? చంద్రబాబు పాలనలో ఒక్క పథకం పేరు అయినా ప్రజలకు గుర్తుందా? ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా చేశారా? మంత్రి నారా లోకేష్‌ ఆరు సూత్రాలు కాదు ఆరు శాసనాలు అంటూ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని మరిచి నారా లోకేష్‌ తనకు తానే ఒక యువరాజులా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఆటవిక పాలన సాగిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ అరాచకం, విధ్వంసం, దాడలకు తెగబడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అందుకోసమేనా మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటున్నారు?.

ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని చెప్పగలరా?:
    తెలంగాణ, అండమాన్‌ నికోబార్‌లో తెలుగుదేశం పార్టీని విస్తరిస్తామని లోకేష్‌ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో అంతరిక్షంలో కూడా పార్టీని విస్తరిస్తారేమో!. అసలు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎన్నికలకు ఎప్పుడు వెళ్తుంది?. లేదూ ఎప్పుడూ పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామని చెబుతారా? వైయస్‌ జగన్‌ను స్పూర్తిగా తీసుకుని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని మహానాడులో ధైర్యంగా ప్రకటించగలరా? ఇలా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న అనుమానాలను నివృతి చేస్తారా? మహానాడులో ఎన్టీఆర్‌ చివరిదశలో ఉన్న వీడియోలు, ఆయన మాట్లాడిన మాటలను కూడా కార్యకర్తలు చూసేందుకు ప్రదర్శించాలి.

మహానాడు ఎజెండాలోనూ పచ్చి అబద్దాలు:
    మహానాడలో పెట్టిన ఎజెండాల్లో పెట్టుబడులు–ఉపాధి అనే అంశంపై చర్చ పెట్టారు. ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా? ఉన్న ఉద్యోగాలను ఎలా తీసేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్, ఫైబర్‌ నెట్, ఏపీఎండీసీ, వైద్య విభాగాల్లో వేలాది ఉద్యోగాలు తీసేశారు. ఇక కొత్తగా ఉపాధి ఎలా కల్పిస్తారు? నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి అమలు చేస్తారు? జాబ్‌ క్యాలెండర్‌ ఎప్పుడు విడుదల చేస్తారు? ఎప్పటి లోగా డీఎస్సీని పూర్తి చేసి, ఉద్యోగాలు ఇస్తారు? వీటన్నింటిపైనా లోకేష్‌ సమాధానం చెప్పాలి.
    సాంకేతిక పరిజ్ఞానం అనే ఎజెండాను కూడా పెట్టారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. జగన్‌ గారు పాలనలో తీసుకువచ్చిన ఒక విప్లవం ఇది. దానిని నాశనం చేశారు. వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేశారు. మాదకద్రవ్యాల మీద ఉక్కుపాదం అన్నారు. కానీ రాష్ట్రంలో కొకైన్‌ కేసులు నమోదవుతున్నాయి. మహానాడు వేదికపైన వీటిపై మాట్లాడాలి కదా? పీ–4 అంటూ పేదరికం లేని సమాజం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారార్భాటం చేస్తున్నారు. పేదరికం లేని సమాజం కోసమే ఆనాడు వైయస్‌ జగన్‌ గారు స్పష్టమైన తేదీతో సంక్షేమ క్యాలెండర్‌ను అమలు చేశారు. పేదరికం నిర్మూలన కోసం నాణ్యమైన విద్య, పోర్ట్‌లు, హార్బర్ల నిర్మాణం, అర్హులైన వారికి ఉచిత నివాస స్థలాలను కల్పించారు.
    మహిళా శిక్ష సంక్షేమం గురించి మహానాడు ఎజెండాలో పెట్టారు. కానీ కూటమి పాలనలో మహిళలను మోసం చేశారు. ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్‌ సిలెండర్, ఉచిత బస్సు, ఆసరా, చేయూత పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు? మహిళలను మోసం చేసి, దగా చేసి ఓట్లు వేయించుకున్నారు. వీటిపై మహానాడు వేదికపై చర్చ చేయాలి. రాష్ట్రంలో మహిళలపై ఇష్టారాజ్యంగా దాడులు జరుగుతున్నాయి. కడపలో నాలుగేళ్ళ పాపపై లైంగికదాడి, హత్య జరిగింది. కూటమి పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. వాటిపై మహానాడులో మాట్లాడాలి. 

రైతులకు చేసిన మోసాన్ని మహానాడులో మాట్లాడాలి:
    రైతుల గురించి మహానాడులో మాట్లాడుతున్నారు. గత ఏడాది రైతుభరోసాను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. రెండో ఏడాది కూడా ఇస్తారో, ఇవ్వరో తెలియదు. ధరల స్థిరీకరణ నిధి ఏమయ్యింది? పంటల బీమా, సున్నావడ్డీ రుణాలు ఏమయ్యాయి? రైతులను మాయ చేసి నట్టేట ముంచారు. రైతులు పండించిన పంటలకు మద్దతుధరలు లభించడం లేదు. మిర్చి, ధాన్యం, పొగాకు ఇలా ఏ పంట చూసినా ధరలు లేక రైతులు కన్నీరుకారుస్తున్నారు. రాష్ట్రంలో దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. రాష్ట్రంలో ప్రజలు దగ్గర డబ్బులు లేవు. శుభకార్యాలు చేసుకునేందుకు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం అవినీతి సొమ్ముతో మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటోంది. ఇసుక, మద్యం, భూముల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో పండుగ చేసుకుంటున్నారు. 

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..

పవన్‌కళ్యాణ్‌ చీప్‌ ట్రిక్స్‌:
    సినిమా థియేటర్ల బంద్‌ వ్యవహారంలో జనసేనకు చెందిన అత్తి సత్యనారాయణను అడ్డం పెట్టుకుని పవన్‌ కళ్యాణ్‌ చీప్‌ ట్రిక్స్‌కు పాల్పడ్డారు. దాన్ని వైయ‌స్ఆర్‌సీపీకి అంటగట్టి బురద చల్లే ప్రయత్నం చేశారు. తీరా విషయం అందరికీ తెలియడంతో సత్యనారాయణను పార్టీ నుంచి బహిష్కరించారు. తన సినిమా రిలీజ్‌ విషయంలో ప్రతిసారీ పవన్‌కళ్యాణ్‌ ఇలాగే గోల చేస్తారు. గందరగోళం సృష్టిస్తారు. తన ఆదాయం కోసం యువతను థియేటర్లకు రప్పించి తన బాగు మాత్రమే చూసుకుంటారు.

Back to Top